Share News

CM Chandrababu: దమ్ముంటే సభకు రండి

ABN , Publish Date - Sep 02 , 2025 | 04:35 AM

మీకు ధైర్యం ఉంటే.. చిత్తశుద్ధి ఉంటే.. మీ 11 మంది ఎమ్మెల్యేలూ అసెంబ్లీకి రండి.. పింఛన్లు సహా ఏ అంశంపైనైనా చర్చిద్దాం. నాడు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు కదా! నేడు సూటిగా అడుగుతున్నా..

CM Chandrababu: దమ్ముంటే సభకు రండి
CM Chandrababu

  • అభివృద్ధి ఎవరిదో.. విధ్వంసం ఎవరిదో చర్చిద్దాం

  • వైసీపీకి చంద్రబాబు సవాల్‌.. అదో ఫేక్‌ పార్టీ అని ధ్వజం

  • సూపర్‌సిక్స్‌ పథకాల నుంచి ప్రాజెక్టుల దాకా..

  • బాబాయ్‌ హత్య, దళిత డ్రైవర్‌ శవం డోర్‌ డెలివరీ కోడికత్తి డ్రామా, గులకరాయి ఎపిసోడ్‌ వరకూ

  • వీటన్నిటిపైనా మాట్లాడదాం సిద్ధమా?

  • నాడు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు కదా!

  • అసెంబ్లీకి రాకుండా తప్పుడు ప్రచారాలా?

  • వచ్చే ఎన్నికల్లోనూ ఎన్డీఏదే గెలుపు

  • పులివెందులలో కూడా విజయం సాధిస్తాం

  • రాజంపేట సభలో ముఖ్యమంత్రి ఉద్ఘాటన

  • ములక్కాయలపల్లెలో మహిళకు రూ.15 వేల దివ్యాంగ పెన్షన్‌

  • దోబీఘాట్‌లో రజకులతో మాటామంతీ

రాయచోటి, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ‘‘మీకు ధైర్యం ఉంటే.. చిత్తశుద్ధి ఉంటే.. మీ 11 మంది ఎమ్మెల్యేలూ అసెంబ్లీకి రండి.. పింఛన్లు సహా ఏ అంశంపైనైనా చర్చిద్దాం. నాడు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు కదా! నేడు సూటిగా అడుగుతున్నా.. అసెంబ్లీకి సిద్ధమా? ఎవరిది సంక్షోభ పాలనో? ఎవరిది సంక్షేమ రాజ్యమో తేల్చేద్దాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీకి సవాల్‌ విసిరారు. ఎవరిది విధ్వంసమో ఎవరిది అభివృద్ధి పాలనో. శాసనసభ సాక్షిగా తేల్చేద్దామన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాల నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకూ, పెట్టుబడుల నుంచి పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల వరకూ, బాబాయ్‌ హత్య నుంచి దళిత డ్రైవర్‌ శవం డోర్‌ డెలివరీ దాకా, కోడికత్తి డ్రామా నుంచి గులకరాయి ఎపిసోడ్‌ వరకు చర్చిద్దామని సవాల్‌ చేశారు. సభకు రాకుండా.. ఫేక్‌ మీడియాతో తప్పుడు ప్రచారాలు చేస్తామంటే మాత్రం కుదరదన్నారు. ‘పేదలకు సేవ’ కార్యక్రమంలో భాగంగా సోమవారం అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఆయన పర్యటించారు. తొలుత ములక్కాయలపల్లె వెళ్లి అనారోగ్యంతో 14 ఏళ్లుగా మంచంపైనే జీవనం సాగిస్తున్న మహిళకు రూ.15 వేలు వికలాంగ పింఛను అందజేశారు. తర్వాత బోయనపల్లెలో రజకులతో మాట్లాడారు. అనంతరం తాళ్లపాకలో ఏర్పాటుచేసిన ప్రజావేదికలో మాట్లాడారు. బంగారు కుటుంబాలు, మార్గదర్శులతో ముచ్చటించారు.


