CM Chandrababu Emphasizes: ఆదాయార్జనపై మరింత శ్రద్ధ
ABN , Publish Date - Aug 15 , 2025 | 05:07 AM
ఆదాయార్జనపై మరింత శ్రద్ధ వహించాలని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పన్నుల్లో వాటాపైౖ దృష్టి పెట్టాలని ..
అధికారులకు చంద్రబాబు నిర్దేశం
అమరావతి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ఆదాయార్జనపై మరింత శ్రద్ధ వహించాలని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పన్నుల్లో వాటాపైౖ దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర ప్రణాళికలు చేయడంతో పాటు సాంకేతిక వినియోగంపై దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం 8 శాతం మేర పెరిగే అవకాశం ఉందన్న అంచనాలపై గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఏపీ పన్ను సమాచార వ్యవస్థ ద్వారా పన్ను వసూళ్లు పర్యవేక్షించాలని, సేవల రంగం ద్వారా ఎక్కువ పన్ను ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వానికి మద్యం ఆదాయం కంటే ప్రజారోగ్యమే ముఖ్యమని అన్నారు. ఆర్థిక లావాదేవీలకు అనుగుణంగానే భూ రిజిస్ర్టేషన్ విలువలు ఉండాలన్నారు. పన్ను ఎగవేతలను గుర్తించడానికి ఏఐని వినియోగించాలని ఆదేశించారు. భూమి వివరాలను జీఐఎస్ ద్వారా ల్యాండ్ మ్యాపింగ్ చేయాలని, ఈ రిజిస్ర్టేషన్లు, బౌండరీలను జీఐఎస్ సాయంతో మ్యాప్ చేయాలని సూచించారు. ఆర్టీజీఎస్ ద్వారా వచ్చే వివరాలతో పాటు టెక్నాలజీ ఆధారంగా రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో ఆటోమ్యుటేషన్ జరగాలన్నారు. మున్సిపల్ రికార్డుల్లో తప్పులు సవరించి జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు.