CM Chandrababu: ఇదేనా పద్ధతి
ABN , Publish Date - Sep 27 , 2025 | 03:51 AM
శాసనసభలో ప్రతిపక్షం లేని మాట నిజం! అధికార పార్టీ సభ్యులే ప్రతిపక్షపాత్ర పోషిస్తూ... ప్రజా సమస్యలను లేవనెత్తుతుండటమూ నిజం! కానీ... కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు మరింత ‘స్వేచ్ఛ’ తీసుకుని మంత్రులపై..
సభలో పలువురు ఎమ్మెల్యేల తీరుపై సీఎం ఆగ్రహం
వ్యక్తిగత అజెండా, మంత్రులు లక్ష్యంగా వ్యాఖ్యలా?
బొజ్జల సుధీర్ రెడ్డి ‘లెటర్‌ప్యాడ్’ వ్యాఖ్యలపై క్లాస్
పితాని, బూర్ల ఆంజనేయులుపైనా అసహనం
పీసీబీ చైర్మన్ లక్ష్యంగా బొండా ఉమా ఆరోపణలపై ఆగ్రహం
కామినేని, బాలకృష్ణ సంవాదం జరగాల్సింది కాదనే అభిప్రాయం
మంత్రి పయ్యావుల, చీఫ్ విప్, విప్‌లు చూసుకోవాలి కదా అని ప్రశ్న
చాంబర్‌లో మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలతో సీఎం భేటీ
కొంత మంది ఎమ్మెల్యేలు పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు. వ్యక్తిగత అజెండాలు పెట్టుకుని మాట్లాడటం సరైన పద్ధతి కాదు. అసెంబ్లీని పైరవీలకు వేదికగా చేసుకోవడం సరైన విధానం కాదు!
అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఏం మాట్లాడాలనే విషయాన్ని విప్‌లు, మంత్రులు చూసుకోవాలి కదా!
అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తే మనకూ, వైసీపీకీ మధ్య తేడా ఏమిటి?
-సీనియర్ నేతలతో
ముఖ్యమంత్రి చంద్రబాబు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
శాసనసభలో ‘ప్రతిపక్షం’ లేని మాట నిజం! అధికార పార్టీ సభ్యులే ప్రతిపక్షపాత్ర పోషిస్తూ... ప్రజా సమస్యలను లేవనెత్తుతుండటమూ నిజం! కానీ... కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు మరింత ‘స్వేచ్ఛ’ తీసుకుని మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలతో విమర్శలకు దిగడం, సొంత అజెండాలతో ప్రశ్నలు సంధించడంపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. పలువురు ఎమ్మెల్యేల పేర్లను ప్రస్తావిస్తూ ఇటీవలి కాలంలో ఎన్నడూలేనట్లుగా ఆయన తీవ్ర స్వరంతో మండిపడ్డారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో శాసనసభా వ్యవహారాల మంత్రిగా చూసుకోవాలి కదా అని పయ్యావుల కేశవ్‌నూ ప్రశ్నించినట్లు తెలిసింది. చీఫ్ విప్, విప్‌లూ దీనికి బాధ్యులే అని స్పష్టం చేసినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం... శుక్రవారం మధ్యాహ్నం అసెంబ్లీకి వచ్చిన వెంటనే తన చాంబర్‌లో కొందరు పార్టీ సీనియర్ నేతలు, సీనియర్ మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యారు.
గురువారం నాటి పరిణామాలపై వారితో చర్చించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గురువారం సభలో మాట్లాడుతూ.. ‘ఓ ఉద్యోగి బదిలీ విషయంలో చంద్రబాబుకు, లోకేశ్‌కు, హోం మంత్రికి లేఖలు ఇచ్చీ ఇచ్చీ తన లెటర్‌ప్యాడ్ అయిపోయింది కానీ ఇంత వరకు బదిలీ జరగలేదు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై సీఎం తీవ్రంగా స్పందించారు. ఇది తీవ్ర ఆక్షేపణీయమన్నారు. ఆ తర్వాత లాబీల్లో తనకు కనిపించిన సుధీర్ రెడ్డిని అక్కడే మందలించారు. ఇక... రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు వైఖరి కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. అన్నీ తెలిసిన ఆయన... సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిని తన్నాలన్నట్లుగా వ్యాఖ్యలు చేయడం ఏమిటని సీఎం సీరియస్ అయ్యారు. నిజానికి... బూర వ్యాఖ్యలపై సభలోనే మంత్రి అనిత స్పందించారు. ‘మీరు సీనియర్ అధికారిగా వ్యవహరించారు. చట్టాల గురించి తెలుసుకదా’ అని వ్యాఖ్యానించారు. ఇక... గురువారం సీఎం సభలో ఉన్న సమయంలోనే ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సోషల్ మీడియా పోస్టుల విషయంలో హోంశాఖ తీరు సరిగా లేదంటూ తప్పు పట్టారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన సీఎం... సీనియర్లు కూడా ఇలా మంత్రులను లక్ష్యంగా చేసుకుని మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. గురువారం సభలో తన సమక్షంలోనే జరిగిన కైకలూరు, హిందూపురం ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, నందమూరి బాలకృష్ణ సంవాదంపై కూడా చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది జరిగి ఉండాల్సిన పరిణామం కాదని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల రెండో రోజున ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సభలో పీసీబీ చైర్మన్ మీద ఆరోపణలు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేరునూ ప్రస్తావించారు. దీనిపైనా చంద్రబాబు స్పందించారు. మొత్తంగా ఇలాంటి పరిణామాలు దురదృష్టకరమని, వ్యక్తులను, మంత్రులను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం సరికాదని అన్నట్లు తెలిసింది.
తేడా ఉండాలి కదా...
మనం అధికారంలో ఉండీ.. మనపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే సిగ్గుపడాల్సి వస్తోందని పలువురు ఎమ్మెల్యేలు సభలో చేసిన వ్యాఖ్యలపైనా చంద్రబాబు స్పందించారు. అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తే మనకూ వైసీపీకీ మధ్య తేడా ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి కొన్ని పరిమితులు ఉంటాయని... చట్టం, న్యాయం, నిబంధనలు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సభలో సీనియర్ ఎమ్మెల్యేలు కొందరు సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతున్నారని... అలాంటి చర్చలను ఆహ్వానించాల్సిందేనని, మిగిలిన ఎమ్మెల్యేలు వారిని చూసి సభలో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో బుచ్చయ్య చౌదరి సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతున్నారని, ఎక్కడా వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడంలేదని తెలిపారు. సభ్యుల తీరుపై చర్చించేందుకు శనివారం మధ్యాహ్నం టీడీఎల్పీ సమావేశం పెట్టాలని ఓ దశలో భావించారు. దీనిపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదు.