Share News

CM Chandrababu: ఉత్తరాంధ్రకు ఎంతో చేస్తున్నాం

ABN , Publish Date - Oct 11 , 2025 | 05:45 AM

అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖకు, ఉత్తరాంధ్రకు చాలా చేస్తున్నామని.. అయినా వాటిని చెప్పుకోవడంలో విఫలమవుతున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

CM Chandrababu: ఉత్తరాంధ్రకు ఎంతో చేస్తున్నాం

  • అయినా చెప్పుకోవడంలో విఫలమవుతున్నాం: సీఎం

  • ఇవన్నీ మంత్రులు ప్రజల్లోకి తీసుకెళ్లాలి

  • క్యాబినెట్‌ భేటీలో చంద్రబాబు స్పష్టీకరణ

అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖకు, ఉత్తరాంధ్రకు చాలా చేస్తున్నామని.. అయినా వాటిని చెప్పుకోవడంలో విఫలమవుతున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు చాలా చేశామని, మన ప్రయత్నాల వల్లే అది ప్రైవేటీకరణ కాకుండా.. మూత పడకుండా కాపాడగలిగామన్నారు. శుక్రవారం క్యాబినెట్‌ భేటీలో ఎజెండా అంశాలపై చర్చ అనంతరం మంత్రివర్గ సహచరులనుద్దేశించి ఆయన మాట్లాడారు. విశాఖకు రైల్వే జోన్‌, ఐటీ సంస్థలు, త్వరలోనే గూగుల్‌ డేటా సెంటర్‌ వంటివి వస్తున్నాయని.. ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌కు త్వరలో శంకుస్థాపన కూడా చేయబోతున్నామని.. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులను కోరారు. పర్యాటక ప్రాజెక్టులు తీసుకున్న వారెవరూ తనను కలవడం లేదని.. కార్యదర్శులను కలిసి మాట్లాడుకుని వెళ్లిపోతున్నారని మంత్రి కందుల దుర్గేశ్‌ సీఎం దృష్టికి తీసుకురాగా ఆయన స్పందించారు. శాఖల నిర్వహణలో కార్యదర్శుల పాత్ర కీలకమే అయినా ముందుండి నడిపించాల్సింది మంత్రులేనని స్పష్టం చేశారు. ఎవరైనా పనిచేయకపోతే పిలిచి మందలించాలని, అధికారులతో మంచిగా పనిచేయించుకోవలసిన బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. ‘మీ శాఖలో జరిగే మంచిని ప్రచారం చేసుకోకపోతే నష్టపోయేది మీరే. రేపు ఎన్నికల్లో పోటీ చేయాల్సింది మీరే గానీ కార్యదర్శులు కాదు. ఇది గుర్తు పెట్టుకుని మీ శాఖల పనితీరును మెరుగుపరచడంలో కీలకంగా వ్యవహరించండి ఆ క్రెడిట్‌ కూడా తీసుకోండి’ అని దిశానిర్దేశం చేశారు.


ఇన్ని పెట్టుబడులు నా 15 ఏళ్లలో తీసుకురాలేదు

తాను సీఎంగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్నానని, తన మొ త్తం పదవీకాలంలో ఈ ఏడాదిన్నరలో తీసుకొచ్చినన్ని పెట్టుబడులు తీసుకురాలేదని సీఎం చెప్పారు. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పందిస్తూ.. గూగుల్‌ డేటా సెంటర్‌ మనకు రావడం చాలా మంచి పరిణామమన్నారు. పారిశుద్ధ్య కార్మికులను స్కావెంజర్స్‌ వంటి పదాలతో పిలవడమనే సంస్కృతిని మార్చాల్సిన అవసరం ఉందని ప్రస్తావించగా.. సీఎం ఏకీభవించారు. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ సమావేశాలకు కాన్ఫరెన్స్‌ హాలు కట్టడం మంచిదన్న మంత్రి లోకేశ్‌ సూచనతో మంత్రులంతా ఏకీభవించారు. పశ్చిమ తీరంలో ముంబై నగరం ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో.. తూర్పుతీరంలో విశాఖ కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందుతుందని సీఎం చెప్పారు.

కులమతాల చిచ్చు వైసీపీ ఎజెండా: లోకేశ్‌

క్యాబినెట్‌ భేటీకి ముందు మంత్రి లోకేశ్‌ వద్ద మంత్రుల అల్పాహార సమావేశం జరిగింది. పలు చిత్తూరు జిల్లాలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని వైసీపీ సర్పంచ్‌ దహనం చేసి ప్రభుత్వంపై నిందలు వేశారని, నిందితులపై కేసు పెడితే సిగ్గులేకుండా వైసీపీ వాళ్లు ఆందోళన చేస్తున్నారని లోకేశ్‌ మండిపడ్డారు. కులాలు, మతాలు మధ్య చిచ్చు పెట్టడమే వైసీపీ వారి ఎజెండా అని ధ్వజమెత్తారు. ఘటనాస్థలానికి వెళ్లాలని హోం మంత్రి అనితకు సూచించారు.

క్యాబినెట్‌ ముందుకురాని క్వాంటమ్‌ పాలసీ

ఆర్థికశాఖ జాప్యం చేయడంతో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ పాలసీ క్యాబినెట్‌ ముందుకు రాలేదు. దీనిపై ఐటీశాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ను సీఎం ఆరా తీశారు. ఆర్థిక శాఖ శుక్రవారం ఉదయమే ఈ ఫైలును పంపిందని.. న్యాయశాఖ, సీఎం, మంత్రి లోకేశ్‌, సీఎస్‌ ఆమోదించిన తర్వాతే క్యాబినెట్‌ ముందు పెట్టాల్సి ఉన్నందున.. ఈ ప్రతిపాదనను వచ్చే మంత్రివర్గ భేటీకి వాయిదా వేసినట్లు ఐటీ శాఖ వివరించింది.

Updated Date - Oct 11 , 2025 | 05:46 AM