Share News

CM Chandrababu: సత్వరమే పరిహారం

ABN , Publish Date - Oct 30 , 2025 | 06:28 AM

మొంథా తుఫాన్‌ రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. అధికార యంత్రాంగం సత్వరమే స్పందించి చాలావరకు నష్టాన్ని నియంత్రించగలిగిందని చెప్పారు.

CM Chandrababu: సత్వరమే పరిహారం

  • వీలైనంత త్వరగా పంట నష్టం అంచనా: సీఎం చంద్రబాబు

  • ప్రభావిత జిల్లాల్లో ఏరియల్‌ సర్వే.. కోనసీమలో బాధితులకు పరామర్శ

  • నీట మునిగిన పొలాల వద్ద రైతులతో మాట్లాడి నష్టం వివరాల ఆరా

  • ఓడరేవుల, అరగట్లపాలెం పునరావాస శిబిరాల సందర్శన

అమరావతి/అమలాపురం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘మొంథా తుఫాన్‌ రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. అధికార యంత్రాంగం సత్వరమే స్పందించి చాలావరకు నష్టాన్ని నియంత్రించగలిగిందని చెప్పారు. వీలైనంత త్వరగా నష్టాన్ని అంచనా వేసి.. సత్వరం పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కౌలు రైతులకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని పరిశీలించేందుకు బుధవారం ఆయన హెలికాప్టర్లో ఏరియల్‌ సర్వే చేశారు. ఉండవల్లి నుంచి బయల్దేరి.. బాపట్ల జిల్లా చీరాల, పర్చూరు, బాపట్ల ప్రాంతాలు, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో సంభవించిన నష్టాన్ని పరిశీలిస్తూ.. తుఫాన్‌కు తీవ్రంగా దెబ్బతిన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం చేరుకున్నారు. ఓడలరేవు తీర ప్రాంతంలో ఉన్న ఓఎన్జీసీ టెర్మినల్‌లో ఉన్న హెలిప్యాడ్‌లో దిగారు. జిల్లాకు చెందిన కూటమి నేతలు ఆయనకు నష్టం వివరాలు తెలియజేశారు. అనంతరం సీఎం ఓడలరేవులోని పునరావాస కేంద్రానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. బెండమూర్లంకలో భారీవర్షాలకు దెబ్బతిన్న పంటచేలను పరిశీలించారు. వరి కంకులను పట్టుకుని.. రైతులతో మాట్లాడి పంట నష్టంపై ఆరాతీశారు. అరట్లపాలెంలో బాధితులతో మాట్లాడారు. అంతకుముందు పునరావాస కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘తుఫాన్‌ ప్రభావంవల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. చాలావరకు ఆస్తినష్టాన్ని నివారించగలిగాం. ఆస్తినష్టం పై నివేదిక వచ్చినతర్వాత చర్యలు తీసుకుంటాం. 2,200 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి 1.80 లక్షల మంది బాధితులకు పునరావాసం కల్పించి.. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం.


మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట వరకు స్వయంగా తుఫాన్‌ ప్రభావాన్ని, సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాను. ఇవాళ వాతావరణ పరిస్థితులు అనుకూలించనప్పటికీ స్వయంగా పర్యటనకు వచ్చాను. మంత్రులు, కలెక్టర్లు, అధికార యంత్రాంగమంతా సమష్టిగా కృషి చేయడం వల్లే నష్టాలు లేకుండా నివారించగలిగాం’ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ముగ్గురు మృతిచెందారని, మరెక్కడా ప్రాణనష్టం లేదని తెలిపారు. డ్రైనేజీ, గుర్రపు డెక్క, ఆక్రమణల కారణంగా ముంపు సమస్య ఎదుర్కొంటున్నామని, దానిని పరిష్కరించాలని రైతులు కోరగా.. తక్షణం సమస్య పరిష్కారంపై దృష్టిసారించాలని అధికారులను సీఎం ఆదేశించారు. శిబిరాల్లో ఉన్నవారికి రూ.3 వేలు, 25 కిలోల బియ్యం ఇస్తున్నామని.. మత్స్యకారులకు, చేనేతలకు అదనంగా 50 కేజీలు ఇస్తున్నామని చెప్పారు. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ శరవేగంగా జరుగుతోందని.. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ వీలైనంత త్వరగా ఇబ్బందులను సరిదిద్దుతామని అన్నారు. తుఫాన్‌ పరిస్థితిని ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వచ్చారని తెలిపారు.

భద్రతను.. ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి..

