CM Chandrababu: విశాఖ ఉక్కుకు భరోసా
ABN , Publish Date - Oct 16 , 2025 | 04:31 AM
విశాఖపట్నం స్టీల్ ప్లాంటును ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. విద్యుత్, నీటి చార్జీల భారం దాదాపురూ.2,400 కోట్లను రెండేళ్ల వరకు భరించడానికి అంగీకరిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
సీఎం చంద్రబాబు ‘ఉక్కు’ సంకల్పంతో
స్టీల్ ప్లాంటుకు 2,400 కోట్ల సాయానికి ఉత్తర్వులు
మూడేళ్ల వరకూ విద్యుత్, నీటి చార్జీలకు ఊరట
డబ్బుకు బదులు ప్రిఫరెన్షియల్ షేర్లు చాలన్న ప్రభుత్వం
నాడు స్టీల్ ప్లాంట్ విద్యుత్ చార్జీల చెల్లింపునకు
మూడు నెలలు గడువు కోరినా జగన్ ససేమిరా
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం స్టీల్ ప్లాంటును ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. విద్యుత్, నీటి చార్జీల భారం దాదాపురూ.2,400 కోట్లను రెండేళ్ల వరకు భరించడానికి అంగీకరిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. వీటిని పదేళ్ల వరకూ చెల్లించాల్సిన అవసరం లేదని, తర్వాత ఆ మొత్తానికీ ప్లాంటులో ప్రిఫరెన్షియల్ షేర్లు ఇస్తే చాలని సూచించారు. విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం విక్రయానికి పెట్టిందని, ప్రైవేటీకరణ చేస్తుందని వైసీపీతో పాటు ఇతర ప్రతిపక్షాలు కొద్దికాలంగా పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నాయి. వారం క్రితం నర్సీపట్నం పర్యటనకు వచ్చిన మాజీ సీఎం జగన్ స్టీల్ ప్లాంటు ఉద్యోగులను తన వాహనం వద్దకు పిలిపించుకొని వారి నుంచి సమస్యలపై లేఖ అడిగి తీసుకున్నారు. అయితే.. ఇదే జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ ఉక్కు కార్మిక సంఘ నాయకులు వచ్చి కలుస్తామంటే కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. ఎన్నో ప్రయత్నాల అనంతరం ఆయన విశాఖపట్నం వచ్చినప్పుడు విమానాశ్రయం లాంజ్‌లో కొద్దిసేపు వారితో మాట్లాడారు. విశాఖ ఉక్కు యాజమాన్యం తమకు నెల నెలా జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నదని కార్మిక నాయకులు జగన్ వద్ద వాపోయారు. నెలకు రూ.100 కోట్ల విద్యుత్ బిల్లు వస్తోందని, వాటిని కూడా చెల్లించలేకపోతున్నారని, ఈపీడీసీఎల్ అధికారులు వారం వారం వచ్చి బ్యాంకులో ఎంత ఉంటే అంత తీసుకుపోతున్నారని, దీనివల్ల జీతాలు మరింత ఆలస్యం అవుతున్నాయని వివరించారు. ఓ మూడు నెలలు విద్యుత్ బిల్లుల చెల్లింపునకు గడువు ఇవ్వాలని వారు అభ్యర్థించగా జగన్ తిరస్కరించారు.
ఉక్కు మంత్రిత్వ శాఖ అడిగినవి ఏమిటంటే...
కేంద్రం తరఫున విశాఖ ఉక్కుకు తాము రూ.11,440 కోట్లు ఆర్థిక సాయం చేస్తున్నామని, రాష్ట్రం తరఫున తమకు మూడు అంశాల్లో సాయంచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కు మంత్రిత్వ శాఖ కోరింది. అవి ఏమిటంటే..
1.స్టీల్ ప్లాంటుపై ఆర్థిక వ్యయం తగ్గించుకోవడానికిసీఐ ఎస్‌ఎఫ్ సిబ్బందిని తొలగించింది. వారి స్థానంలో ఏపీఎస్‌పీఎఫ్ సిబ్బందిని కోరింది. వెంటనే స్పందించిన రాష్ట్రప్రభుత్వం 167మందిని ఇచ్చింది.నెలకు 20లక్షల జీతాల్ని భరిస్తోంది.
2. మూడేళ్ల విద్యుత్,నీటి బిల్లులు మాఫీ చేయాలని ఉక్కు శాఖ కోరింది. దీనికి స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రూ.2,400 కోట్ల సాయం అందిస్తామని తెలిపింది.
3. రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులన్నింటికీ విశాఖ స్టీల్‌ను కొనుగోలు చేయాలని ఉక్కు మంత్రిత్వ శాఖ సూచించగా దీన్ని పరిశీలనలో పెట్టారు.