AP CM Chandrababu: ఇక ఏటా డీఎస్సీ
ABN , Publish Date - Sep 26 , 2025 | 04:12 AM
ఇక ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని, ఏడాదికో నోటిఫికేషన్ ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఉద్యోగార్థులందరూ పరీక్షలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.
ఏడాదికో నోటిఫికేషన్ ఇస్తాం.. అందరూ పరీక్షలకు సిద్ధమవ్వండి: సీఎం
అవినీతి లేకుండా మెగా డీఎస్సీ నిర్వహించాం
‘బాబు ష్యూరిటీ- జాబు గ్యారంటీ’ నిజమైంది
ప్రభుత్వంలోనే మెరుగైన సౌకర్యాలు, బోధన
సర్కారీ బడుల్లో ‘నో అడ్మిషన్’ బోర్డులుండాలి
పిల్లలకు విలువలతో కూడిన విద్య నేర్పండి
కొత్త టీచర్లకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం
అనారోగ్యం కారణంగా హాజరుకాలేకపోయిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
భవిష్యత్తులో విద్యారంగంలో ఎలాంటి మార్పులొస్తాయో ఇప్పటినుంచే టీచర్లు ఆలోచించాలి. ఈ రోజు ప్రైవేట్ రంగం నుంచి శాటిలైట్లు ప్రయోగిస్తున్నారు. రక్షణకు, రోజువారీ పనులకు డ్రోన్లను వాడుతున్నారు. వాట్సాప్ ద్వారా 750 సేవలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనది. నేను నిత్య విద్యార్థిని. కొత్త విషయాలు నేర్చుకొని ప్రజలకు పనికొచ్చే వాటిని అమలు చేస్తున్నా.
- సీఎం చంద్రబాబు
అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఇక ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని, ఏడాదికో నోటిఫికేషన్ ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఉద్యోగార్థులందరూ పరీక్షలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన 15,941 మందికి గురువారం అమరావతిలో నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు, అధికారులు నియామక పత్రాలు అందించారు. సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘అసాధ్యమనుకున్న పనిని ఏడాదిలోగా పూర్తిచేసి నియామక పత్రాలు ఇప్పించిన ఘనత మంత్రి లోకేశ్‌దే. ఉద్యోగం కోసం ఒక్క అభ్యర్థి కూడా ఎవ్వరికీ డబ్బులు ఇచ్చే అవసరం లేకుండా నియామక ప్రక్రియను లోకేశ్, ఆయన బృందం పారదర్శకంగా చేపట్టారు. మంత్రుల దగ్గర నుంచి దీన్నే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వచ్చిన అవకాశాన్ని బాగా పనిచేసి నిరూపించుకున్నారు. ‘బాబు ష్యూరిటీ- జాబు గ్యారంటీ’ నెరవేరింది. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉద్యోగాలు భర్తీచేశాం. 15 ఏళ్లలో 14సార్లు డీఎస్సీ నిర్వహించి, 1,96,619 మందికి ఉద్యోగాలిచ్చాం. రాష్ట్రంలో చేతగాని ప్రతిపక్షం ఉంది. మంచి చేయలేరు. మంచి జరిగితే చూస్తూ సహకరించలేరు. డీఎస్సీని అడ్డుకోవాలని 106 కేసులు వేశారు.
