Share News

CM Chandrababu Naidu: రైతులను ఒప్పించేసమీకరిస్తున్నాం

ABN , Publish Date - Nov 29 , 2025 | 05:03 AM

రాజధాని కోసం రెండో విడత భూసమీకరణపై రైతుల నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదు. నేను స్వయంగా రైతులందరితో మాట్లాడాను. అందరి ఆమోదంతోనే ముందుకెళ్తున్నాం...

CM Chandrababu Naidu: రైతులను ఒప్పించేసమీకరిస్తున్నాం

  • రెండో విడత భూసమీకరణపై నేనే వారందరితో స్వయంగా మాట్లాడా

  • అందరి ఆమోదంతోనే ముందుకెళ్తున్నాం

  • క్యాబినెట్‌ భేటీలో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ

అమరావతి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): ‘‘రాజధాని కోసం రెండో విడత భూసమీకరణపై రైతుల నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదు. నేను స్వయంగా రైతులందరితో మాట్లాడాను. అందరి ఆమోదంతోనే ముందుకెళ్తున్నాం.’’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మంత్రి మండలి సమావేశం శుక్రవారం సీఎం అధ్యక్షతన జరిగింది. క్యాబినెట్‌లో భూసమీకరణ అంశంపై చర్చ సందర్భంగా.. రాజధాని రైతులు అసంతృప్తితో ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రస్తావించారు. రైతులందరూ రెండో విడత భూసమీకరణకు సుముఖంగా ఉన్నారా.. వారంతా సంతోషంగానే భూములు ఇస్తున్నారా.. అంటూ సందేహం వ్యక్తం చేశారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. రైతుల నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. రెండో విడత భూసమీకరణ విషయంలో సీఆర్డీయే అధికారులు రైతులతో సరైన విధంగా మాట్లాడకపోవడం, అధికారుల వ్యవహారశైలి కారణంగా కొంత ఇబ్బంది తలెత్తిన మాట వాస్తవమేనని, రైతుల అభ్యంతరాలను వారు సీరియ్‌సగా తీసుకోలేదని సీఎం అన్నారు. ఆ తర్వాత తాను రైతులను పిలిపించుకుని మాట్లాడి పరిస్థితిని అర్ధమయ్యేలా చెప్పడంతో సుముఖత వ్యక్తంచేశారని తెలిపారు. అమరావతి అభివృద్ధి విషయంలోనూ రైతులు సంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కేంద్రం కూడా సహకరిస్తోందని తెలిపారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, స్పోర్ట్స్‌ సిటీ, విమానాశ్రయం, రైల్వేస్టేషన్‌ వంటివాటితోపాటు నేచురోపతి వైద్య కళాశాల ఏర్పాటుకు అదనపు భూమి సమీకరించాల్సి ఉందన్నారు. నేచురోపతి వైద్యకళాశాలకు కేంద్రం రూ.750 కోట్లు ఇస్తుందని, మనం 40 ఎకరాలు కేటాయిస్తే సరిపోతుందని తెలిపారు. అమరావతిలో కాలుష్యరహిత పారిశ్రామికవాడను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.


పరిశ్రమలను ఆకర్షించడంలో మనమే బెస్ట్‌

రాష్ట్రానికి గూగుల్‌, రిలయన్స్‌ డేటా సెంటర్లతోపాటు ఆర్సెలార్‌ మిత్తల్‌ వంటి భారీ పరిశ్రమలు వస్తున్నాయని సీఎం క్యాబినెట్‌ సహచరులకు వివరించారు. పరిశ్రమలను ఆకర్షించడంలో ఏపీ అత్యుత్తమంగా పనిచేస్తోందని, భూకేటాయింపుల విషయంలోనూ ఎలాంటి జాప్యం లేకుండా ముందుకెళుతోందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రశంసించారని చంద్రబాబు తెలిపారు. భూకేటాయింపు విషయంలో మిగిలిన రాష్ట్రాలకన్నా ఏపీ పాలసీ చాలా బాగుందని ఆమె పేర్కొన్నారన్నారు. పరిశ్రమలను ఆకర్షించడం.. వివాదాలు లేకుండా భూకేటాయింపులు చేయడమే కాదు.. పరిశ్రమలు త్వరితగతిన పూర్తయ్యేలా చూడటం కూడా ప్రభుత్వం, మంత్రుల బాధ్యతేనని స్పష్టం చేశారు.

  • పోలవరం ప్రాజెక్టును 2028 మే నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని, అన్నీ అనుకూలిస్తే 2027 గోదావరి పుష్కరాల నాటికే పూర్తి చేయాలన్నది తమ అభిమతమని సీఎం తెలిపారు. పోలవరం వద్ద ఐకానిక్‌ వంతెన నిర్మించాలని నిర్ణయించామన్నారు.

  • రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని, ఈ విషయంపై ఎన్నిసార్లు మాట్లాడుకున్నా రావణకాష్టంలా రెవెన్యూ సమస్యలు కొలిక్కి రావడం లేదని సీఎం వ్యాఖ్యానించారు.

  • పీపీపీ మోడల్‌లో ప్రారంభించిన వైద్య కళాశాలల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, పాడేరు కళాశాలలను ఎట్టి పరిస్థితుల్లోనూ రెండేళ్లలో పూర్తయ్యేలా చూస్తామని సీఎం తెలిపారు.

  • క్యాబినెట్‌ భేటీ అనంతరం అరటి, పత్తి తదితర పంటల గిట్టుబాటు ధరలు, టిడ్కో ఇళ్ల నిర్మాణంపై అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్లు ఇచ్చారు. వైసీపీ నిర్వాకం వల్ల టిడ్కో ఇళ్ల నిర్మాణం ఐదేళ్లపాటు అటకెక్కిందని, ఫలితంగా సుమారు రూ.4000 కోట్లు అదనపు భారం ప్రభుత్వంపై పడుతోందని వివరించారు.


8.2ు జీడీపీ వృద్ధి ప్రతి భారతీయుడికీ గర్వకారణం: సీఎం

భారతదేశం 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 8.2 శాతం జీడీపీ వృద్ధి సాధించడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ పరిణామం ప్రతి భారతీయుడికీ గర్వకారణంగా నిలుస్తుందని, ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను నిలుపుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. తయారీ, నిర్మాణ రంగాలు, ఆర్థిక, వృత్తిపరమైన సేవలు ఉత్పాదకతను పెంచుతూ దేశ ఆర్థికవ్యవస్థను శక్తివంతంగా ముందుకు నడిపిస్తున్నాయన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధన దిశగా దేశం పయనిస్తోందనడానికి ఈ అద్భుతమైన వృద్ధి నిదర్శనంగా నిలుస్తుందన్నారు.

ఒడిశా పవర్‌ కన్సార్టియంకు బలిమెల, జోలాపుట్‌ పవర్‌ ప్రాజెక్టులు

జోలాపుట్‌, బలిమెల డ్యామ్‌ల వద్ద 78 మెగావాట్ల పవర్‌ ప్రాజెక్టులను ఒడిశా పవర్‌ కన్సార్టియం లిమిటెడ్‌కు కేటాయించేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. బలిమెల డ్యామ్‌ వద్ద 60 మెగావాట్లు, జోలాపుట్‌ డ్యామ్‌ వద్ద 18 మెగావాట్ల పవర్‌ ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 50 శాతం ఏపీకి కేటాయించాలనే నిబంధనపై ఈ ప్రాజెక్టులను ఒడిశా కన్సార్టియంకు కేటాయించనున్నారు.

Updated Date - Nov 29 , 2025 | 05:03 AM