Share News

CM Chandrababu: ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచాలి

ABN , Publish Date - Oct 14 , 2025 | 05:52 AM

రాష్ట్రానికి భారీస్థాయిలో పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచడానికి సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదిక కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

CM Chandrababu: ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచాలి

  • భారీస్థాయిలో పెట్టుబడులు ఆకర్షించాలి

  • దేశ ఆర్థిక, సాంకేతిక ప్రగతిలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలపాలి

  • సీఐఐ భాగస్వామ్య సదస్సు లక్ష్యమిదే

  • మంత్రులు, అధికారులతో చంద్రబాబు సమీక్ష

  • నవంబరు 14, 15 తేదీల్లో విశాఖలో నిర్వహణ

  • దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు రాక

  • ఇప్పటికే పారిశ్రామికవేత్తలకు లోకేశ్‌ ఆహ్వానం

అమరావతి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి భారీస్థాయిలో పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచడానికి సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదిక కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశ ఆర్థిక, సాంకేతిక ప్రగతిలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా ఈ సదస్సును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వివిధ దేశాల వాణిజ్య మంత్రులు, లీడింగ్‌-గ్లోబల్‌ సీఈవోలను ఆహ్వానించాలని అధికారులకు నిర్దేశించారు. నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు సన్నాహాలపై సోమవారం సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, విధాన ఆలోచనాపరులు, నిపుణులకు ఈ సదస్సులో ప్రాధాన్యం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. గ్లోబల్‌ టెక్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌, గ్లోబల్‌ ట్రస్ట్‌, గ్లోబల్‌ ట్రేడ్‌లో మన వాటా పెంచుకోవడం లక్ష్యంగా ఉండాలన్నారు. ఈ సదస్సుకు హాజరయ్యే అతిథులకు అన్ని సౌకర్యాలతో ఆతిథ్యం ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సదస్సు నిర్వహణ నేపథ్యంలో విశాఖ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలని అన్నారు. సదస్సు ఏర్పాట్లకు సమయం తక్కువగా ఉన్నందున వేగంగా పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ‘గ్రీన్‌ ఎనర్జీ రంగంలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. గూగుల్‌ వంటి అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయి. రాష్ట్రం త్వరలోనే కృత్రిమ మేథస్సు (ఏఐ), ఇన్నోవేషన్‌ హబ్‌గా మారనుంది. ఈ అంశాలు, రాష్ట్ర ఆకాంక్షలు విశాఖ సదస్సులో ప్రతిబింబించాలి’ అని చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు లోకేశ్‌, పొంగూరు నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌, సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చందర్జిత్‌ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2025 | 05:53 AM