Share News

CM Chandrababu Naidu: దివ్యాంగులు ప్రతిభావంతులు

ABN , Publish Date - Dec 04 , 2025 | 04:18 AM

దివ్యాంగులు బలహీనులు కాదని, అత్యంత ప్రతిభావంతులని.. కొంచెం మద్దతిస్తే అద్భుతాలను సృష్టించే సత్తా వారి సొంతమని సీఎం చంద్రబాబు అన్నారు.

CM Chandrababu Naidu: దివ్యాంగులు ప్రతిభావంతులు

  • వారికి ఉచిత బస్సు ప్రయాణం

  • ‘స్థానికం’లో ఎక్స్‌-అఫిషియో పదవులు: సీఎం

  • అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవంలో ఏడు వరాలు ప్రకటన

విజయవాడ సిటీ, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): దివ్యాంగులు బలహీనులు కాదని, అత్యంత ప్రతిభావంతులని.. కొంచెం మద్దతిస్తే అద్భుతాలను సృష్టించే సత్తా వారి సొంతమని సీఎం చంద్రబాబు అన్నారు. అందరితోపాటు వారికి సమాన అవకాశాలు, హక్కులు, గౌరవం కల్పించేందుకు అనుకూలమైన సమాజాన్ని నిర్మించాలనే రాష్ట్రంలోని దివ్యాంగులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వారి జీవితాల్లో ఇంద్రధనుస్సు వెలుగులు నింపేందుకు ఏడు వరాలు ప్రకటించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం జరిగిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, రాజకీయాల్లో రాణించడానికి స్థానిక సంస్థల్లో ఎక్స్‌-అఫిషియో సభ్యులుగా నియామకం, రూ.19 కోట్లతో దివ్యాంగుల ఆర్థిక సబ్సిడీ పునరుద్ధరణ, వారిలో క్రీడా నైపుణ్యాలను గుర్తించేందుకు ప్రత్యేక టాలెంట్‌ డెవల్‌పమెంట్‌ స్కీం, టిడ్కో ఇళ్లలో గ్రౌండ్‌ఫ్లోర్‌ ఫ్లాట్ల కేటాయింపు, బధిరులకు ప్రత్యేక కళాశాల, విద్యార్థులు ఎక్కడుంటే అక్కడే పింఛన్‌ పంపిణీ, అమరావతిలో విభిన్న ప్రతిభావంతులకు భవన నిర్మాణం.. మొత్తం 7 వాగ్దానాలు చేశారు. దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధి ఎన్టీఆర్‌తో మొదలైందని గుర్తుచేశారు. తాను మొదటిసారి సీఎం అయ్యాక పింఛన్‌ రూ.200 చేశానని.. ప్రస్తుతం రూ.6 వేలకు పెంచానని చెప్పారు. బ్యాక్‌ల్యాగ్‌ పోస్టులకు ప్రత్యేక నియామక గడువును పొడిగిస్తామన్నారు.


అంధ క్రికెటర్లకు భారీ నజరానాలు

ఇటీవల ప్రపంచ అంధుల క్రికెట్‌ టోర్నీలో దేశానికి పతకం అందించిన రాష్ట్ర క్రీడాకారులు పి.కరుణకుమారి, దీపిక (కర్ణాటక తరఫున ప్రాతినిధ్యం), గతంలో రెండుసార్లు ప్రపంచ కప్‌ తీసుకొచ్చిన అర్జున అవార్డీ అజయ్‌కుమార్‌రెడ్డికి ప్రభుత్వ ప్రోత్సాహకాలను సీఎం అందజేశారు. అల్లూరి జిల్లాకు చెందిన కరుణకుమారికి ప్రభుత్వం తరఫున రూ.15 లక్షలు, ఇల్లు.. దీపికకు రూ.10 లక్షలు, ఇల్లు ఇస్తామని, అజయ్‌కుమార్‌రెడ్డికి రూ.2.50 లక్షలు ఇస్తామని ప్రకటించారు. కరుణకుమారికి ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ మంజూరు చేసిన రూ.5 లక్షలు, మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సమకూర్చిన రూ.5 లక్షలు, బ్లైండ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ మంజూరు చేసిన రూ.లక్ష చెక్కులను అందజేశారు. ఇండియన్‌ బ్లైండ్‌ క్రికెట్‌ టీంకు ఏసీఏ మంజూరు చేసిన రూ.10 లక్షలను కెప్టెన్‌ దీపికకు అందించారు. విశాఖలో 23 ఎకరాల్లో నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిజబిలిటీ స్పోర్ట్స్‌ స్టేడియాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.


దివ్యాంగుల జీవితాలు ఎందరికో స్ఫూర్తి: పవన్‌

అమరావతి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తున్న దివ్యాంగుల జీవితాలు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆయన బుధవారం సాయంత్రం మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులు గోగన ఆదిశేషు, శెట్టివారి రఘులతో ముచ్చటించారు. మార్కాపురానికి చెందిన రఘు, బాపట్లకు చెందిన ఆదిశేషుల జీవన, కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారిద్దరికీ జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పింఛను మొత్తాన్ని పెంచడం వల్ల తమ జీవనానికి ఒక వెసులుబాటు దొరికిందన్నారు. సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Untitled-1 copy.jpg

Updated Date - Dec 04 , 2025 | 04:21 AM