Share News

AP CM Chandrababu: విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టాం..

ABN , Publish Date - Dec 03 , 2025 | 04:36 AM

గత వైసీపీ పాలకులు విద్యుత్‌ వ్యవస్థను ధ్వంసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు.

AP CM Chandrababu: విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టాం..

  • విద్యుత్‌ రంగాన్ని గాడిన పెట్టాం: సీఎం

  • వైసీపీ హయాంలో ధ్వంసం చేశారు

  • నాడు పీపీఏల రద్దుతో 9 వేల కోట్ల భారం

  • సమర్థ నిర్వహణతో చక్కదిద్దాం

  • ప్రజలపై భారం పడకుండా చేశాం

  • ఫెర్రో అల్లాయ్స్‌కు మరో ఏడాది ప్రోత్సాహకాలు

  • ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్‌ ఫలకాలు

  • ఆర్టీసీకి త్వరలోనే 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు

  • రాష్ట్రంలో 5 వేల విద్యుత్‌ చార్జింగ్‌ స్టేషన్లు

  • ఇతర రాష్ట్రాలతో ‘స్వాపింగ్‌’ ఒప్పందాలు

  • ఇంధన రంగంలో ఒప్పందాలను 60 రోజుల్లో అమలు చేయాలి: సీఎం చంద్రబాబు

  • విద్యుత్‌ శాఖపై సమీక్షలో కీలక నిర్ణయాలు

‘పీఎం సూర్యఘర్‌’ యోజన కింద ఎస్సీ, ఎస్టీల నివాసాలపై సౌర ఫలకాలను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాం. బీసీ కుటుంబాలకు 3 కిలోవాట్ల వరకు రూ.20 వేల సబ్సిడీతో వీటిని అందించండి. చేనేతలకు 200 యూనిట్లు, పవర్‌ లూమ్స్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్తును అమలు చేయండి.

- సీఎం చంద్రబాబు

అమరావతి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ పాలకులు విద్యుత్‌ వ్యవస్థను ధ్వంసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) రద్దుతో ప్రజలపై రూ.9 వేల కోట్ల భారం పడిందన్నారు. విద్యుత్తును వినియోగించుకోకుండానే ఆయా కంపెనీలకు రూ.9 వేల కోట్ల ప్రజాధనాన్ని చెల్లించాల్సి వచ్చిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక విద్యుత్తు వ్యవస్థలను గాడిలో పెట్టామని తెలిపారు. విద్యుత్తు వ్యవస్థల సమర్థ నిర్వహణ ద్వారా చార్జీలను ఏమాత్రం పెంచకుండా.. రూ.9 వేల కోట్ల భారం ప్రజలపై పడకుండా ‘జీరో’ చేయగలిగామని సీఎం వివరించారు. సచివాలయంలో మంగళవారం విద్యుత్తు శాఖపై సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా పరిస్థితి, పీఎం కుసుమ్‌, పీఎం సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన కింద సోలార్‌ రూఫ్‌ టాప్‌ పథకం, విద్యుత్తు ఉత్పత్తి, పంపిణీ వ్యయం తగ్గింపు తదితర అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించారు.


ప్రోత్సాహకాలు పెంపు

ఫెర్రో అల్లాయ్స్‌ పరిశ్రమలకు మరో ఏడాదిపాటు విద్యుత్తు ప్రోత్సహకాలను పొడిగిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కీలకమైన పరిశ్రమలుగా వీటిని గుర్తించి మరో ఏడాదిపాటు ప్రోత్సహకాలను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా ప్రభుత్వంపై రూ.1,053 కోట్ల భారం పడనుంది. రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా జరగాలని సీఎం ఆదేశించారు. ప్రత్యేకించి విద్యుత్తు సరఫరా, పంపిణీ నష్టాలను 2029 నాటికి 9.20 శాతం నుంచి గణనీయంగా తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్తు కొనుగోళ్ల భారం తగ్గించుకునేందుకు ఇతర రాష్ట్రాలతో పవర్‌ ‘స్వాపింగ్‌’ ఒప్పందాలు కుదుర్చుకోవాలని సీఎం సూచించారు. పీఎం కుసుమ్‌ సహా ప్రధానమంత్రి సూర్యఘర్‌ యోజన కింద సోలార్‌ రూఫ్‌ టాప్‌ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పీఎం కుసుమ్‌ ప్రాజెక్టు కింద 4,792 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని సీఎం కోరారు. ప్రభుత్వ భవనాలపై సౌరఫలకాలను ఏర్పాటు చేసి విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మేరకు 483కు పైగా ప్రభుత్వ భవనాలపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసి సుమారు 150 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసేలా కార్యాచరణ చేపట్టనున్నారు. ప్రభుత్వ శాఖలతోపాటు ప్రజలు కూడా విద్యుత్తు పొదుపు చేసేలా ఉపకరణాలు వినియోగించేందుకు అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని అధికారులకు సూచించారు.

