మోదీపై బిహార్ ప్రజల నమ్మకానికి నిదర్శనం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 15 , 2025 | 06:37 AM
బిహార్‌లో ఎన్డీయే సాధించిన భారీ, చారిత్రాత్మక విజయం ప్రజలకు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రగతిశీల పాలనపై ఉన్న నమ్మకాన్ని ప్రతిఫలిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు.
అమరావతి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): బిహార్‌లో ఎన్డీయే సాధించిన భారీ, చారిత్రాత్మక విజయం ప్రజలకు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రగతిశీల పాలనపై ఉన్న నమ్మకాన్ని ప్రతిఫలిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. అపూర్వ విజయం సాధించిన ప్రియ మిత్రుడు నితీశ్ కుమార్‌కి అభినందనలు తెలిపారు. మంత్రి లోకేశ్ కూడా బిహార్‌లో ఎన్డీయే కూటమి విజయంపై అభినందనలు తెలిపారు. ఈ విజయం న-ని(నరేంద్ర మోదీ- నితీశ్ కుమార్) మ్యాజిక్‌గా లోకేశ్ అభివర్ణించారు. విశాఖపట్నంలో సీఐఐ సదస్సులో ఉన్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, రామ్మోహన్‌నాయుడు, శ్రీనివాసవర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ స్వీట్లు తినిపించుకుని అభినందనలు తెలుపుకొన్నారు.
మోదీతోనే సుస్థిర పాలన సాధ్యం: పవన్
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే భారతదేశ సమగ్రాభివృద్ధి, సుస్థిర పాలన సాధ్యమని దేశ ప్రజలు విశ్వసిస్తున్నారని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. బిహార్‌లో కూటమి విజయానికి కారకులైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిహార్ సీఎం నీతీశ్ కుమార్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాకి అభినందనలు తెలిపారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
‘మూడ్ ఆఫ్ ది నేషన్’కు ప్రతిబింబం: సత్యకుమార్
బిహార్ ఎన్నికల్లో ప్రజల తీర్పు మూడ్ ఆఫ్ ది నేషన్‌కు ప్రతిబింబమని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్డీయే ప్రభుత్వాధినేత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి బిహార్ ప్రజలు తమ తీర్పు ద్వారా పూర్తి మద్దతు పలికారన్నారు.