CM Chandrababu: బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారా
ABN , Publish Date - Oct 24 , 2025 | 03:27 AM
ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఓవైపు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు తాను విదేశాల్లో పర్యటిస్తుంటే..
ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నేతలపై సీఎం ఆగ్రహం
పెట్టుబడుల కోసం నేను విదేశాల్లో పర్యటిస్తుంటే రచ్చచేస్తారా?
క్రమశిక్షణారాహిత్యాన్ని సహించను
పార్టీ కార్యాలయానికి ఎవరినీ పిలవొద్దు
నేనొచ్చాక సంగతి తేలుస్తా.. పల్లాకు ఆదేశం
అమరావతి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఓవైపు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు తాను విదేశాల్లో పర్యటిస్తుంటే.. కొందరు నేతలు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో అయినా, ప్రభుత్వంలో అయినా.. సానుకూలతను దెబ్బతీసేలా, క్రమశిక్షణ ఉల్లంఘించేలా వ్యవహరించేవారిని ఇక ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. క్రమశిక్షణరాహిత్యంతో మీడియాలో.. సోషల్ మీడియాలో రచ్చకు దిగడంపై అసహనం వ్యక్తం చేశారు. దుబాయ్ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో ఆయన ఫోన్లో మాట్లాడారు. జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్ నేతలు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం, వివాదాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేయడం ఏమిటని ఆగ్రహించారు. పల్లా స్పందిస్తూ.. వివాదానికి కారణమైన ఇద్దరు నేతలనూ పిలిపించి మాట్లాడతానని చెప్పారు. పార్టీ గీత దాటిన నేతలతో మాట్లాడాల్సిన అవసరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. తాను యూఏఈ నుంచి వచ్చాక దీనిపై దృష్టిసారిస్తానని, అప్పటి వరకు ఎవరినీ పిలిపించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఏమైనా ఇబ్బందులుంటే పార్టీ అంతర్గత వేదికపై చర్చించుకోవాలని.. ఇలా బహిరంగ విమర్శలు చేసుకోవడం క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని, బాధ్యతారహిత వ్యాఖ్యలతో అనవసరమైన చర్చకు తావిచ్చేలా వ్యవహరించడం సమంజసం కాదని, కఠినంగా డీల్ చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. సీఎం ఆగ్రహం నేపథ్యంలో జిల్లా నేతలతో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశాన్ని పల్లా రద్దు చేశారు.