AP CM Chandrababu: విజన్ ఉంటేనే అభివృద్ధి
ABN , Publish Date - Nov 05 , 2025 | 05:19 AM
ముందుచూపు ఉంటేనే ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధ్యమని, రేపటి తరం భవిష్యత్ కోసం సరైన వేదికలను సిద్ధం చేయాల్సిన బాధ్యత పాలకులు, నేటి తరం పారిశ్రామికవేత్తలపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఏఐ టెక్నాలజీదే భవిష్యత్.. దీనికనుగుణంగానే మా ప్రణాళికలు: సీఎం
ముందుచూపు ఉంటేనే ఏ రంగంలోనైనా పురోగతి
రేపటి తరం భవిష్యత్ కోసం సరైన వేదికలను సిద్ధం చేయాలి
ఆ బాధ్యత పాలకులు, పారిశ్రామికవేత్తలదే
ప్రభుత్వాలు, ప్రైవేటు కలిసి పనిచేయాలి
ఏడాదిలో రాష్ట్రానికి 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించాం
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సదస్సులో చంద్రబాబు కీలకోపన్యాసం
ప్రపంచ మార్పులకు అనుగుణంగా మనమూ మారుతూ ఉండాలి. ప్రస్తుతం కేవలం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సరిపోదు.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా అవసరమే.భవిష్యత్ సవాళ్లను అధిగమించేలా, యువత నైపుణ్యం సాధించేలా విద్యాసంస్థలు, పారిశ్రామిక వర్గాలు, ప్రభుత్వం కలిసి పరస్పరం సహకరించుకోవాలి.
- సీఎం చంద్రబాబు
అమరావతి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ముందుచూపు ఉంటేనే ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధ్యమని, రేపటి తరం భవిష్యత్ కోసం సరైన వేదికలను సిద్ధం చేయాల్సిన బాధ్యత పాలకులు, నేటి తరం పారిశ్రామికవేత్తలపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. లండన్‌లో ప్రతిష్ఠాత్మక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐవోడీ) సంస్థ ఆయన సతీమణి భువనేశ్వరికి మంగళవారం రెండు అవార్డులు అందించింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. ఐవోడీ సంస్థ కార్పొరేట్ ప్రపంచానికి 35 ఏళ్లుగా సేవలందిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. ప్రపంచంలో రకరకాల మార్పులు వస్తున్నాయని, దానికి అనుగుణంగా ప్రభుత్వాలు గానీ, సంస్థలు గానీ తమ ప్రణాళికల్లో మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు టెక్నాలజీ విసిరే సవాళ్లను ఎదుర్కొనేందుకు దూరదృష్టి, పక్కా ప్లానింగ్ ఉండాలని సూచించారు. ‘1990ల్లో ఐటీ రంగ భవిష్యత్‌పై సందేహాలున్నా.. ఉమ్మడి ఏపీ సీఎంగా బిల్‌గేట్స్‌ను ఆహ్వానించి హైదరాబాద్‌లో మైక్రోసా్‌ఫ్టను స్థాపించేందుకు చొరవ తీసుకున్నాను. ఇప్పుడు భారతీయులు ప్రత్యేకించి తెలుగువారు గ్లోబల్ ఐటీ రంగంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) చాలా వేగంగా విస్తరిస్తోంది. భవిష్యత్ మొత్తం దాని చుట్టూనే తిరగనుంది. దీనికి అనుగుణంగా ఏపీలో విధానాలను, ప్రణాళికలను రూపొందించుకుంటున్నాం. గూగుల్ తన అతిపెద్ద ఏఐ కేంద్రాన్ని అమెరికా వెలుపల విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తోంది. ఇది రాష్ట్రంలో ఇన్నోవేషన్స్, రీసెర్చ్, స్కిల్ డెవల్‌పమెంట్ వంటి అంశాల అభివృద్ధికి దోహదపడుతుంది’ అని సీఎం చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే..
