UAE Tour: నేడు దుబాయ్‌కి చంద్రబాబు
ABN , Publish Date - Oct 22 , 2025 | 04:25 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజుల పర్యటన నిమిత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు(యూఏఈ) వెళుతున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి..
మూడు రోజుల యూఏఈ పర్యటనకు సీఎం బృందం
విశాఖ సదస్సుకు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం
దుబాయ్, అబుధాబిల్లో 25 సమావేశాలు..
దుబాయ్‌లో రోడ్‌షోలో పాల్గొననున్న చంద్రబాబు
చివరిరోజు తెలుగు ప్రవాసీలతో సమావేశం
అమరావతి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజుల పర్యటన నిమిత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు(యూఏఈ) వెళుతున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి సీఎం బృందం దుబాయ్ బయలుదేరి వెళుతుంది. నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాల్సిందిగా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు ఈ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా 25 సమావేశాల్లో సీఎం పాల్గొంటారు. వీటిలో మూడు సమావేశాలు ప్రభుత్వ ప్రతినిధులతో ఉండగా, పారిశ్రామికవేత్తలతో 14 సమావేశాలు ఉన్నాయి. రెండు రౌండ్ టేబుల్ సమావేశాలు, రెండు సైట్ విజిట్స్, రెండు మీడియా ఇంటర్వ్యూలు, ఒక రోడ్‌షో, తెలుగు ప్రవాసీలతో(డయాస్పోరా) ఒక సమావేశం ఉంటాయి.
చివరిరోజు... అబుధాబిలోని యాస్ ఐల్యాండ్‌లో ఫెరారీ వరల్డ్, యాస్ వాటర్ వరల్డ్, వార్నర్ బ్రదర్స్ వరల్డ్ అబుధాబి, సీ వరల్డ్ వంటి ప్రదేశాలను సీఎం చంద్రబాబు సందర్శిస్తారు. అనంతరం ఎమిరేట్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో, ఏపీ ఎన్‌ఆర్‌టీ ఆధ్వర్యంలో నిర్వహించే తెలుగు ప్రవాసీల సమావేశంలో పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలతోపాటు యూఏఈకు చెందిన ప్రభుత్వ ప్రతినిధులతోనూ సీఎం భేటీ అవుతారు. పర్యటనలో ఆయన వెంట మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, సీఎంవో అధికారి కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఏపీఈడీబీ సీఈవో సాయికాంత్ వర్మ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో ధాత్రి రెడ్డి తదితరులు పాల్గొంటున్నారు.
పర్యటన తొలి రోజు..
బుధవారం సాయంత్రం దుబాయ్‌లో పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియంను ఆయన సందర్శిస్తారు. అందులోభాగంగా జర్నీ టు 2071 థీమ్‌తో ఉండే స్పేస్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఆయన పరిశీలిస్తారు. అదేరోజు దుబాయ్‌లో సీఐఐ నిర్వహించే భాగస్వామ్య సదస్సు రోడ్‌షోలో చంద్రబాబు పాల్గొంటారు.
రెండోరోజు..
అబుధాబిలోని పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశమవుతారు. అక్కడి బీఏపీఎస్ హిందూ మందిర్‌ను ఆయన సందర్శిస్తారు.