Projects Inspection: ఉత్తరాంధ్రలో చంద్రబాబు ఏరియల్ సర్వే
ABN , Publish Date - Dec 13 , 2025 | 04:24 AM
వివిధ ప్రాజెక్టుల పురోగతి తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు శుక్రవారం ఉత్తరాంధ్రలో ఏరియల్ సర్వే నిర్వహించారు.
ఐటీ, టూరిజం హబ్‌లు, ‘భోగాపురం’ పనుల పరిశీలన
గూగుల్ డేటా సెంటర్ పెట్టే ప్రాంతాన్ని కూడా..
వివిధ ప్రాజెక్టుల పురోగతిపై ఆరా
విశాఖపట్నం/విజయనగరం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): వివిధ ప్రాజెక్టుల పురోగతి తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు శుక్రవారం ఉత్తరాంధ్రలో ఏరియల్ సర్వే నిర్వహించారు. విశాఖలో ఐటీ పరిశ్రమ విస్తరించిన రుషికొండ, కాపులుప్పాడ ప్రాంతాలను పరిశీలించి, ఐటీ హబ్, జీసీసీ ప్రాజెక్టు నిర్మాణాల గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పర్యాటక ప్రాజెక్టులు ఏర్పాటుకానున్న భీమిలి తీర ప్రాంతంతో పాటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనుల పురోగతిని పరిశీలించారు. భోగాపురం వద్ద ఎడ్యుకేషన్ హబ్‌లో ఏవియేషన్ వర్సిటీ ఏర్పాటుకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్‌కు కేటాయించిన భూములను హెలికాప్టర్ నుంచి పరిశీలించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్‌లో భాగంగా సబ్బవరం, పెందుర్తి మండలాల్లో వచ్చే వివిధ పరిశ్రమలకు సంబంధించి ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు భూముల లభ్యతపై ఆరా తీశారు. విజయనగరం జిల్లాలోని ప్రాజెక్టులను పరిశీలించారు. 2026 జూన్ నాటికి ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వం మంజూరు చేసి, వివిధ దశల్లో ఉన్న పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. ఇక విశాఖ-రాయ్‌పూర్ జాతీయ రహదారి సహా వివిధ రోడ్లు, నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టులు, ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ గురించీ ఆరా తీశారు. ఈ హైవే పనులను వీలైనంత వేగంగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.