State employees: ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Dec 19 , 2025 | 05:52 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట మేరకు ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులు వేలాది మందికి పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్..
ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు
భీమవరం టౌన్, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట మేరకు ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులు వేలాది మందికి పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గురువారం జరిగిన ఏపీ జేఎసీ జిల్లా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉద్యోగినులకు చైల్డ్ కేర్ లీవ్ సర్వీస్ మొత్తంలో ఎప్పుడైనా వాడుకునేలా చారిత్రాత్మక ఉత్తర్వులు ఇటీవల జారీ చేశారన్నారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పూర్తిస్థాయిలో 60 రోజుల్లో వినియోగంలోకి తెచ్చేందుకు మంత్రులు, ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులతో రాష్ట్ర స్థాయి కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆన్‌లైన్‌లో ఒకేసారి వచ్చేలా త్వరలో ఉత్తర్వులు రాబోతున్నాయని బొప్పరాజు వివరించారు. ఆర్థికపరమైన అంశాలపై కూడా రాబోయే రోజుల్లో సీఎం సానుకూల నిర్ణయం తీసుకుంటారని నమ్మకం ఉందని తెలిపారు. ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ఉద్యోగులంతా కలసికట్టుగా ఉండాలని, వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర మహాసభకు ప్రతీ ఒక్కరూ ఐక్యత చాటాలని ఆయన కోరారు.