CM Chandrababu Calls for Swachh Andhra: ఉద్యమంలా స్వచ్ఛాంధ్ర
ABN , Publish Date - Sep 17 , 2025 | 03:58 AM
స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో..
జనవరి నుంచి వ్యర్థం అనేది కనిపించకూడదు
నేటినుంచి వచ్చేనెల 2 వరకూ ‘స్వచ్ఛతా హీ సేవ’
కలెక్టర్ల సమావేశంలో సీఎం ఆదేశాలు
అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో స్వచ్ఛాంధ్ర, సర్క్యులర్ ఎకానమీ తదితరఅంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జనవరి నుంచి వ్యర్థం అనేది ఎక్కడా కనిపించకూడదని స్పష్టం చేశారు. 83 లక్షల టన్నుల లెగసీ వేస్ట్ (గతంలో పేరుకుపోయిన వ్యర్థాలు) శుభ్రం చేశామని, చెత్తపై పన్ను కూడా రద్దు చేశామని తెలిపారు. స్వచ్ఛభారత్ కోసం ఏ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు చేపట్టినా దాన్ని అది రాష్ట్రమంతా వర్తింపచేయాలని ఆదేశించారు. స్వచ్ఛత అంటే పరిశుభ్రత పాటించేలా చూడటమే కాదని, ప్రజల ఆలోచనా విధానం కూడా మారేలా చూడాలని సూచించారు. ఇంట్లో చెత్తను డ్రెయిన్లలో వేయడం వల్ల ప్రవాహానికి ఇబ్బందిగా మారుతుందని, ఇలాంటి అలవాట్లకు ప్రజలు దూరంగా ఉండేలా చూడాలని కోరారు. ఎలాంటి కార్యక్రమమైనా ప్రజల భాగస్వామ్యం ఉంటే విజయవంతం అవుతుందని అన్నారు. ఈ నెల 17 నుంచి అక్టోబరు 2 వరకు ‘స్వచ్ఛతా హీ సేవ’ చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు.
చేతి వృత్తులకు చేయూత
‘‘మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలకు అవసరమైన కలప కోసం చెట్లు పెంచడానికి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. చేతి వృత్తులను, కులవృత్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో వెదురుతో చేసే ఉత్పత్తుల కోసం ఓ కార్యక్రమాన్ని రూపొందించాలి. వెదురు ఉత్పత్తులు చేసేవారికి వెదురును సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలి. ఉపాధి హామీ పథకం కింద ఘనవ్యర్థాల షెడ్ల నిర్మాణానికి కేంద్రానికి లేఖ రాద్దాం. సీసీ రోడ్ల నిర్మాణం సమయంలో కాలువల కోసం మళ్లీ తవ్వకుండా ముందుగానే పైపులైను పెట్టేలా నిర్మాణం చేపట్టాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు ఉన్నా... డ్రైయిన్లు సరిగ్గా లేవు. ఇలాంటి చోట్ల మేజిక్ డ్రైన్లు నిర్మించాలి. అత్యవసర పనులకు నిధులు తక్షణం మంజూరు చేస్తాం’ అని సీఎం స్పష్టం చేశారు. ఏజెన్సీ ప్రాంతాలను అర్బన్ సౌకర్యాలతో మోడల్ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని పంచాయతీరాజ్ అధికారులకు ఆయన సూచించారు