Share News

AP CM Chandrababu: ప్రజల్లోకి పోదాం

ABN , Publish Date - Dec 19 , 2025 | 05:16 AM

ప్రజల్లోకి వెళ్లండి. నేనూ మీతో వస్తాను. మంత్రులు కూడా వస్తారు. అందరం కలిసి పని చేద్దాం అంటూ కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

AP CM Chandrababu: ప్రజల్లోకి పోదాం

  • మీరు వెళ్లండి.. మేమూ వస్తాం.. కలెక్టర్లకు సీఎం కర్తవ్యబోధ

  • ప్రజలు, ప్రభుత్వ ప్రాథమ్యాలు చెబుతూ..జిల్లా ప్రోగ్రెస్‌ రిపోర్టు చేతిలో పెట్టిన సీఎం

  • ‘సంతృప్తి’ లేదని కలెక్టర్లకు స్పష్టీకరణ

  • తొలి రోజు జిల్లా పాలనలోని తప్పుల స్కానింగ్‌

  • 2వ రోజు పరిష్కారాలపై చంద్రబాబు ఫోకస్‌

  • వాస్తవానికి దగ్గరగా సమావేశాల నిర్వహణ

అమరావతి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : ‘‘ప్రజల్లోకి వెళ్లండి. నేనూ మీతో వస్తాను. మంత్రులు కూడా వస్తారు. అందరం కలిసి పని చేద్దాం’’ అంటూ కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. విమర్శలను పట్టించుకోవాల్సిన పని లేదని, ప్రజలకు జవాబుదారీగా ఉంటూ, వారి సంతృప్తి స్థాయిని పెంచడమే లక్ష్యం కావాలంటూ రెండు రోజుల కాన్ఫరెన్స్‌ సందర్భంగా కలెక్టర్లకు కర్తవ్యబోధ చేశారు. ‘‘ప్రజల సంతృప్తి స్థాయి 90- 95 శాతం ఉండాలి. అప్పుడే మనం మెరుగైన పాలన అందించినట్టు. కానీ, ఆ స్థాయిలో ప్రజల్లో సంతృప్తి కనిపించడం లేదు. ఎక్కడో లోపం ఉంది’’ అంటూ వాస్తవ పరిస్థితిని కలెక్టర్లకు స్పష్టం చేశారు. కలెక్టర్ల పనితీరుపై ముందుగానే నివేదికలు తెప్పించుకున్న చంద్ర బాబు, జిల్లాల్లో ఎక్కడ లోపాలున్నాయి.. వాటి పరిష్కారానికి కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నారా..? లేదా..? అన్న సమాచారంతో వచ్చారు. ఏ ఏ జిల్లాల్లో ఎక్కడ లోపం జరుగుతున్నదన్న సమాచారంతోపాటు ప్రతి కలెక్టర్‌పై ఆయన సృష్టమైన అవగాహన తెచ్చుకున్న తర్వాతనే సమావేశానికి పిలిచినట్టు సృష్టంగా అర్థమైంది. ఏ కలెక్టర్‌ ఎక్కడ విఫలం అవుతున్నారనేది కూడా సీఎం స్వయంగా వారికి వివరించారు. తొలిరోజు కలెక్టర్ల తప్పులు ఎత్తు చూపిన సీఎం, రెండో రోజు ఆ తప్పులను ఎలా సరిదిద్దుకోవాలనేది మార్గనిర్దేశనం చేశారు. ఒకనొక సందర్భంలో ‘సర్కారు సాము చేయవద్దు’ అంటూ పెద్ద మాటనే సీఎం ఉపయోగించారు. ‘‘అందరం ప్రజల కోసమే పని చేస్తున్నాం. ప్రజలు మెచ్చుకునేలా పాలన అందించడమే మన లక్ష్యం. దాని కోసం మీరు ఏదైనా చేయండి. వినూత్నంగా ఆలోచించండి.’’ అంటూ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.


గతానికి భిన్నంగా..

గతంలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో... ప్రజల్లో సంతృప్తి స్థాయి అంత ఉంది..! ఇంత ఉంది..! అంటూ సీఎంయే ఏకరువు పెట్టేవారు. ఈసారి ఆయన వాస్తవానికి దగ్గరగా వచ్చారు. ప్రజల మెప్పు పొందడమే తనకు కొలమానమని, ఆ స్థాయిలో జిల్లాల్లో పాజిటివ్‌ రేటు లేదని స్పష్టం చేశారు. దీంతో వాస్తవ పరిస్థితులను సీఎం అంచనా వేసినట్లు అందరికీ అర్థం అయింది. నేల విడిచి సాము చేయడం సరికాదని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను కలెక్టర్లు చేరుకోవాలని, లేదంటే ఉపేక్షించేది లేదని గట్టిగానే హెచ్చరించారు. ఒకవైపు హెచ్చరిస్తూనే... ‘మీ వెనుక నేను ఉన్నాను.. వినూత్న ఆలోచనలు చేసే కలెక్టర్లకు అన్ని రకాల సహకారం అందిస్తామం’టూ భరోసా ఇచ్చారు. కలెక్టర్లు రెండు రకాలుగా సంతృప్తి స్థాయి పెంచవవచ్చని, ప్రతి దానికీ డబ్బులే అవసరం లేదని, వినూత్న ఆలోచనతో కూడా దానిని పెంచవచ్చునని సూచించారు.