కార్యకర్తల సమావేశంలో, తర్వాత బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో ఒక ఫేక్‌ పార్టీ ఉందని.. అవినీతితో పేపర్‌, టీవీ పెట్టుకుని అన్నీ తప్పులే రాస్తున్నారని మండిపడ్డారు. ‘పోలవరం మేం కడితే దానిని కూలుస్తారు.. ప్రజా రాజధాని అమరావతి ఉండాలని మనం ఆకాంక్షిస్తే అమరావతిని ఎడారి చేశారు.. మనం రోడ్లు వేస్తే.. రోడ్లన్నీ గుంతలు పెట్టారు.. అలాంటి పార్టీకి నేను సవాల్‌ విసురుతున్నా.. అసెంబ్లీకి రండి.. అసెంబ్లీలో చర్చిద్దాం.. అసెంబ్లీలో సమాధానం చెప్పే ధైర్యం సత్తా మాకుంది. మీరు చేసిన తప్పుడు పనులు.. ఫేక్‌ మీడియాలో రాసే తప్పుడు కథనాలకు మేం సమాధానం చెప్పాలా..’ అని నిలదీశారు. రానున్న ఎన్నికల్లోనూ ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పడుతుందని చెప్పారు. పులివెందులలో కూడా కూటమి గెలుస్తుందన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..

అప్పు చేసి బాగుపడిన వాళ్లు ఎవరైనా ఉన్నారా?

గత ప్రభుత్వం అప్పులు చేసి ప్రజలను మోసం చేసింది. ఎక్కడైనా అప్పులు చేసిన కుటుంబం బాగుపడిందా? అందుకే ఆదాయాన్ని పెంచి.. అభివృద్ధి చేసి అందులో పేదవాడిని ఆదుకుంటున్నాను. గతంలో హైదరాబాద్‌లో నేను ఐటీ అంటే అందరూ ఎగతాళి చేశారు. ఈ రోజు చూస్తే నేను ప్రారంభించిన ఐటీ ప్రపంచంలో తెలుగువారికి గుర్తింపు తెస్తోంది.. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా అక్కడ తెలుగులో మాట్లాడితే వంద మంది చేరతారు. తెలుగు మాట్లాడే వారు అన్ని దేశాలకూ వెళ్తున్నారు. 30 ఏళ్లలో హైదరాబాద్‌ విశ్వన గరంగా తయారైంది.


భయం నుంచి స్వేచ్ఛ..

2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వంలో అన్ని రంగాల్లోనూ విధ్వంసం జరిగింది. ప్రజలు భయం భయంగా బతికారు. ఐదేళ్లూ వారి ముఖాల్లో నవ్వులు లేవు. ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఈ తరుణంలో నేను, పవన్‌ కల్యాణ్‌ కలిసి పోటీ చేయాలనుకున్నాం. బీజేపీ కూడా ముందుకు వచ్చింది. ముగ్గురం 94 శాతం స్ర్టైక్‌ రేట్‌తో.. ఎప్పుడూ లేనంత మెజారిటీతో గెలిచాం ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. భయం లేకుండా మాట్లాడగలుగుతున్నారు. ఎమ్మెల్యేలు తప్పుచేసినా నిలదీయగలుగుతున్నారు. ఇదీ మేం కల్పించిన స్వేచ్ఛ. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలే తిప్పికొట్టాలి. మంచి ప్రభుత్వానికి అండగా నిలబడాలి. గత ఏడాది విజయం మన సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతోంది. ప్రధాని మోదీ దేశాభివృద్ధికి అనేక సంస్కరణలకు నాంది పలికారు. నేను మొదటి నుంచీ సంస్కరణలు అమలు చేశాను. దేశం అభివృద్ధి కావాలి.. మనం కూడా దేశంలో ఒక భాగం. టీడీపీ ఎప్పుడూ ప్రజల కోసమే అధికారాన్ని ఉపయోగిస్తుంది. ఆ రోజుల్లో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేషనల్‌ ప్రంట్‌ ఏర్పాటు చేశారు. నేను సీఎం అయ్యాక.. నాడు యునైటెడ్‌ ఫ్రంట్‌, నేడు ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నాను.


