Anniversary Greetings: ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ల ప్రస్థానం ద్విగుణీకృతమవ్వాలి
ABN , Publish Date - Oct 16 , 2025 | 05:14 AM
పాత్రికేయ విలువలను పరిరక్షిస్తూ, నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సంస్థల వార్షికోత్సవం సందర్భంగా ఎండీ వేమూరి రాధాకృష్ణ, సిబ్బందికి, పాత్రికేయులకు ఎక్స్ ద్వారా...
ఎక్స్‌లో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేశ్ వార్షికోత్సవ శుభాకాంక్షలు
అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): పాత్రికేయ విలువలను పరిరక్షిస్తూ, నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సంస్థల వార్షికోత్సవం సందర్భంగా ఎండీ వేమూరి రాధాకృష్ణ, సిబ్బందికి, పాత్రికేయులకు ఎక్స్ ద్వారా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘23 సంవత్సరాలుగా తెలుగు పాఠకులపై ఆంధ్రజ్యోతి చెరగని ముద్ర వేసింది. 16 సంవత్సరాలుగా విశిష్ఠ న్యూస్ చానల్‌గా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగొందుతోంది. ఈ మీడియా సంస్థల నిర్వాహకులు, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణకు శుభాకాంక్షలు, అభినందనలు. నిష్పక్షపాతంగా వార్తలను అందించడంలో ముందుండే ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానళ్ల ప్రస్థానం మరింత ద్విగుణీకృతం కావాలి’ అని చంద్రబాబు ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్స్‌లో స్పందిస్తూ... ‘ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ చానల్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రధాన సంపాదకులు, పాత్రికేయులు, సాంకేతిక నిపుణులు, సిబ్బందికి అభినందనలు. ప్రతిక, చానల్ పయనం అప్రతిహాతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’ అని అన్నారు. మంత్రి లోకేశ్ ఎక్స్‌లో స్పందిస్తూ... ‘అక్షరమే ఆయుధంగా, సమాజ హితమే లక్ష్యంగా వేమూరి రాధాకృష్ణ ఆధ్వర్యంలో వెలిగించిన ఆంధ్రజ్యోతి దినదిన ప్రవర్థమానమై 23 ఏళ్లు... నిజాన్ని నిర్భీతిగా చూపిచడంలో దమ్మున్న చానల్‌గా పేరుగాంచిన ఏబీఎన్ ప్రారంభమై 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హార్థిక శుభాకాంక్షలు. హృదయాలను కదిలించే మానవీయ కథనాలు, అవినీతిపరుల పాలిట సింహస్వప్నంలా పరిశోధనాత్మక కథనాలు, నిక్కచ్చి రాజకీయ విశ్లేషణలతో తెలుగు ప్రజలకు అభిమాన పత్రికగా ఆంధ్రజ్యోతి, ఇష్టపడే చానల్‌గా ఏబీఎన్ నిలిచాయి’ అని పేర్కొన్నారు.