CM Chandrababu: ప్రాణ.. ఆస్తి నష్టం జరక్కూడదు
ABN , Publish Date - Oct 24 , 2025 | 03:14 AM
తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి
లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
దుబాయ్ నుంచి సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
ప్రభావిత జిల్లాలకు అత్యవసర నిధులు మంజూరు
అమరావతి/నెల్లూరు(సిటీ), అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున, మిగతా వర్ష ప్రభావిత జిల్లాలకు రూ.కోటి చొప్పున అత్యవసర నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాలపై గురువారం దుబాయ్ నుంచి సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తీవ్రంగా ప్రభావితమైన నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిస్థితిపై కలెక్టర్లు, ఆర్టీజీఎస్ అధికారులను ఆరా తీశారు. ‘అధికారులు అప్రమత్తంగా ఉండి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు మోహరించాలి. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. పునరావాస కేంద్రాల్లో బాధితులకు నాణ్యమైన ఆహారం అందించాలి. పంట నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’ అని దిశానిర్దేశం చేశారు.
వర్షాలపై మున్సిపాలిటీల్లో కాల్‌సెంటర్లు: మంత్రి నారాయణ
ఎడతెరపి లేని వర్షాలతో పట్టణాలు, నగరాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను మంత్రి పి.నారాయణ ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, ఉన్నతాధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపాలిటీల్లో 24 గంటలూ పనిచేసేలా కాల్‌సెంటర్ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.