CM Chandrababu: మహిళా ప్రయాణికుల పట్ల మర్యాద
ABN , Publish Date - Aug 13 , 2025 | 05:42 AM
రాష్ట్రంలోని మహిళలకు కూటమి ప్రభుత్వం అందిస్తోన్న ఉచిత ప్రయాణం (స్త్రీ శక్తి) అమలులో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా జాగ్రత్త పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలిచ్చారు.
వారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
ఆర్టీసీ అధికారులకు సీఎం దిశానిర్దేశం
అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మహిళలకు కూటమి ప్రభుత్వం అందిస్తోన్న ఉచిత ప్రయాణం (స్త్రీ శక్తి) అమలులో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా జాగ్రత్త పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలిచ్చారు. మహిళా ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని స్పష్టం చేశారు. రద్దీ నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలని, ముఖ్యంగా మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. శుక్రవారం నుంచి ఏపీఎస్ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలుపై మంగళవారం ఆర్టీసీ అధికారులతో సీఎం సమీక్షించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, యువతులు, థర్డ్ జెండర్లు ఉచిత ప్రయాణానికి అనుమతిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఆధార్ కార్డు చూపించి కండక్టర్ జారీ చేసే జీరో ఫేర్ టికెట్‌తో ప్రయాణించవచ్చు. స్త్రీ శక్తి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం కసరత్తు పూర్తి చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బస్సులతో మొదలు పెట్టి, అవసరం మేరకు భవిష్యత్తులో కొత్త బస్సులు సమకూర్చుకోనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. డ్రైవర్ల కొరత ఉండటంతో ఆన్ కాల్ డ్రైవర్లను నియమించుకుంటామని తెలిపారు. ‘స్త్రీ శక్తి అమలులో ఎదురయ్యే సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేయండి. బస్ స్టేషన్లన్నీ శుభ్రంగా ఉంచాలి. బస్సులు బ్రేక్ డౌన్ రాకుండా చూసుకోవాలి. జీరో ఫేర్ టికెట్లు సిద్ధం చేసుకోండి’ అని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఆటో డ్రైవర్లకు కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న పథకాలేంటి? వాటితో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సహకారం అందించేందుకు సమగ్రంగా అధ్యయనం చేయాలని రవాణా శాఖ అధికారుల సమీక్షలో సీఎం ఆదేశించారు.