CM Chandrababu Naidu: పెట్టుబడులే లక్ష్యంగా..3 రోజులు..25కీలక భేటీలు
ABN , Publish Date - Oct 26 , 2025 | 05:15 AM
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన మూడు రోజుల యూఏఈ పర్యటన ముగిసింది. శనివారం ఆయన దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.
ముగిసిన సీఎం యూఏఈ పర్యటన.. ‘యంగెస్ట్ స్టేట్.. హయ్యెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్’ నినాదంతో సాగిన టూర్
విశాఖ సదస్సుకు రావాలని అందరికీ చంద్రబాబు ఆహ్వానం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన మూడు రోజుల యూఏఈ పర్యటన ముగిసింది. శనివారం ఆయన దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. మూడ్రోజుల పర్యటనలో ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతో 25 కీలక సమావేశాల్లో చంద్రబాబు బృందం పాల్గొంది. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించి, నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ ఇన్వెస్టర్స్ మీట్‌కు హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ పర్యటనలో గ్రీన్ ఎనర్జీ, లాజిస్టిక్స్, షిప్ బిల్డింగ్ యూనిట్ నిర్మాణానికి కీలక అడుగులు పడ్డాయి. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో చంద్రబాబు పర్యటన విజయవంతం అయింది. అమరావతిలో ప్రపంచస్థాయి గ్రంథాలయాన్ని ఉచితంగా నిర్మించేందుకు ప్రముఖ రియాల్టీ సంస్థ శోభా గ్రూప్ ముందుకొచ్చింది. రూ.100 కోట్లతో ఈ గ్రంథాలయాన్ని నిర్మించనున్నట్లు శోభా గ్రూప్ చైర్మన్ రవి మీనన్ వెల్లడించారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటులో ఏపీ ప్రభుత్వానికి సహకరిస్తామని దిగ్గజ సంస్థ షరాఫ్ గ్రూప్ వైస్ చైర్మన్, షరాఫ్ డీజీ సంస్థ వ్యవస్థాపకుడు షరాపుద్దీన్ షరాఫ్ హామీఇచ్చారు. షరాఫ్ గ్రూప్ తమ అనుబంధ సంస్థ అయిన హింద్ టెర్మినల్స్ ప్రైవేటు లిమిటెడ్ ద్వారా ఏపీలో లాజిస్టిక్స్ రంగంలో పెట్టుబడులు పెడుతామని ఆయన పేర్కొన్నారు. షిప్ బిల్డింగ్ రంగంలో ప్రముఖ సంస్థ అయి న ట్రాన్స్‌వరల్డ్ గ్రూప్ చైర్మన్ రమేశ్ ఎస్ రామకృష్ణన్.. దుగరాజపట్నం పోర్టులో షిప్ బిల్డింగ్ యూనిట్ నిర్మాణానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. వైద్య ఆరోగ్య రంగంలో అనుభవం కలిగిన బుర్జిల్ హెల్త్‌కేర్ హోల్డింగ్స్.. తిరుపతిలో స్పెషల్ క్యాన్సర్ సెంటర్ నిర్మాణం చేపట్టేందుకు ముందుకొచ్చింది.
యంగెస్ట్‌స్టేట్..హయ్యెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్..
చంద్రబాబు పర్యటన ఆసాంతం ‘యం గెస్ట్ స్టేట్.. హయ్యెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్’ నినాదంతో సాగింది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించడంతోపాటు ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలను విశాఖలో జరిగే సీఐఐ పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు రప్పించడమే లక్ష్యంగా చంద్రబాబు బృందం నిర్వహించిన సన్నాహక రోడ్‌షో ఒక ముఖ్యఘట్టంగా నిలుస్తుంది.
గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులకు ఆసక్తి
రాష్ట్రప్రభుత్వం గ్రీన్ ఎనర్జీపై ఎక్కువగా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఆ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపాయి. ఎనర్జీ రంగంలో దిగ్గజ సంస్థ అయిన అపెక్స్ ఇన్వెస్ట్‌మెంట్స్.. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు ఆసక్తి చూపింది. మరో ఇంధన సంస్థ మస్దార్ కూడా సౌర, పవన, గ్రీన్‌హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో దిగ్గజ సంస్థ అగ్తియా గ్రూప్.. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, హెల్త్ టెక్ రంగాల్లో నూతన ఆవిష్కరణలపై పనిచేస్తున్న జీ 42 సంస్థ, లులూగ్రూప్, అబూధాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ, తదితర సంస్థల అధిపతులతోనూ సీఎం సమావేశమయ్యారు. ఏఐలో కొత్త ఆవిష్కరణలు, స్టార్ట్‌పలను ప్రోత్సహించేలా ఏపీలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్-దుబాయ్ సిలికాన్ ఒయాసి్‌స(డీఎస్‌వో) మధ్య కొత్త భాగస్వామ్యాలకు యూఏఈ ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
తెలుగు జాతిని ఉత్తేజపరిచేలా..
చంద్రబాబు తన పర్యటన చివరి రోజు యూఏఈలోని ప్రవాస తెలుగు ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చేసిన ఉత్తేజభరిత ప్రసంగం తెలుగువారిని ఆకట్టుకుంది.
అధికారులను కాదని తానే!
పెట్టుబడులు రాబట్టే విషయంలో చంద్రబాబు ఎంత శ్రద్ధ తీసుకుంటారో దుబాయ్‌లోని భారత కాన్సుల్ జనరల్ సతీశ్ కుమార్ శివన్ వివరించారు. ‘కియా మోటార్స్ సంస్థను పెట్టుబడులు కోరడానికి చంద్రబాబు దక్షిణ కొరియాలో పర్యటించినప్పుడు నేను అక్కడే విధులు నిర్వహిస్తున్నాను. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎంగా ఆయన పడే తపనను దగ్గరుండి చూశాను. అధికారులు కాకుండా స్వయంగా తానే పవర్ పాయింట్ ప్రజంటేషన్లు ఇచ్చారు’ అని ఆయన కొనియాడారు.