ఇవి ప్రైవేటు వారు వేసిన కేసులు కాదు. రాజకీయ ప్రయోజనాల కోసం వేశారు. ఒక్క కేసు కూడా నిలవకుండా సజావుగా డీఎస్సీ నిర్వహించిన లోకేశ్‌ను అభినందిస్తున్నా. 1998లో టీచర్ ఉద్యోగాలకు కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చాను. పోస్టింగుల కోసం రాజకీయ నాయకుల దగ్గరకు వెళ్లి పైరవీలు చేసేవాళ్లు. ఈ రోజు ప్రతిభ ఆధారంగా కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. కుటుంబ వ్యవస్థను గౌరవించడం మన సంప్రదాయం. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచడం కోసం చాగంటి కోటేశ్వరరావును సలహాదారుగా నియమించాం. ఆయన రాసిన పుస్తకాలు మీరు ఉపయోగించుకోవాలి. పిల్లలకు విలువలతో కూడిన విద్య నేర్పాలి’ అని సీఎం సూచించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
విద్యావ్యవస్థను నాశనం చేశారు
‘గత ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యావ్యవస్థకు శాపంగా మారింది. 10 లక్షల మంది పిల్లలు ప్రైవేటు బడులకు వెళ్లిపోయారు. డ్రాపవుట్లు పెరిగాయి. ప్రాథమిక విద్యను మాతృభాషలోనే చదువుకోవాలి. ఇంగ్లీషు మీడియం అన్నారు. నేను పల్లెటూరిలో ప్రభుత్వ పాఠశాలలో తెలుగులో చదివాను. తెలుగు మీడియం చదివి ప్రపంచవ్యాప్తంగా సంపాదిస్తున్నారు. లేనిపోని సమస్యలు తెచ్చి విద్యావ్యవస్థను నాశనం చేశారు. నాడు-నేడులో రూ.7,876 కోట్ల విలువైన పనులు పూర్తికాలేదు. 21,151 స్కూళ్లలో బెంచీలు లేవు. వారి హయాంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య 8శాతం పడిపోయింది. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల ముందు ‘నో అడ్మిషన్’ బోర్డులు పెట్టే పరిస్థితి వచ్చినందుకు గర్వంగా ఉంది. ‘తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం కోసం మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాం. ‘మన బడి-మన భవిష్యత్’ కింద బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాం. ‘వన్ క్లాస్- వన్ టీచర్’ విధానాన్ని 9,625 పాఠశాలల్లో ప్రారంభించాం. బదిలీ చట్టం తీసుకొచ్చి 72,886 బదిలీలు, 4,477 ప్రమోషన్లు పారదర్శకంగా చేశారు. ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. దీనికి విద్యాశాఖను అభినందిస్తున్నాను. తల్లికి వందనం పథకం ద్వారా ఎంత మంది పిల్లలుంటే అంతమందికి రూ.15,000 చొప్పున ఇచ్చాం. ప్రతి శనివారం నో బ్యాగ్ డే పెట్టి పుస్తకాల భారం తప్పించారు. పుస్తకాలు, యూనిఫాంలు, బ్యాగులు సరైన సమయంలో ఇచ్చారు ప్రైవేటు కంటే ప్రభుత్వ స్కూళ్లలో మంచి సౌకర్యాలు ఉన్నాయి. మంచి టీచర్లు ఉన్నారు. ఈ రెండూ ఉన్నా కూడా నాయకత్వం లోపంతో వెనకబడుతున్నాం. కానీ, ఇప్పుడు లోకేశ్ రూపంలో మంచి నాయకత్వం వచ్చింది’ అని చంద్రబాబు పేర్కొన్నారు. అనంతరం కొత్త టీచర్లంతా వారి కర్తవ్య నిష్ట ప్రతిజ్ఞ చేశారు. కాగా, అనారోగ్యం కారణంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సభకు హాజరు కాలేకపోయారు. ఉద్యోగ విధుల్లో చేరుతున్న కొత్త ఉపాధ్యాయులకు ఆయన ఓ ప్రకటన ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
భారత్ విశ్వగురు కావాలి: మాధవ్
ప్రపంచంలో భారతదేశం విశ్వగురుగా మారాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆకాంక్షించారు. దానికి టీచర్లంతా సహకరించాలని కోరారు. కొత్త టీచర్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 150 రోజుల్లోనే భర్తీ ప్రక్రియ పూర్తిచేసిన లోకేశ్‌కు అభినందనలు తెలియజేశారు.