Share News

CM Chandrababu: జగన్‌ హయాంలో.. రాష్ట్రానికి చెడ్డపేరు

ABN , Publish Date - Dec 05 , 2025 | 05:35 AM

జగన్‌ ప్రభుత్వ హయాంలో సింగపూర్‌ ప్రభుత్వ సంస్థలను తరిమేశారని.. దానివల్ల రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM Chandrababu: జగన్‌ హయాంలో.. రాష్ట్రానికి చెడ్డపేరు

  • సింగపూర్‌ ప్రభుత్వ పరిశ్రమలను తరిమేయడం వల్లే: సీఎం

రాష్ట్రంపై గత పాలకులు బ్యాడ్‌ ఇమేజీ ముద్ర వేశారు. మేం ఈ ముద్రను చెరిపేశాం. ఇప్పుడు ఏపీకి బ్రాండ్‌ ఇమేజీ తీసుకొచ్చాం. అందుకే విశాఖ పెట్టుబడుల సదస్సుకు భారీ స్పందన వచ్చింది.

- ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వ హయాంలో సింగపూర్‌ ప్రభుత్వ సంస్థలను తరిమేశారని.. దానివల్ల రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాల్లేవన్న అపప్రథను ఇప్పుడు తొలగించుకున్నామని.. పారిశ్రామికవేత్తల విశ్వాసం పొందగలిగామని అన్నారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. గురువారం వెలగపూడి సచివాలయంలో జరిగిన 13వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం గత నెల 14, 15 తేదీల్లో విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల్లో 50 శాతానికిపైగా ఆమోద ప్రక్రియలోకి వచ్చాయని వెల్లడించారు. ఒప్పందాలు జరిగిన 45 రోజుల్లోనే శంకుస్థాపనలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. తాజా ఎస్‌ఐపీబీ భేటీలో రూ.20,444 కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. వాటి ద్వారా 56,278 ఉద్యోగాలు దక్కే అవకాశముంది. కంపెనీలకు అవసరమయ్యే నీరు, విద్యుత్‌, రహదారులు, అనుమతుల్లో ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా చూస్తున్నామని సీఎం అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..


20 రోజుల్లోనే ఆచరణ దిశగా ..

ఒప్పందాలు చేసుకున్న ఇరవై రోజుల్లోనే ఆచరణ దిశగా అడుగులు వేస్తున్నాం. విశాఖ సదస్సులో చేసుకున్న ఒప్పందాల్లో ఇప్పటికే రూ.7.69 లక్షల కోట్ల పెట్టుబడులు ఆచరణలోకి వచ్చాయి. మిగిలిన ఎంవోయూలు కూడా వీలైనంత త్వరగా అమలయ్యేలా అధికారులు చూడాలి. సదస్సు ఒప్పందాలను వీలైనంత త్వరగా గ్రౌండింగ్‌ చేస్తే.. ఈసారి దావోస్‌ ఆర్థిక సదస్సులో మరిన్ని పెట్టుబడులు వస్తాయి. ఇకపై ఎస్‌ఐపీబీతో పాటు ఎంవోయూలపైనా సమీక్షిస్తా. కలెక్టర్లు కూడా దృష్టిపెట్టాలి.

భూకేటాయింపులపై ఫిర్యాదులు రాకూడదు

భూముల కేటాయింపులో ఎలాంటి ఫిర్యాదులూ రాకూడదు. ఆమోదం పొందిన యూనిట్లు, పరిశ్రమలు నిర్దేశిత గడువులోగా ఏర్పాటు కావాలి. లాజిస్టిక్స్‌, గ్రీన్‌ ఎనర్జీ యూనివర్సిటీలు వంటివి ఏర్పాటు చేయాలి. క్వాంటమ్‌ వ్యాలీకి సలహా సంఘాన్ని నియమించాలి. మెంటరింగ్‌, మానిటరింగ్‌, వెంచర్‌ క్యాపిటల్‌పై ఈ సలహాసంఘం పనిచేయాలి. ఏఐ బేసిక్స్‌ను ఏడో తరగతి నుంచే బోధించాలి.


ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులు సాధించాలి

ప్రభుత్వ రంగ సంస్థలు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా చర్యలు తీసుకోవాలి. యూఏఈ వంటి దేశాల్లో ప్రభుత్వ సంస్థలు రూ.లక్షల కోట్ల సావరిన్‌ ఫండ్‌ను ఏర్పాటు చేస్తుంటాయి. ఏపీ కూడా రూ.500 కోట్లతో సావరిన్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలి. పశుసంపద పరిశ్రమ రూ.8 లక్షల కోట్లకు చేరాలి.

పెట్టుబడుల ప్రతిపాదనలకు ఓకే

13 సమావేశాల ద్వారా ఇప్పటికి రూ.8.28 లక్షల కోట్ల పెట్టుబడులు, తద్వారా 7,62,148 మందికి ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలను ఎస్‌ఐపీబీ ఆమోదించింది. గురువారం ఎర్లీ బర్డ్‌ ప్రోత్సాహకాల కింద 6 కంపెనీలకు ఆమోదం తెలిపింది. మొత్తం 31 కంపెనీల ప్రతిపాదనలను అంగీకరించింది. వీటిలో చింతా ఎనర్జీ (రూ.8,500 కోట్లు-5,800 ఉద్యోగాలు), గనేకో త్రీ ఎనర్జీ (రూ.2,140 కోట్లు-వెయ్యి ఉద్యోగాలు), శ్రీష్ట రెన్యువబుల్‌ (రూ.70 కోట్లు-339 ఉద్యోగాలు), క్యూలైటెక్‌ (రూ.15 కోట్లు-512 ఉద్యోగాలు) తదితరాలు ఉన్నాయి.

Updated Date - Dec 05 , 2025 | 06:41 AM