Share News

CM Chandrababu: మీ విజయం ఎందరికో స్ఫూర్తినివ్వాలి

ABN , Publish Date - Aug 26 , 2025 | 04:23 AM

వజ్రమైనా సానబెడితేనే దాని విలువ తెలుస్తుందని.. అలాగే మట్టిలో మాణిక్యాలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

CM Chandrababu: మీ విజయం ఎందరికో స్ఫూర్తినివ్వాలి

ఉన్నత చదువుల్లోనూ మరింత ప్రతిభ చూపాలి

జాతీయ స్థాయిలో రాణించిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో సీఎం

ఐఐటీ, నిట్‌, నీట్‌కు రాష్ట్రం నుంచి 55 మంది ఎంపిక

ఈ సంఖ్య వచ్చే ఏడాది నాలుగు రెట్లు పెరగాలని ఆకాంక్ష

ఈ ఏడాది కొత్తగా 7 కోచింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు ఆదేశాలు

అమరావతి, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): వజ్రమైనా సానబెడితేనే దాని విలువ తెలుస్తుందని.. అలాగే మట్టిలో మాణిక్యాలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులు ఈ ఏడాది ఐఐటీ, నిట్‌, నీట్‌లలో సాధించిన విజయాలే అందుకు నిదర్శనమని చెప్పారు. వీళ్ల విజయం ఎందరికో స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో సత్తాచాటి.. ఐఐటీ, నిట్‌, నీట్‌లలో సీట్లు సాధించిన 55 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సోమవారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన చంద్రబాబు... ఉన్నత చదువుల్లోనూ మరింత ప్రతిభ చూపాలని సూచించారు. భవిష్యత్‌ను ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. మెమొంటోలతోపాటు ఒక్కో విద్యార్థికి ప్రోత్సాహకంగా రూ.లక్ష చొప్పున చెక్‌ అందించారు. సమావేశంలో మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, అధికారులు పాల్గొన్నారు.


ఈ ఏడాది కొత్తగా 7 కోచింగ్‌ సెంటర్లు

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ ఏడాది కొత్తగా మరో 7 ఐఐటీ-నీట్‌ కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసే ఈ సెంటర్లతో 1,411 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేలా సాంఘిక సంక్షేమ విద్యాసంస్థలు రూపుదిద్దుకోవాలని అన్నారు. మన విద్యార్థుల్లో ప్రతిభకు కొదవ లేదని, వారికి సరైన వసతులు, ప్రోత్సాహం అందిస్తే ప్రపంచంలో అందరితో పోటీపడే సత్తా వారిలో ఉందని చెప్పారు. అందుకు ఈ 55 మంది విద్యార్థులే నిదర్శనమన్నారు. సాంఘిక సంక్షేమ విద్యాసంస్థల నుంచి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఎంపికయ్యే విద్యార్థుల సంఖ్య వచ్చే ఏడాది నాలుగు రెట్లు పెరగాలన్నారు. ఇప్పుడు ర్యాంకులు సాధించిన విద్యార్థులు తాము చదువుకున్న విద్యాసంస్థలకు వెళ్లి అక్కడి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపాలని సూచించారు.


356 మందికి శిక్షణ...55 మంది ఎంపిక...

కర్నూలు జిల్లా చిన్నటేకూరు, ఎన్టీఆర్‌ జిల్లా కుంటముక్కల, గుంటూరు జిల్లా అడవి తక్కెళ్లపాడులోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఐఐటీ-నీట్‌ సెంటర్లలో ఈ 55 మంది కోచింగ్‌ తీసుకుని ర్యాంకులు సాధించారు. ఈ సెంటర్లలో జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌లో 176 మంది శిక్షణ పొందగా 129 మంది క్వాలిఫై అయ్యారు. నీట్‌కు 180 మంది కోచింగ్‌ తీసుకోగా 143 మంది అర్హత సాధించారు. చివరగా ఐఐటీలో 12 మంది, నిట్‌లో 30 మంది, నీట్‌ ఎంబీబీఎ్‌సలో 13 మంది విద్యార్థులు సీట్లు సాధించారు. మొత్తం 55 మంది విద్యార్థుల్లో 20 మంది విద్యార్థినులు ఉండటం విశేషం. బీడీఎ్‌సలో మరో 14 మందికి, జీఎ్‌ఫటీఐ, సెంట్రల్‌ యూనివర్సిటీల్లో 19 మందికి సీట్లు వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Aug 26 , 2025 | 06:12 AM