టెక్నాలజీతో మెరుగైన సేవలు
టెక్నాలజీ అనేది ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడేలా ఉండాలి. సాంకేతికతతో మెరుగైన సేవలు అందించేలా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి, మేం ఆ దిశగానే ప్రయాణిస్తున్నాం. ఇటీవల ఏపీని తాకిన మొంథా తుఫాన్ సమయంలో డేటా డ్రివెన్ రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ వల్ల కచ్చితమైన అంచనాలు రూపొందించాం. ప్రిడిక్టివ్ అనలిటిక్స్ ద్వారా ప్రాణ, ఆస్తినష్టాన్ని తగ్గించాం. పాలనను ప్రజలకు మరింత దగ్గర చేసేలా 700కుపైగా పౌరసేవలను నేరుగా వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చాం. ఏపీ ప్రభుత్వం రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్‌ను స్థాపించింది. కేవలం ఒక్క సంవత్సరంలోనే 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించింది. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా దేశ లక్ష్యాలను కూడా ఏపీ పంచుకుంటోంది. కొత్త రాజధాని అమరావతిని బ్లూ, గ్రీన్ సిటీ నమూనాగా రూపొందించాం.
ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వాతావరణ మార్పులు దేశాలను, పౌరులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నా యి. దీనిని దీర్ఘకాలంలో పరిష్కరించుకునే సమయం మనకు లేదు. ప్రతికూల వాతావరణాలతో పెనుము ప్పు ఎదుర్కోకముందే మనం మేలుకోవాలి. వసుధైక కుటుంబం అనే భారతీయ భావనతో దేశాలన్నీ కలిసి పనిచేయాలి. దేశాలు, భాషలు, సంప్రదాయాలు వేరై నా అంతా కలిసి భూమిపైనే నివసిస్తున్నాం. భావి త రాలకు మెరుగైన పరిస్థితులను కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. దీనికి ప్రభుత్వాలు, ప్రైవేటు రంగం కలిసి పనిచేయాలి. అప్పుడే భావితరం సురక్షితంగా ఉంటుంది. భారత్, యూకే నడుమ సుదీర్ఘమైన చారిత్రక బంధం ఉంది. దీనిని ఎప్పటికప్పుడు బలోపేతం చేసుకుంటూ వస్తున్నాయి. ఈ ఏడాది జూలైలో ఇరుదేశాల మధ్య కుదిరిన ఆర్థిక, వాణిజ్య ఒప్పందం ద్వైపాక్షిక సంబంధాల్లో మైలురాయి. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు వంటి వాటిలో సహకారానికి ఈ ఒప్పందం బలమైన పునాది వేసింది. భారత్ తన 100వ స్వాతంత్య్రదినోత్సవం నాటికి ప్రపంచంలోనే నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఆకాంక్షిస్తోంది.. ఆ దిశగా అడుగులు వేస్తోంది.
భువనేశ్వరికి అభినందనలు
ప్రతిష్ఠాత్మక సంస్థగా ఐవోడీకి ప్రపంచవ్యాప్తంగా పేరుంది. ఇలాంటి సంస్థ భువనేశ్వరి సేవలను గుర్తించడం చాలా సంతోషాన్నిస్తోంది. ఈ అవార్డులు దక్కించుకున్నందుకు ఆమెకు అభినందనలు.
యూకే వర్సిటీలతో ఏపీ భాగస్వామ్యం!
లండన్‌లోని భారత్ హైకమిషనర్‌తో సీఎం చర్చ
అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): లండన్‌లోని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామితో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అ య్యారు. మంగళవారం జరిగిన ఈ భేటీలో యూకేలోని వివిధ విశ్వవిద్యాలయాలతో రాష్ట్రప్రభుత్వం నాలుగు అంశాల్లో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకునే అంశంపై చర్చ జరిగింది. ఏపీలో ఆయా వర్సిటీల కేంద్రాలను ప్రారంభించడంపైన, కేంద్రం స హకారంతో జాయింట్ వెంచర్ ఏర్పాటుపైనా చ ర్చించారు. లండన్ వర్సిటీలు ఏపీ విద్యాసంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకునే అంశాన్ని పరిశీలించాలని, అలాగే విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల మధ్య విద్యార్థుల ఎక్స్ఛేంజ్ అంశంపై దృష్టి సారించాలని సీఎం కోరారు. లైఫ్ సైన్సెస్, బయో జెనెటిక్స్, ఖనిజాల వెలికితీత, మెటల్స్ అంశాల్లో ఏపీ, యూకే వర్సిటీల మధ్య భాగస్వామ్యాల గురించి.. ఏఐ, సెమీకండక్టర్, మెరైన్ ఇండస్ట్రీ 4.0లో సహకారంపైనా దొరస్వామితో ఆయన చర్చించారు.