జడ్‌ ప్లస్‌ భద్రతలో ఉన్న చంద్రబాబు.. అల్లవరం పర్యటనలో ప్రొటోకాల్‌ను.. రక్షణను పక్కనపెట్టేశారు. సెక్యూరిటీ నిబంధనల ప్రకారం సీఎం కాన్వాయ్‌లో బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనంలో ప్రయాణించాల్సి ఉన్నా.. ఇన్నోవా కారులోనే బాధితుల వద్దకు వెళ్లారు.


24 గంటల్లో రేషన్‌ పంపిణీ

5 రోజుల్లో పంట నష్టంపై నివేదిక

నేటికల్లా రోడ్లపై గుంతలు పూడ్చాలి

అలసత్వం వహిస్తే.. చర్యలు తప్పవు

మృతుల కుటుంబాలకు 5 లక్షలు: సీఎం

అమరావతి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాల పంపిణీ గురువారంకల్లా జరగాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మొంథా తుఫాన్‌తో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఐదు రోజుల్లోగా పంట నష్టానికి సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ అధికారులకు స్పష్టంచేశారు. పంట నష్టం వివరాలు త్వరగా సేకరించేలా చూడాలన్నారు. దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పరిశీలించి.. వాటిని కాపాడేందుకు రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని నిర్దేశించారు. బుధవారం ఉదయం తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే, అల్లవరం పర్యటన అనంతరం ఆయన సాయంత్రం రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. ఆర్టీజీఎస్‌ సెంటర్‌ నుంచి అధికారులతో సమీక్షించారు. సహాయ చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. విద్యుత్‌ సరఫరా, రహదారుల పునరుద్ధరణపై ఆరా తీశారు. బుధవారం రాత్రికే కరెంటు సరఫరా జరగాలని, గురువారం నాటికి రహదారులపై గుంతల మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్టీసీ బస్సు సర్వీసులను యఽథావిధిగా కొనసాగించాలని సూచించారు. ఈ విషయాల్లో అధికారులు అలసత్వం వహిస్తే.. చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరించారు. పారిశుధ్య పనులు ముమ్మరం చేయాలని సూచించారు. తుఫాన్‌ కారణంగా ఇప్పటి వరకు ముగ్గురు మరణించారని అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా.. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. ఎక్కడా తాగునీరు కలుషితం కాకుండా చూడాలని, డయేరియా కేసులు నమోదైతే ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.


ప్రకాశం కలెక్టర్‌పై అసహనం

ఒంగోలులో పలు కాలనీలు నీట మునగడంతో.. ప్రకాశం జిల్లా కలెక్టర్‌ రాజబాబుపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదని, భవిష్యత్‌లో పాల నా వైఫల్యం కనిపించకూడదని స్పష్టం చేశారు.

ఇంకో రెండ్రోజులు కష్టపడితే మరింత ఊరట

గత నాలుగైదు రోజుల నుంచి మొంథా తుఫాన్‌ విషయంలో సమర్థంగా వ్యవహరించి, నష్ట నివారణ చర్యలు చేపట్టామని సీఎం అన్నారు. మరో రెండ్రోజులు ఇదే విధంగా పని చేస్తే.. బాధితులకు మరింత ఊరట కలుగుతుందన్నారు. బుధవారం ఉదయం జిల్లాల కలెక్టర్లు, అధికారులు, మంత్రులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘రాష్ట్ర, జిల్లా యంత్రాంగాల నుంచి సచివాలయ సిబ్బంది, నేను... జట్టుగా పని చేశాం. కష్టకాలంలో బాధితుల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితి పునరుద్ధరించాలి. మంత్రులు, అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలి. ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి. సమస్యలు అడిగి తెలుసుకోవాలి. నష్టం అంచనాలను త్వరితగతిన సిద్ధం చేసి కేంద్రానికి నివేదిక అందివ్వాలి’ అని సూచించారు. ‘సచివాలయాలపై మైక్‌ అనౌన్స్‌మెంట్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి.. కింది స్థాయి వరకూ ప్రభుత్వం ఇచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాం. ఇదో నూతన విధానం. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అందుబాటులో ఉంటే ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుంది. మన చర్యలతో ప్రభుత్వంపై భరోసా పెరిగింది. తుఫాన్‌ కారణంగా ఇద్దరు చనిపోవడం బాధాకరం’ అని సీఎం చెప్పారు.

Updated Date - Oct 30 , 2025 | 06:30 AM