Insurance compensation: హెడ్‌కానిస్టేబుల్ కుటుంబానికి కోటి పరిహారం
ABN , Publish Date - Dec 30 , 2025 | 04:31 AM
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)తో కలిసి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ’ (ఎస్‌జీఎ్‌సపీ) పథకం..
చెక్కు అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ఉద్యోగుల కోసం ప్రభుత్వం ప్రత్యేక బీమా పథకం
రూపాయి ప్రీమియం లేకుండానే భారీ పరిహారం
అమరావతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)తో కలిసి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ’ (ఎస్‌జీఎ్‌సపీ) పథకం.. ఇటీవల ప్రమాదవశాత్తు మృతిచెందిన ఓ హెడ్ కానిస్టేబల్ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించింది. ఎక్సైజ్ శాఖ హెడ్ కానిస్టేబుల్ పిచ్చేశ్వరరావు ఈ ఏడాది జూలైలో ప్రమాదవశాత్తు మృతిచెందగా.. ఆయన కుటుంబానికి మొట్టమొదటగా రూ.కోటి బీమా పరిహారం అందింది. హెడ్ కానిస్టేబుల్ భార్య వెంకటదుర్గకు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సచివాలయంలో రూ.కోటి చెక్కును అందజేశారు. ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్లు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు బీమా కల్పించేందుకు ప్రభుత్వం ‘స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ’ (ఎస్‌జీఎ్‌సపీ) పథకాన్ని అమలుచేసేందుకు ఈ ఏడాది ఆ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది. ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్లు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుంది. ఇందుకోసం ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత విధి నిర్వహణలో మృతిచెందిన పిచ్చేశ్వరరావుకు ముందుగా ఈ పరిహారం లభించింది. చెక్కు అందజేత సందర్భంగా ఆ కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని సీఎం భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా, కమిషనర్ సీహెచ్ శ్రీధర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ, ఎక్సైజ్ ఉద్యోగ సంఘాల నేతలు బి.నర్సింహులు, కామేశ్వరరావు, ప్రభాకర్‌రావు, వెంకట రమణ ఉన్నారు.