AP Govt: జిల్లాలపై సత్వర కసరత్తు
ABN , Publish Date - Aug 07 , 2025 | 04:17 AM
కొత్త జిల్లాల ఏర్పాటు పేరిట జగన్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం వెంటనే పరిశీలన ప్రారంభించాలని సూచించారు.
జగన్ చేసిన తప్పులు సరిదిద్దండి
ప్రజల ఫిర్యాదులకు పరిష్కారం చూపాలి
నెల రోజుల్లో నివేదిక ఇవ్వండి
మంత్రివర్గ ఉపసంఘానికి సీఎం దిశా నిర్దేశం
వైసీపీ హయాంలో తోచినట్టు జిల్లాల విభజన
పలు జిల్లాల కేంద్రాలపై అప్పట్లో తీవ్ర నిరసన
జిల్లాలకు కొత్త పేర్ల నిర్ణయంపైనా విమర్శలు
ఇష్టానుసారం డివిజన్ల సరిహద్దుల మార్పు
వీటిని సరిదిద్దేందుకు నడుం బిగించిన సర్కారు
అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): కొత్త జిల్లాల ఏర్పాటు పేరిట జగన్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం వెంటనే పరిశీలన ప్రారంభించాలని సూచించారు. జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ఉపసంఘం ఏర్పాటై రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా భేటీ కాలేదు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. నెల రోజుల్లో ఉపసంఘం నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాల పేర్ల మార్పు, సరిహద్దులు, ప్రధాన కేంద్రాలు, డివిజన్‌లు, మండలాల అంశంపై ఉపసంఘం పరిశీలన ఎంతవరకు వచ్చింది? ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారా?. అని సీఎం ఆరాతీసినట్లు తెలిసింది. అయితే, ఇప్పటి వరకు ఉపసంఘం భేటికాలేదని, ఈ నెల 12 తర్వాత సమావేశం నిర్వహిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో ఈ విషయంలో ఆలస్యం చేయవద్దని, డిసెంబరు నాటికి అన్ని సమస్యలకు పరిష్కారం చూపాలని సీఎం ఆదేశించారు. ‘‘జిల్లాల ఏర్పాటు పేరిట గత ప్రభుత్వం గందరగోళం సృష్టించింది. జిల్లాల పేర్లు, సరిహద్దులు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఖరారు చేసింది. చరిత్ర, చారిత్రక నేపథ్యం, ఇతర అంశాలను పట్టించుకోకుండా జిల్లాలను విభజించారు. రెవెన్యూ డివిజన్ల సరిహద్దుల విషయంలోనూ ప్రజా ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించి పరిష్కారం చూపండి.’’ అని మంత్రివర్గ ఉపసంఘానికి సీఎం దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.
వైసీపీ అడ్డగోలు విభజన
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని 13 ఉమ్మడి జిల్లాలను జగన్ ప్రభుత్వం 26 జిల్లాలుగా విభజించింది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటిస్తామని హామీ ఇచ్చామని, ఆ మేరకు జిల్లాల విభజన ఉంటుందని చెప్పిన జగన్ ఆ తర్వాత రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అడ్డగోలుగా విభజించారు. జిల్లాల సరిహద్దులు, వాటి పేర్ల విషయంలో ప్రజల నుంచి వచ్చిన విన్నపాలను పట్టించుకోలేదు. కొందరు వైసీపీ నేతలు ఇచ్చిన సూచనలు, సలహాల మేరకే అప్పటి ప్రణాళిక సంఘం అధికారి జిల్లాల పునర్వవ్యవస్ధీకరణ ప్రతిపాదనలు తయారు చేశారు.
అన్నమయ్య జిల్లాకు రాజంపేట ప్రధాన కేంద్రంగా ఉండాలని అక్కడివారు డిమాండ్ చేశారు. నెలల తరబడి నిరసన కూడా వ్యక్తం చేశారు. కానీ, రాజకీయ అంశాలను పరిగణనలోకి తీసుకున్న వైసీపీ సర్కారు.. అన్నమయ్య జిల్లాకు రాయచోటిని ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేసింది.
నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గాన్ని పశ్చిమగోదావరిగా విభజించారు. అయితే, ఈ జిల్లాకు నర్సాపురాన్ని ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. కానీ, అప్పటి ప్రభుత్వం భీమవరాన్ని జిల్లా ప్రధాన కేంద్రంగా ప్రకటించింది. నాడు నర్సాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుపై ఉన్న కోపంతోనే ఇలా చేశారన్న ఆరోపణలు వచ్చాయి.
శ్రీసత్యసాయి జిల్లాకు హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రజలు డిమాండ్ చేశారు. కొన్ని వారాల పాటు నిరసన కూడా వ్యక్తం చేశారు. అప్పటి నిరసనల్లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. కానీ, పుట్టపర్తి కేంద్రంగానే జిల్లాను ఏర్పాటు చేశారు.
వాస్తవానికి 26 జిల్లాల్లో ఒక గిరిజన జిల్లా ఉంటుందని నాడు జగన్ ప్రకటించారు. అయితే, గిరిజన ప్రాంతమైన పాడేరు ప్రధాన కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లాను ఏర్పాటు చేశారు. మరోవైపు పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లాను ఏర్పాటు చేశారు.
మన్యం జిల్లా పేరుమార్పుపై అనేక విన్నపాలు వచ్చినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక తమ పార్టీ నేతలు అడిగారనే పేరిట రెవెన్యూ డివిజన్లను అడ్డగోలుగా విభజించారు. దీనివల్ల మండలాలు, డివిజన్ల సరిద్దులు శాస్త్రీయంగా లేవని అధికార వర్గాలు చెబుతున్నాయి.
డివిజన్లు, మండలాల విభజన వల్ల పాలనా సౌలభ్యం మరింతగా పెరగాలి. కానీ, సౌలభ్యానికి బదులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వాటిని సరిచేయాలని గత ఏడాది ఎన్నికల సమయంలో ప్రజలు కోరారు.