Chief Minister Chandrababu Naidu: సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రాన్ని ఒప్పించండి
ABN , Publish Date - Nov 28 , 2025 | 05:48 AM
కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా, సాగునీటి ప్రాజెక్టుల అనుమతులపై కేంద్రాన్ని ఒప్పించేలా టీడీపీ ఎంపీలు పార్లమెంటులో బలంగా తమ గళాన్ని వినిపించాలని...
టీడీపీ ఎంపీలకు బాబు ఆదేశం
రైతుల సమస్యలనూ ప్రస్తావించండి
క్యాంపు కార్యాలయంలో టీడీపీపీ భేటీ
అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా, సాగునీటి ప్రాజెక్టుల అనుమతులపై కేంద్రాన్ని ఒప్పించేలా టీడీపీ ఎంపీలు పార్లమెంటులో బలంగా తమ గళాన్ని వినిపించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 1వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. టీడీపీపీ సమావేశం గురువారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఉభయసభల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. వంశధార-గోదావరి-నల్లమల సాగర్ అనుసంధానం, వెలిగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు.. ఇవన్నీ రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని, నీటి భద్రతే మన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్‌లో జాతికి అంకితం చేసేందుకు కేంద్ర సహకారం కావాలన్నారు. పత్తి, మొక్కజొన్న, అరటి ధరల పతనం, సీసీఐ నియమాల కారణంగా వచ్చిన సమస్యలను కేంద్రానికి వివరించి రైతులకు ఉపశమనం కల్పించేలా చూడాలని ఎంపీలను కోరారు. మొంథా తుఫాను నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా పరిహారం వచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. దీనికోసం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో టీడీపీ ఎంపీలు కేంద్ర పెద్దలను కలవాలని నిర్ణయించారు. టీడీపీ అత్యధిక యువపార్లమెంటేరియన్లు కలిగిన పార్టీ అని, ఈ యువశక్తి పార్లమెంటు వేదికగా రాష్ట్ర సమస్యలను స్పష్టంగా వినిపించాలని సీఎం స్పష్టం చేశారు. ‘రాష్ట్రాభివృద్ధి, ప్రజాప్రయోజనాలే లక్ష్యంగా సమన్వయంతో కలిసి పనిచేయాలి. పార్లమెంటులో ప్రవేశపెట్టే ప్రతి అంశమూ రాష్ట్రాభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుందో పరిశీలించి సద్వినియోగం చేసుకోవాలి. విశాఖ సీఐఐ సదస్సులో వచ్చిన పెట్టుబడులకు అనుగుణంగా పాలసీల్లో మార్పు, కేంద్ర అనుమతులకు కృషి చేయాలి. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, డేటా సెంటర్లకు అవసరమైన వనరులపై కేంద్ర సాయం సాధించాలి. ప్రతి నియోజకవర్గంలో ఎంఎ్‌సఎంఈ పార్కులు, 4జీ, 5జీ కనెక్టివిటీ, క్యాంటమ్ వ్యాలీ, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌కు మద్దతు సాధించేలా ఎంపీలు కృషి చేయాలి. విశాఖ, విజయవాడ మెట్రో రైలు, విశాఖ-తిరుపతి-అమరావతి ఎకనామిక్ రీజియన్లు, భోగాపురం ఎయిర్‌పోర్టు, విశాఖ రైల్వే జోన్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటి అంశాలపై కేంద్రంతో చర్చలు జరపాలి’ అని ఎంపీలకు స్పష్టంచేశారు.
అనవసర వివాదల జోలికి వెళ్లొద్దు..
పార్లమెంటులో చురుగ్గా ఉండడంతోపాటు తమ తమ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఎంపీలు తప్పనిసరిగా పాల్గొనాలని సీఎం ఆదేశించారు. ఎంపీలు రాజకీయంగా నియోజకవర్గాల్లో గుడ్‌విల్ సంపాదించాలని, అనవసర వివాదాల జోలికి వెళ్లకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. వివాదాలతో వ్యక్తిగతంగా.. పార్టీకి కూడా నష్టం జరుగుతుందన్నారు. ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రతివారం వేర్వేరు మార్గాల్లో సమాచారం తెప్పించుకొని బేరీజు వేస్తున్నామని తెలిపారు. పార్లీ కార్యక్రమాల్లో ఎంపీలు క్రియాశీలంగా ఉండాలని, రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలని కోరారు. ప్రతి పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్, విద్యార్థుల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించే కార్యక్రమాలపై ఎంపీల సహకారం అవసరమన్నారు. లోకేశ్ మాట్లాడుతూ.. పార్లమెంటులో ఎంపీలు అడిగే ప్రశ్నలు ప్రజాహితంగా, రాష్ట్రానికి ప్రయోజనం కలిగించేలా ఉండాలని అన్నారు. సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తోపాటు ఉభయసభల్లోని టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు.