Share News

CM Chandrababu: రైతుల గోడు వినండి

ABN , Publish Date - Aug 13 , 2025 | 04:54 AM

రిటర్నబుల్‌’ ప్లాట్ల విషయంలో రాజధాని రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ...

CM Chandrababu: రైతుల గోడు వినండి

  • రిటర్నబుల్‌ ప్లాట్లపై ఇబ్బందుల్లేకుండా చర్యలు

  • రైతుల విజ్ఞప్తులు పరిశీలించండి

  • మాస్టర్‌ప్లాన్‌ ప్రభావితం కాకుండా ఆయా సమస్యలు పరిష్కరించండి

  • అధికారులకు చంద్రబాబు ఆదేశం

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనాలపై స్పందన

  • రాజధాని నిర్మాణాలపై సమీక్ష

  • రికార్డు సమయంలో పూర్తికి నిర్దేశం

‘‘పెద్ద ప్రాజెక్టులను సీబీఎన్‌ మాత్రమే సమర్థంగా చేయగలుగుతారని ప్రధాని మోదీ, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కూడా చెప్పారు. విశ్వసనీయత దెబ్బతినకుండా చూడాలి.’’

- అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): ‘రిటర్నబుల్‌’ ప్లాట్ల విషయంలో రాజధాని రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ ‘ఆంధ్రజ్యోతి’ ఇటీవల వరుస కథనాలు ప్రచురించింది. వీటిపై సీఎం చంద్రబాబు స్పందించారు. రిటర్నబుల్‌ ప్లాట్ల విషయంలో రైతుల విజ్ఞప్తులను పరిశీలించాలని, అయితే.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రభావితం కాకుండా వాటిని పరిష్కరించాలని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి నారాయణ.. వారం రోజుల్లోగా ఈ అంశాన్ని ఒక కొలిక్కి తెస్తామని సీఎంకు వివరించారు. గత వైసీపీ హయాంలో రాజధాని పనులు జరగకపోవడంతో నిర్మాణానికి తెచ్చిన ఇనుము, సామగ్రి తుప్పుపట్టిపోయిందని కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. నిర్మాణం కోసం సేకరించిన ఇసుక నిల్వల్ని కూడా గత పాలకులు ఎత్తుకెళ్లారని తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం ఆ ఇసుకను భర్తీ చేయాలని మైనింగ్‌ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో రాజధాని నిర్మాణ పనుల పురోగతి సహా వివిధ సంస్థలకు చేసిన భూకేటాయింపుల అంశాలపై సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

Untitled-3 copy.jpg


రికార్డు టైమ్‌లో నిర్మాణం

రికార్డ్‌ టైమ్‌లో రాజధాని అమరావతి నిర్మాణ పనులు పూర్తి కావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిర్దేశిత గడువుకంటే ఆరు మాసాల ముందే పనుల్ని పూర్తిచేయాలని సూచించారు. ప్రపంచంలో అత్యుత్తమ నివాస నగరంగా అమరావతి నిర్మాణం జరగాలని స్పష్టం చేశారు. రాజధాని ఎల్పీఎస్‌ లేఅవుట్లలో అభివృద్ధి పనుల పురోగతి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఉద్యోగులు, న్యాయమూర్తుల నివాస భవనాలు, రహదారులు, డక్ట్‌లు లాంటి ట్రంక్‌ ఇన్‌ఫ్రా, వరద నియంత్రణ పనులు జరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. రాజధానిలో ప్రస్తుతం రూ.50,552 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచామని, 74 పనులు ప్రారంభమయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. కాంట్రాక్టు సంస్థలు ఆయా పనుల్ని పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే, నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని తేల్చిచెప్పారు. రాజధానిలో చేపడుతున్న నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష చేస్తానని సీఎం అన్నారు. రియల్‌ టైమ్‌లో పనుల పురోగతిని కూడా పర్యవేక్షిస్తామన్నారు. ఆటోపైలట్‌ మోడ్‌లో పనులు జరగాలని సూచించారు.


వేగంగా అనుమతులు

రాజధానిలో కార్యాలయాల నిర్మాణాలు చేపట్టనున్న వివిధ సంస్థలకు అనుమతులు వేగంగా ఇవ్వాలని సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. బిట్స్‌ పిలానీ, ఎక్స్‌ ఎల్‌ఆర్‌ఐ తదితర సంస్థలకు త్వరితగతిన భూమిని కేటాయించాలని సూచించారు. అలాగే, ఇప్పటి వరకు రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన 72 సంస్థలు ఏ మేరకు నిర్మాణాలు చేపడుతున్నాయో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అమరావతిలో స్పోర్ట్స్‌ సిటీ, పర్యాటక ప్రాజెక్టులు, ఎయిర్‌పోర్టు, బయోటెక్నాలజీ, విద్యాసంస్థలు, ఆసుపత్రులు ఇలా వివిధ రంగాల్లో పెట్టుబడులు రావాల్సి ఉందన్నారు.


గాలి నాణ్యతకు ప్రాధాన్యం

కేవలం భవనాల అభివృద్ధితో మాత్రమే రాజధాని నగరం పూర్తి కాదని, ఆర్థిక కార్యకలాపాలు కూడా పెద్దఎత్తున రావాల్సి ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. నిర్మాణాలను పూర్తిచేసి రాజధాని నగరంగా విజిబిలిటీ వస్తే పెట్టుబడిదారులు వచ్చి ఆర్థికంగా పరిపుష్టం అవుతుందన్నారు. దేశంలోని అత్యుత్తమ 10రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలను కూడా ఆహ్వానించి ఇక్కడ ప్రాజెక్టులు చేపట్టేందుకు అవకాశం కల్పించాలని సీఎం సూచించారు. రాజధాని నగరాన్ని గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌గా మార్చేందుకు విద్యుత్‌ వాహనాల(ఈవీ)ను ప్రోత్సహించాలన్నారు. సీడ్‌ క్యాపిటల్‌, క్యాపిటల్‌ సిటీ, క్యాపిటల్‌ ఏరియా ప్రాంతాల్లో గాలి నాణ్యత ఎలా ఉందో కూడా నమోదు చేసి వివరాలు ప్రదర్శించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

Updated Date - Aug 13 , 2025 | 04:57 AM