Share News

Airbus H160: సీఎం హెలికాప్టర్‌ మారింది

ABN , Publish Date - Sep 06 , 2025 | 05:31 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు వినియోగిస్తున్న హెలికాప్టర్‌ను మార్చారు. బెల్‌ కంపెనీకి చెందిన చాపర్‌ను సీఎం సహా వీవీఐపీల పర్యటనల కోసం అద్దె ప్రాతిపదికన ప్రభుత్వం ఇన్నాళ్లూ వినియోగించింది.

Airbus H160: సీఎం హెలికాప్టర్‌ మారింది

  • మరో కంపెనీ చాపర్‌ను అద్దెకు తీసుకున్న ప్రభుత్వం

  • సీఎం కోసం హెలికాప్టర్‌ కొన్నారన్న ఫేక్‌ ప్రచారంపై ప్రభుత్వం సీరియస్‌

అమరావతి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు వినియోగిస్తున్న హెలికాప్టర్‌ను మార్చారు. బెల్‌ కంపెనీకి చెందిన చాపర్‌ను సీఎం సహా వీవీఐపీల పర్యటనల కోసం అద్దె ప్రాతిపదికన ప్రభుత్వం ఇన్నాళ్లూ వినియోగించింది. అయితే అందులో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండడంతో దాని స్థానంలో ఎయిర్‌బస్‌ కంపెనీ హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఓసారి.. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పర్యటనలో మరోసారి బెల్‌ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు వచ్చాయి. గోయల్‌ గతంలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టుకు బెల్‌ హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉండగా.. సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆయన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇటీవల కాలంలో పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తడంతోపాటు టేకాఫ్‌కు ఎక్కువ సమయం తీసుకోవడం వంటి ఇబ్బందులు వచ్చాయి. దీంతో ఈ హెలికాప్టర్‌ను కొనసాగించవచ్చా? లేదా? అనే అంశంపై పరిశీలన చేసిన భద్రతా సిబ్బంది.. దాని స్థానంలో వేరే హెలికాప్టర్‌ను వినియోగించాలని సూచించారు. ఈ మేరకు ఎయిర్‌బస్‌ హెచ్‌ 160 చాపర్‌ను అద్దెకు తీసుకున్నారు. ఇప్పటి వరకు హెలికాప్టర్‌ వినియోగానికి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందో.. తాజాగా అద్దెకు తీసుకున్న దానికి కూడా దాదాపు అంతే ఖర్చు కానున్నట్లు సమాచారం. ఎయిర్‌బస్‌ చాపర్‌ గతంలో వాడిన దానికన్నా అధునాతనమైనది. దీనిలో నేరుగా రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా ప్రయాణం చేయవచ్చు. భద్రతాపరంగా కూడా గత హెలికాప్టర్‌ కంటే మెరుగైనది. కాగా, అద్దె హెలికాప్టర్‌ను వినియోగిస్తుంటే కొత్త హెలికాప్టర్‌ కొనుగోలు చేశారనే ఫేక్‌ ప్రచారాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. తప్పుడు ప్రచారంతో ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నవారిపై కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Updated Date - Sep 06 , 2025 | 05:32 AM