Share News

CM Chandrababu: తప్పు చేస్తే తాట తీస్తాం

ABN , Publish Date - Mar 12 , 2025 | 04:50 AM

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

CM Chandrababu: తప్పు చేస్తే తాట తీస్తాం

  • శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం: సీఎం

  • రౌడీలు, ఫ్యాక్షనిస్టులు అనే మాటే వినబడకూడదు

  • ఆడబిడ్డల జోలికొస్తే అదే చివరి రోజవుతుంది

  • మహిళలకు రక్షణగా ‘శక్తి’ యాప్‌ ప్రారంభించాం

  • గంజాయి, డ్రగ్స్‌పై ‘ఈగల్‌’ యుద్ధం ఆపేది లేదు

  • నేరస్థులకు కూటమి ప్రభుత్వం సింహస్వప్నమే

  • శాసనసభలో సీఎం చంద్రబాబు హెచ్చరికలు

నేనెప్పుడూ కక్షపూరిత రాజకీయాలు చేయలేదు. ఇప్పుడు కూడా చేయను. దీనిని అలుసుగా తీసుకుని శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే మాత్రం ఉపేక్షించేది లేదు. నేరస్థులకు మా ప్రభుత్వం సింహస్వప్నంలా మారి వారిపై ఉక్కుపాదం మోపుతుంది. రౌడీలు, ఫ్యాక్షనిస్టులు, ముఠా తగాదాల మాటే వినబడకూడదని శాసనసభ వేదికగా హెచ్చరిస్తున్నా.

- అసెంబ్లీలో సీఎం చంద్రబాబు

అమరావతి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు తలెత్తాయని, ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. మంగళవారం శాసనసభలో శాంతిభద్రతల అంశంపై ఆయన మాట్లాడారు. ప్రజలు భయం లేకుండా సంతోషంగా జీవించాలంటే శాంతిభద్రతలను కాపాడటం చాలా ముఖ్యమని తెలిపారు. తమ ప్రభుత్వంలో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని, తప్పు చేసినవారి తీట తీస్తామని సీఎం హెచ్చరించారు. ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరిరోజు అవుతుందని స్పష్టం చేశారు. ‘వైసీపీ ప్రభుత్వంలో నేను, మీరు, అందరమూ బాధితులమే. డ్రగ్స్‌, గంజాయి వినియోగం విపరీతంగా పెరిగింది. బాధ్యత గల ప్రతిపక్షంగా ఆందోళన చేస్తే.. తిరిగి టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. ఇంత దుర్మార్గాన్ని నా రాజకీయ జీవితంలో చూడలేదు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపైనా ఉంది. రాజకీయాల ముసుగులో నేరాలు, ఘోరాలకు పాల్పడతామంటే ఈ ప్రభుత్వంలో సాగదు. శాంతిభద్రతలను పరిరక్షించే పోలీసులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఉదాశీనంగా వ్యవహరిస్తే పోలీసుల పట్ల కూడా కఠినంగా వ్యవహరిస్తాం’ అన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..


ప్రజలు కూడా సహకరించాలి

రాష్ట్రంలో గంజాయి సాగు చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడితే ఊరుకునేది లేదు. డ్రోన్‌ పెట్రోలింగ్‌తో గంజాయి సాగును గుర్తిస్తాం. ఒక్క ఎకరాలో కూడా గంజాయి పండించడానికి వీల్లేదు. వ్యాపారుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి గంజాయి పండించే అమాయకులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తాం. తల్లిదండ్రులు కూడా గంజాయికి అలవాటుడిన తమ పిల్లల్ని జాగ్రత్తగా కంట్రోల్‌ చేయాలి. గత ప్రభుత్వం రాష్ట్రంలో గంజాయిపై కనీసం ఒక్కసారైనా సమీక్ష చేసిన పాపాన పోలేదు. అసెంబ్లీలో కూడా చర్చించలేదు. చివరికి పోలీసు వాహనాలకు పెట్రోలు కూడా ఇవ్వని పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులను చక్కదిద్దుతున్నాం. రాష్ట్రంలో గంజాయి సాగు, డ్రగ్స్‌ వినియోగాన్ని అరికట్టేందుకు ‘ఈగల్‌’ ద్వారా ఇప్పటికే యుద్ధాన్ని ప్రారంభించాం. దీనిని ఆపేది లేదు.


ఆడబిడ్డల జోలికొస్తే అదే గతి

సోషల్‌ మీడియాలో విచ్చలవిడితనం పెరిగిపోయింది. వ్యక్తిగత దూషణలతో ఆడబిడ్డలు తలెత్తుకుని తిరగలేని విధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ప్రేమ పేరుతో అమ్మాయిలను ఇబ్బందులు పెడుతున్నారు. ఆడబిడ్డల జోలికొస్తే వారికి అదే చివరి రోజవుతుంది. గతంలో ఇలాగే దాచేపల్లిలో ఒక అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడిన నేరస్థుడిని పట్టుకోవడానికి 10 టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఏర్పాటు చేశాం. ఇక తప్పించుకోలేనని భావించి నాలుగో రోజు అతనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆడబిడ్డల జోలికొస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుంది. ఆడబిడ్డలకు రక్షణగా నిన్ననే శక్తి యాప్‌ను ప్రారంభించాం. ఆడపిల్లలందరూ ఆ యాప్‌ను తమ సెల్‌ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆపద సమయంలో ఆ యాప్‌ ద్వారా సమాచారం అందిస్తే 6 నుంచి 9 నిమిషాల్లోనే పోలీసులు వస్తారు. ఇలాంటి ఫిర్యాదులు నమోదైన తర్వాత బాధితులకు ఏదైనా జరిగితే.. దానికి పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీనిపై అందరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై కూడా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేరస్థులకు 2, 3 నెలల్లోనే శిక్ష పడే పరిస్థితిని తీసుకువచ్చాం. సైబర్‌ నేరాలను అరికట్టేందుకు 26 సైబర్‌ పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో గత ప్రభు త్వం సృష్టించిన భూ సమస్యలు భయంకరంగా ఉన్నాయి. భూ ఆక్రమణలు, కబ్జాలకు పాల్పడేవారు భయపడేలా త్వరలోనే ల్యాండ్‌ గ్రాబింగ్‌-2024 చట్టాన్ని తీసుకురానున్నాం.


హత్యా రాజకీయాలకు పాల్పడలేదు

వైఎస్‌ వివేకా హత్య కేసులో ఆరుగురు సాక్షులు చనిపోవడం ఆలోచించాల్సిన అంశం. 2019లో నేను సీఎంగా ఉండగానే వివేకా హత్య జరిగింది. ఆయన గుండెపోటుతో చనిపోయారని ఆ రోజు ఉదయమే వాట్సాప్‌ మెసేజ్‌ వచ్చింది. నేను కూడా నిజమని నమ్మేశాను. నేరస్థులు ఏవిధంగా ట్రాప్‌లో పడేస్తారనడానికి ఇదొక ఉదాహరణ. నేను హత్యా రాజకీయాల మరక అంటకుండా 40ఏళ్లు రాజకీయాలు చేశాను. హత్యా రాజకీయాలు చేసినవారికి వ్యతిరేకంగా పోరాడి ప్రజాక్షేత్రంలో శిక్ష పడేలా చేసి.. వారిని రాజకీయాల్లో లేకుండా చేశానే తప్ప నేనెప్పుడూ హత్యా రాజకీయాలు చేయలేదు’ అని చంద్రబాబు వివరించారు.

Updated Date - Mar 12 , 2025 | 04:50 AM