జీవితానికి ఇంకేం కావాలి..?

గతంలో బావులు, వాగులు, వంకలు వద్దకు రజకులు వెళ్లి దుస్తులు ఉతికి తీసుకొచ్చేవారు. వారి కష్టాలను చూసి.. ఊళ్ల మధ్యలో దోభీ ఘాట్లను కట్టి బోర్లు వేయించాం. ఇప్పుడు దోభీఘాట్లలో వృద్ధ రజకులు నన్ను చూసి 20 ఏళ్ల క్రితం మీరే కట్టించారు సార్‌ అని చెబితే నాకెంతో ఆనందంగా ఉంది. ఒకచోట రజకుడు.. ఇస్త్రీ పెట్టె మీరే ఇచ్చారు సార్‌ అని చెప్పడం చూస్తే.. జీవితంలో ఇంకేం కావాలని అనిపించింది. టీడీపీ, ఎన్టీఏ బీసీలకు అన్ని విధాలా న్యాయం చేస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో ఆదరణ-1, ఆదరణ-2 పథకాలు ప్రవేశపెట్టాను.


రాబోయే రోజుల్లో సంజీవని ప్రాజెక్టు

ఆరోగ్య, ఆనంద సమాజం కోసం ప్రయత్నిస్తున్నాను. దీనిని దృష్టిలో ఉంచుకుని రాబోయే రోజుల్లో సంజీవని అనే ప్రాజెక్టు తీసుకొస్తున్నాను. ఇది వినూత్నమైన ప్రాజెక్టు. టెక్నాలజీ సాయంతో విజయవంతమవుతుంది. పేదవాడి ఆరోగ్యం కాపాడే విధంగా.. ఏ మందు అవసరమో ఆ మందు తీసుకొస్తాం. ఎక్కువ బియ్యం తినడం వల్ల కార్బోహైడ్రైట్స్‌ పెరిగి బీపీ, షుగర్‌ వస్తున్నాయి. భవిష్యత్‌లో రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడానికి సంజీవని ఎంతో ఉపయోగపడుతుంది. అంతకుముందు మధ్యాహ్నం 12.20 గంటలకు హెలికాప్టర్లో రాజంపేటలోని హెలిప్యాడ్‌ వద్ద సీఎం దిగారు. జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరవ శ్రీఽధర్‌, షాజహాన్‌బాషా తదితరులు స్వాగతం పలికారు.


14 ఏళ్లుగా మంచంలోనే..!

రాజంపేట మండలం ములక్కాయలపల్లెలో సుమారు 14 ఏళ్లుగా మంచంలోనే జీవనం సాగిస్తున్న యడబల్లి సుమిత్రమ్మ(54)కు ముఖ్యమంత్రి స్వయంగా రూ.15 వేలు దివ్యాంగ పింఛనుగా అందజేశారు. ఆమె అనారోగ్య సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఆమె భర్త వెంకటేశ్వర్‌రాజుతో మాట్లాడారు. తాను ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నానని.. భార్య అనారోగ్యంపాలై మంచానికే పరిమితమవడంతో అష్టకష్టాలు పడుతున్నామని రాజు చెప్పాడు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం బోయనపల్లె గ్రామంలో దోభీఘాట్‌కు చేరుకుని రజకులతో మాట్లాడారు. టి.ఆదిలక్ష్మి, బి.లక్ష్మీదేవి, టి.లక్ష్మీదేవి, హరిప్రసాద్‌, జయరాం, నరసింహులు, పెంచలయ్య, సంటయ్య తదితరులతో ఆప్యాయంగా మాట్లాడారు. వృత్తి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బోయనపల్లె ప్రజలు ఆయనకు మంగళ హారతులు పడుతూ నీరాజనాలు పలికారు.

Updated Date - Sep 02 , 2025 | 07:41 AM