ఈజ్‌ ఆఫ్‌ డెలివరింగ్‌ గవర్నెన్స్‌..

సరికొత్త విధానానికి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. 2014-19లో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానాన్ని ప్రవేశపెట్టిన ఆయన, ఇప్పుడు ’’ఈజ్‌ ఆఫ్‌ డెలివరింగ్‌ గవర్నెన్స్‌’ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వం చేసే ప్రతి పని, ప్రతి పథకం ప్రజలకు సులువుగా, వేగంగా చేరేలా చేయడమే దీని లక్ష్యం. ఇంత సులువుగా, వేగంగా ప్రభుత్వ అభివృద్ధి ప్రజలకు ఎలా చేరుస్తున్నారన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు.


అక్కడికక్కడే పరిష్కారాలు..

కలెక్టర్లు, ఎస్పీలు అడిగినవి నిధులతో సంబంధం ఉన్నవా.. లేనివా... అన్నదానితో సంబంధం లేకుండా సీఎం అక్కడికక్కడే నిర్ణయం తీసుకున్నారు. బుధవారం సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌ మాట్లాడుతూ... జిల్లాల్లో ఉపయోగంలో లేని ఖాతాల్లో రూ.160 కోట్ల వరకూ నిధులున్నాయని, కలెక్టర్లు వెంటనే వాటిని యాక్టివ్‌ చేస్తే బాగుంటుందన్నారు. సీఎం వెంటనే స్పందిస్తూ, ఆ ఖాతాలను యాక్టివ్‌ చేసి, నిధులను కలెక్టర్లకు ఇచ్చేయాలని ఆదేశించారు. గురువారం ఎస్పీలు కొన్ని సమస్యలు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు, ఇతర అవసరాల కోసం నిధులు ఇవ్వాలని కోరగా, సీఎం వెంటనే ప్రతి జిల్లా ఎస్పీకీ రూ.కోటి చొప్పున ప్రకటించేశారు. ఆ నిధులు ఎస్పీలకు ఇచ్చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి నిర్ణయాన్నీ సమావేశంలోనే తీసుకుని, అక్కడే ఆదేశాలు జారీ చేయడం కనిపించింది. మరోవైపు సమయ పాలన పాటిస్తూ షెడ్యూల్‌ ప్రకారమే రెండు రోజుల సమావేశాలను నడిపించారు.


వచ్చే మూడేళ్లలో 2,368 కోట్లు ఆదా!

గ్రీన్‌ హైడ్రోజన్‌ దిశగా రాష్ట్రం అడుగులు: సీఎస్‌

అమరావతి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): గ్రీన్‌ హైడ్రోజన్‌ దిశగా రాష్ట్రం శరవేగంగా అడుగులు వేస్తోందని, తద్వారా డీజిల్‌, పెట్రోలు వంటి శిలాజ ఇంధనాలపై చేసే వ్యయం తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ అన్నారు. ఆయన ‘కాస్ట్‌ ఆప్టిమైజేషన్‌ ఫ్యూయల్‌ అండ్‌ ఎనర్జీ’పై ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. రాష్ట్రంలో నెలకొల్పుతున్న సౌర, పవన, పంప్డ్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులు, ఇంధన పొదుపు చర్యలతో వచ్చే మూడేళ్లలో విద్యుత్‌ కొనుగోలు ఖర్చులో సుమారు రూ.2,368 కోట్ల పొదుపు సాధించనున్నట్లు సీఎస్‌ తెలిపారు. విద్యుత్‌ కొనుగోలు ఖర్చు 2026 ఆర్థిక సంత్సరానికి యూనిట్‌కు రూ.4.80కు, 2029 నాటికి రూ.3.99కు తగ్గుతుందన్నారు. పీఎం కుసుమ్‌ కోసం భూమి కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

వ్యవసాయం.. ఉద్యోగాలు..పేదరిక నిర్మూలన..

వ్యవసాయం, పూర్తి పేదరిక నిర్మూలన, ఉద్యోగ కల్పనకు సీఎం అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్ర జీడీపీని, జీఎ్‌సడీపీ వృద్ధిని వేగంగా పెంచే రంగాలైన ఉద్యాన పంటలు, మత్స్య ఉత్పత్తులపై దృష్టి పెట్టాలన్నారు. రబీ...ఖరీ్‌ఫ...రబీ...ఇలా ఒక ప్రణాళిక ప్రకారం వెళ్లి, ముందుగానే వ్యవసాయ రంగంపై కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని నిర్దేశించారు. పంటలకు నీటి సమస్య రాకుండా చెరువులు, కాలువలను నీటితో నింపాలని, భూగర్భ జల స్థాయి పెంచాలని సూచించారు. మరోవైపు పేదరిక నిర్మూలన తమ లక్ష్యమని, ప్రజలు జీవన ప్రమాణాలు పెంచేందుకు కలెక్టర్లు ఆలోచనలు చేయాలన్నారు. యువతలో నైపుణ్యం పెంచి, చేయూత ఇస్తే ఈలక్ష్యం నెరవేరుతుందని సూచించారు.

Updated Date - Dec 19 , 2025 | 06:12 AM