సమస్యల పరిష్కారంపై దృష్టి: రాష్ట్రంలో విద్యుత్తు ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థలు ఐస్‌(ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ) పాలసీ ద్వారా 60 రోజుల్లోనే కార్యకలాపాలు ప్రారంభించేలా చూడాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించి అనుమతులు జారీ చేయాలని స్పష్టం చేశారు. తద్వారా విద్యుత్తు ఉత్పత్తిలో ఏపీ న్యూ ఎనర్జీ హబ్‌గా మారాలని చెప్పారు. ఈ రంగంలో వినూత్న ఆవిష్కరణలు రావాల్సి ఉందన్నారు. విద్యుత్తు సంస్థలు రుణ సమీకరణలో వడ్డీ భారాన్ని తగ్గించుకోవాలని, కొనుగోళ్లలోనూ వ్యయం తగ్గించుకోవాలని సూచించారు.


రూ.500 కోట్ల పొదుపు

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో యూనిట్‌కు 20 పైసల చొప్పున కొనుగోలు వ్యయం తగ్గించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ముఖ్యమంత్రికి వివరించారు. ఈపీఎంఎస్‌ విధానంతో నిరంతర పర్యవేక్షణ ద్వారా రూ.400 నుంచి 500 కోట్ల మేర పొదుపు చేయగలిగామన్నారు. దీనిపై స్పందించిన సీఎం ఇతర రాష్ట్రాలతో పవర్‌ స్వాపింగ్‌ ఒప్పందాలు చేసుకోవడం ద్వారా కొనుగోలు వ్యయం తగ్గుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిశ్రమలకు, వాణిజ్యం, గృహ అవసరాలు, వ్యవసాయ రంగంలో విద్యుత్తు వినియోగాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించాలని, డిమాండ్‌కు తగినట్లుగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలని ఆదేశించారు.

ఆదాయం పెంచేలా చర్యలు

‘పీఎం కుసుమ్‌’ కింద దేవదాయ, జలవనరుల శాఖలకు చెందిన భూముల్లో విద్యుత్తు ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ఎనర్జీ పాలసీలో భాగంగా మూల ధన రాయితీ, జీఎస్టీ మినహాయింపు సహా 9 అంశాలకు సీఎం అంగీకారం తెలిపారు.

ఐఐటీ బృందంతో అధ్యయనం

థర్మల్‌ పవర్‌ స్టేషన్లలోని బూడిదను వివిధ అవసరాలకు సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు తెలిపారు. కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు ఐఐటీ బృందంతో అధ్యయనం చేయించాలన్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడటంతోపాటు దానికి రేటింగ్‌ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. విద్యుత్తు రంగంలో నూతన ఆవిష్కరణల కోసం ఏటా ‘హ్యాక్‌థాన్‌’ నిర్వహించాలని కోరారు. ఈ సమీక్షలో విద్యుత్తుశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు!

రాష్ట్రంలోని రిజర్వాయర్ల వద్ద పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను జెన్‌కో ఇరిగేషన్‌ అధికారులతో కలిసి అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల వద్ద పీఎస్సీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకుంటే పెద్ద ఎత్తున విద్యుత్తు ఉత్పత్తి సాధ్యమవుతుందన్నారు. ఐదేళ్లలో ఆర్టీసీ బస్సులను విద్యుత్‌ వాహనాలుగా మార్చాలని సూచించారు.

Updated Date - Dec 03 , 2025 | 07:03 AM