Share News

CM Chandrababu: చెప్పాం.. చేసి చూపిస్తున్నాం

ABN , Publish Date - Sep 28 , 2025 | 04:02 AM

వచ్చే నెల 4వ తేదీన ఆటోడ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకం కింద 2,90,234 మంది డ్రైవర్లకు రూ.15 వేలు చొప్పున సాయం చేస్తామని తెలిపారు.

CM Chandrababu: చెప్పాం.. చేసి చూపిస్తున్నాం

  • వచ్చే నెల 4న ‘ఆటోడ్రైవర్ల సేవ’లో ఒక్కొక్కరికి రూ.15 వేలు సాయం

  • 2,90,234 మందికి రూ.435 కోట్లు

  • అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన

  • మహిళలకు ఉచిత ప్రయాణం, దీపం 2.0 తల్లికివందనం, అన్నదాత సుఖీభవ అమలు

  • 4,71,574 మందికి ఉద్యోగావకాశాలు

  • కూటమి కలయికతో ఇవన్నీ సాధ్యం

  • ఎమ్మెల్యేలు కలసికట్టుగా పనిచేయాలి

  • 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు సభలో సీఎం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌

టీడీపీ, జనసేన, బీజేపీ కలసి ఎన్నికలకు వెళ్లా యి. ప్రధాని మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సహకారంతో కూటమి ప్రభు త్వం అంకిత భావంతో పనిచేస్తోంది. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఉంది కాబట్టే 15 నెలల కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టగలిగాం. అభివృద్ధి-సంక్షేమం-సుపరిపాలన ద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తున్నాం. రాష్ట్రాభివృద్ధిలో ఎమ్మెల్యేలు కలిసికట్టుగా పనిచేయాలి. కలసి ఉన్నాం కాబట్టే ఇవన్నీ చేయగలుగుతున్నాం. దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి.

- చంద్రబాబు

అమరావతి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): వచ్చే నెల 4వ తేదీన ఆటోడ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకం కింద 2,90,234 మంది డ్రైవర్లకు రూ.15 వేలు చొప్పున సాయం చేస్తామని తెలిపారు. ఏదైనా కారణాల వల్ల లబ్ధిదారుల జాబితాలో అర్హులైన వారి పేరు లేకపోతే, సమస్యను పరిష్కరించి జాబితాలో చేరుస్తామని చెప్పారు. శనివారం అసెంబ్లీలో సూపర్‌ సిక్స్‌, మేనిఫెస్టో హామీల అమలుపై ముఖ్యమంత్రి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో చెప్పినవన్నీ నేడు చేసి చూపిస్తున్నామన్నారు. మరే ఇతర రాష్ట్రంలో లేనివిధంగా ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. నెలకు రూ.2,745 కోట్లను ఖర్చు చేస్తున్నామని, మొత్తంగా 63.50 లక్షల మందికి పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పెన్షన్లకు ఏడాదికి రూ.32,143 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని, తెలంగాణలో రూ.8,179 కోట్లు, కేరళలో రూ.7,295 కోట్లు పెన్షన్ల కింద ఖర్చు పెడుతున్నాయని.. ఏపీలో ఇచ్చే మొత్తంతో పోలిస్తే పావు వంతు ఇస్తున్నాయని అన్నారు. ప్రతి నెలా ఇచ్చే ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లకు ఎంతో ఆలోచించి పేదల సేవలో అని పేరు పెట్టామని సీఎం తెలిపారు.


ఉద్యోగాల కల్పనకు మొదటి ప్రాధాన్యం

‘‘రాష్ట్రంలోని యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు 4,71,574 మందికి ఉద్యోగావకాశాలు కల్పించాం. ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తుంది. ఇప్పుడు 204 అన్న క్యాంటీన్లు ఉన్నాయి. త్వరలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా 70 క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నాం’’ అని చెప్పారు. ‘‘యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ ద్వారా ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పించే విధానానికి శ్రీకారం చుట్టాం. 1.63 కోట్ల మంది పేదలకు రూ.25 లక్షల వరకు ఉచితంగా చికిత్సలు అందించేలా పాలసీ రూపొందించాం. వచ్చే జూన్‌ నాటికి 6.15 లక్షల ఇళ్లను అందుబాటులోకి తెస్తాం. 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండేలా చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు.

పేదల కోసమే నిత్యం ఆలోచన..

ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి ఆటో, క్యాబ్‌ డైవర్లు అర్హులు. ఊపిరి ఉన్నంతకాలం పేదల కోసమే పనిచేస్తాను. పేదల కోసమే నిత్యం ఆలోచన చేస్తున్నా. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం, నంబర్‌ వన్‌గా చేయడానికి పనిచేస్తున్నాను. అలాగే ఎమ్మెల్యేలూ పనిచేయాలి. మేనిఫెస్టో హామీలు చాలా వరకు అమలు చేశాం. రైల్వే జోన్‌ ఏర్పాటయ్యేలా చూశాం. ఉద్యోగులకు మొదటి తేదీనే జీతాలు ఇస్తున్నాం. ఆర్థిక అసమానతలు తగ్గించడానికి పీ-4 వేదిక కానుంది’’ అని చంద్రబాబు అన్నారు.


లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలే లక్ష్యం

‘‘డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలను బలోపేతం చేశాం. డ్వాక్రా మహిళలు పెద్దఎత్తున డబ్బులు పొదుపు చేస్తున్నారు. చాలా పరిశ్రమలు, చాలా మంది అప్పులు తీసుకుని ఎన్‌పీఏలుగా మారుతున్నారు. కానీ డ్వాక్రా సంఘాలు మాత్రం తీసుకున్న అప్పులను కచ్చితంగా తిరిగి చెల్లిస్తున్నారు. లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తయారు చేసే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలి. ప్రతి ఎమ్మెల్యే వెయ్యి మంది మహిళలను గుర్తించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా కృషి చేయాలి’’ అని అన్నారు.

అన్నదాత సుఖీభవ

‘‘రైతు కుటుంబం నుంచి వచ్చాను. రైతులను ఆదుకునే బ.ాధ్యతను తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చాం. గత ప్రభుత్వం రాష్ట్ర వాటా కింద రూ.7500 ఇస్తే.. కూటమి ప్రభుత్వం రూ.14 వేలు ఇస్తోంది. మూడు విడతల్లో ఈ పథకాన్ని పీఎం కిసాన్‌ తో జోడించి ఇస్తున్నాం. ఇప్పటి వరకు 46.86 లక్షల మంది రైతులకు 3,174 కోట్లను అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ పథకం ద్వారా అందచేశాం. ఇదే కాకుండా.. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, స్పెషల్‌ ప్యాకేజీలు ఇస్తున్నాం. 1.34 లక్షల మంది రైతులకు డ్రిప్‌ ఇరిగేషన్‌ను సబ్సిడీపై అందిస్తున్నాం’’ అని అన్నారు.


స్త్రీ శక్తి పథకం

‘‘స్త్రీశక్తి పథకం ద్వారా ఇప్పటి వరకు మహిళలు 8.86 కోట్లసార్లు ఉచిత ప్రయాణాలు చేశారు. స్త్రీశక్తి వల్ల ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగింది. ఉచిత బస్సు స్కీమ్‌కు ఏడాదికి 2,963కోట్లు ప్రభుత్వం భరిస్తోంది. ఇది నాకు చాలా సంతృప్తినిచ్చిన పథకం. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఈ పథకాన్ని సమర్థంతంగా అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 97 శాతం మందికి స్త్రీశక్తి పథకం గురించి తెలుసు. 85 శాతం మంది స్త్రీ శక్తి పథకం అమలుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆడబిడ్డల ఆర్థిక ఎదుగుదలకు ఈ పథకం తోడ్పడింది’’ అని సీఎం సంతోషం వ్యక్తం చేశారు.

తల్లికి వందనం

‘‘తల్లికి వందనం పథకాన్ని సమర్థంతంగా అమలు చేశాం. ఈ పథకానికి రూ.10,090 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం అమలు చేశాం. ఇప్పటికీ తల్లికి వందనం ఎవరికైనా అందకుంటే వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 2,79,720 మందికి రూ.363.64 కోట్లు అందజేస్తున్నాం. మొత్తంగా తల్లికి వందనం పథకంలో 66,57,508 మంది విద్యార్థులు లబ్ధిదారులుగా ఉన్నారు’’ అని తెలిపారు.

దీపం 2.0 పథకం

‘‘దీపం 2.0 పథకం అమలు చేశాం. తల్లి వంటింట్లో పడే కష్టాలను చూసి.. మరే మహిళ ఆ కష్టాలు పడకూడదని ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం పెట్టాం. ఇప్పుడు దీపం 2.0 పథకం ద్వారా ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఇప్పటి వరకు 2.66 కోట్ల ఉచిత సిలిండర్లను మహిళలకు అందచేశాం. ఇందుకోసం రూ.1718 కోట్లను ప్రభుత్వం భరిస్తోంది’’ అని చంద్రబాబు వివరించారు.

Updated Date - Sep 28 , 2025 | 04:05 AM