CM Chandrababu: రాయలసీమకు రేమండ్
ABN , Publish Date - Nov 16 , 2025 | 05:07 AM
రాయలసీమలో రూ. 1,201 కోట్ల పెట్టుబడులతో అపారెల్, ఆటో, ఏరోస్పేస్ రంగాల్లో మూడు ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నట్లు రేమండ్ గ్రూపు శనివారం ప్రకటించింది.
రూ.1,201 కోట్లతో మూడు ప్రాజెక్టులు
అపారెల్, ఆటో, ఏరోస్పేస్ రంగాల్లో పెట్టుబడులు
పరిశ్రమలకు వర్చువల్‌గా శంకుస్థాపన
2027 నాటికి పూర్తిచేయాలన్న సీఎం చంద్రబాబు
విశాఖపట్నం, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): రాయలసీమలో రూ. 1,201 కోట్ల పెట్టుబడులతో అపారెల్, ఆటో, ఏరోస్పేస్ రంగాల్లో మూడు ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నట్లు రేమండ్ గ్రూపు శనివారం ప్రకటించింది. వీటికి సంబంధించిన పనులకు శనివారం సీఐఐ సదస్సు వేదికపై నుంచి మంత్రి టీజీ భరత్‌తో కలసి సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాయలసీమకు అనేక రంగాల్లో భారీ ప్రాజెక్టులు తీసుకువస్తున్నామని చెప్పారు. కియా మోటార్స్ ఉందని, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీలు నెలకొల్పుతున్నామన్నారు. విమానాల తయారీకి చాలా డిమాండ్ ఉందని, ఆ రంగంలో రేమండ్ పెట్టుబడులు పెట్టడం అభినందనీయమని చెప్పారు. శంకుస్థాపన చేసిన ఈ పరిశ్రమలను 2027 డిసెంబరుకల్లా పూర్తి చేయాలన్నారు. రేమండ్ గ్రూపు ఇంజనీరింగ్ బిజినెస్ ఎండీ గౌతమ్ మియానీ మాట్లాడుతూ, రాప్తాడులో రూ. 497 కోట్లతో అపారెల్ మాన్యుఫ్యాక్చరింగ్ పార్క్, అనంతపురం జిల్లా గుడిపల్లిలో రూ. 441 కోట్లతో ఆటో కాంపోనెంట్ తయారీ కర్మాగారం, అదే జిల్లాలో టేకులోడు వద్ద రూ. 262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా మొత్తం 6,500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు.
క్రూయిజ్‌ను రెగ్యులర్‌గా నడపండి
కార్డెలియాకు సీఎం చంద్రబాబు సూచన
విశాఖలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఉందని, ఏడాదికి రెండుసార్లు చెన్నై నుంచి ఇక్కడికి వస్తున్న కార్డెలియా సంస్థకు చెందిన క్రూయిజ్ షిప్‌ను రెగ్యులర్‌గా నడపాలని సీఎం చంద్రబాబు సంస్థ ప్రతినిధులను కోరారు. సీఐఐ సదస్సుకు వచ్చిన వారితో సీఎం చర్చించారు. విశాఖపట్నం-కాకినాడ-భీమునిపట్నం మీదుగా క్రూయిజ్ టూరిజం ప్రారంభించాలని కోరారు. ఈ చర్చల్లో మంత్రి కందుల దుర్గేశ్, ఏపీటీడీసీ ఎండీ, సీఈఓ ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు.
బయో ఫెర్టిలైజర్ యూనిట్లు పెట్టండి
ఇఫ్కో చైర్మన్ దిలీప్ సంఘానీని కోరిన సీఎం
రాష్ట్రంలో బయో ఫెర్టిలైజర్, బయో స్టిమ్యులెంట్ యూనిట్లు ఏర్పాటుచేయాలని ఇఫ్కో సంస్థ చైర్మన్ దిలీప్ ననూభాయ్ సంఘానీని సీఎం చంద్రబాబు కోరారు. భాగస్వామ్య సదస్సు రెండో రోజు శనివారం ఇఫ్కో చైర్మన్‌తో భేటీ అయ్యి, పలు అంశాలపై చర్చించారు. గ్రీన్ అమ్మోనియా, హైడ్రోజన్ ఆధారిత ఫెర్టిలైజర్ ప్లాంట్ల ఏర్పాటు, రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ముందుకురావాలని సీఎం కోరారు. ఇఫ్కోతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రబాబు వెల్లడించారు.
3 ప్రాజెక్టులు.. మూడేళ్లలో పూర్తి
సీఎంతో అట్మాస్పియర్ కోర్ దక్షిణాసియా ఎండీ భేటీ
ప్రముఖ గ్లోబల్ హాస్పిటాలిటీ గ్రూపు అట్మాస్పియర్ కోర్ గ్రూపు ఎండీ సలీల్ పాణిగ్రాహి, దక్షిణాసియా ఎండీ సౌవగ్య మహాపాత్రతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. తిరుపతి, విశాఖపట్నం, అమరావతిలో అట్మాస్పియర్ కోర్ చేపట్టిన ప్రాజెక్టుల పురోగతి గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ మూడు ప్రాజెక్టులు వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. గండికోటలో అడ్వంచర్ రిసార్ట్స్, అరకు, అనంతగిరిలో హిల్ రిసార్ట్స్ ఏర్పాటుకు ఆలోచించాలని, బొబ్బిలి, విజయనగరం కోటలను పర్యాటకంగా ఎలా అభివృద్ధి చేయొచ్చనే చెప్పాలని సీఎం వారిని కోరారు. రుషికొండలో వరల్డ్ క్లాస్ రిసార్ట్స్ నిర్మించేందుకు అట్మాస్పియర్ కోర్ ప్రతినిధులు ఆసక్తి వ్యక్తంచేశారు.