Share News

CM Chandrababu Naidu: జిల్లాల పునర్విభజనలోరాజకీయ కోణం లేదు

ABN , Publish Date - Dec 30 , 2025 | 04:48 AM

జిల్లాల పునర్విభజన కేవలం పరిపాలన సౌలభ్యం కోసమేనని, ఇందులో రాజకీయ కోణం లేదని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ స్పష్టం చేశారు.

CM Chandrababu Naidu: జిల్లాల పునర్విభజనలోరాజకీయ కోణం లేదు

  • ప్రజల ఆకాంక్షలు, పరిపాలన సౌలభ్యం కోసమే మార్పులు

  • సుపరిపాలన ఇస్తూ.. ప్రణాళిక బద్ధంగా ముందుకు: మంత్రులు

అమరావతి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాల పునర్విభజన కేవలం పరిపాలన సౌలభ్యం కోసమేనని, ఇందులో రాజకీయ కోణం లేదని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ స్పష్టం చేశారు. ప్రజల స్పందన, అభ్యంతరాలు, విజ్ఞప్తులు, ఆకాంక్షల మేరకు జిల్లాల పునర్విభజన చేశామన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రులు నాదెండ్ల మనోహర్‌, సత్యకుమార్‌యాదవ్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గత ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఆలోచన చేయకుండా, పరిపాలన సౌలభ్యం లేకుండా కుట్రలతో జిల్లాల పునర్విభజన చేసింది. చాలా జిల్లాలు అస్తవ్యస్తంగా ఏర్పాటు చేసింది. గూడూరు నియోజకవర్గంలోని మూడు మండలాలను నెల్లూరు జిల్లాకు తెచ్చాం. నెల్లూరుకు దగ్గరగా ఉంటామని ఆ మండలాల ప్రజలు కోరారు. మిగతా రెండు మండలాలను తిరుపతిలో పెట్టడం వల్ల దుగరాజపట్నం పోర్టు తిరుపతిలోకి, కృష్ణపట్నం పోర్టు నెల్లూరు జిల్లాలో ఉంటుంది. వాసవీ మాత జన్మస్థలం పెనుగొండ పేరు మార్పుకోసం ఎప్పటి నుంచో విజ్ఞప్తులున్నందున వాసవీ పెనుగొండగా నామకరణం చేశాం. జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చడంపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి చాలా బాధపడుతున్నారు. కేబినెట్‌ తర్వాత ఆయన్ని పిలిచి సీఎం మాట్లాడారు. రాయచోటిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. గత పాలకులు రాయచోటిని జిల్లా కేంద్రం, పుంగనూరును చిత్తూరులో పెట్టి పరిపాలన సౌలభ్యం లేకుండా అస్తవ్యస్తంగా చేశారు. ఆదోని మండలం అతి పెద్దదైనందున 1, 2గా మార్పు చేశాం. రంపచోడవరం కేంద్రంగా పోలవరం పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తున్నాం. గిరిజనులకు పరిపాలన సౌలభ్యం కోసం ముంపు మండలాలతో ఆ జిల్లాను ఏర్పాటు చేస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించే కూటమి ప్రభుత్వం సుపరిపాలన ఇస్తూ, ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్తోంది’ అన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ లోతుగా అధ్యయనంతో జిల్లాల పునర్విభజనను పారదర్శకంగా చేశామన్నారు. మంత్రి సత్యకుమార్‌ మాట్లాడుతూ ‘ఒంగోలుకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న కందుకూరును 110 కిలోమీటర్ల దూరంలోని నెల్లూరులో కలిపారు. నెల్లూరుకు 35 కిలోమీటర్ల దూరంలోని గూడూరును 90 కిలోమీటర్ల దూరంలోని తిరుపతిలో కలిపారు. ఇటువంటివి సరిచేస్తూ.. పరిపాలన సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాల పునర్విభజన చేశాం’ అన్నారు.

Updated Date - Dec 30 , 2025 | 04:48 AM