అటెన్షన్: చంద్రబాబు!
ABN , Publish Date - Aug 10 , 2025 | 03:12 AM
మీ ఊళ్లో మీకు 500 గజాల స్థలం ఉంది! అత్యవసరంగా డబ్బు అవసరమొచ్చింది! ఉన్న స్థలంలో సగం విక్రయించగా వచ్చిన సొమ్ముతో కష్టం తీరింది! మరో 250 గజాల స్థలం మిగిలే ఉంది!
నిబంధనల చట్రంలో ‘రాజధాని ప్లాట్లు’
విభజించుకోలేక, విక్రయించలేక రైతుల పాట్లు
వెయ్యి, రెండు వేల గజాల ప్లాట్లను కొనేవారెవరు?
నాడు అవగాహన లేక పెద్ద ప్లాట్లు ఎంచుకున్న రైతులు
నేడు విభజనకు నిబంధనలు ఒప్పుకోవంటున్న అధికారులు
‘నగరం అందం’ పేరుతో అర్థంలేని ఆంక్షలు
సంక్లిష్టంగా మారిన ‘సింగపూర్ మాస్టర్ ప్లాన్’
సీఎం జోక్యం చేసుకోవాలని రైతుల విన్నపం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి.. ముఖ్య గమనిక!
అధికారం మారినా...అమరావతి మళ్లీ పట్టాలపైకి ఎక్కినా రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఎందుకు ఊపందుకోవడంలేదో గమనించండి!అభివృద్ధికి ఆటంకంగా మారిన ‘నిబంధనల చట్రాన్ని’ సడలించండి! ‘సింగపూర్’ మాస్టర్ ప్లాన్‌ను స్థానిక అవసరాలకు అనుగుణంగా సవరించండి!అధికారులు ఆంక్షల కొరడాను పక్కనపెట్టి...మనసుపెట్టి ఆలోచించాలని ఆదేశించండి.ఇంతటి ఆందోళనకు కారణమవుతున్న ఆ సమస్య ఇదే!
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
మీ ఊళ్లో మీకు 500 గజాల స్థలం ఉంది! అత్యవసరంగా డబ్బు అవసరమొచ్చింది! ఉన్న స్థలంలో సగం విక్రయించగా వచ్చిన సొమ్ముతో కష్టం తీరింది! మరో 250 గజాల స్థలం మిగిలే ఉంది! ఇక సమస్యేమీ లేదు! ఇది... ఎక్కడైనా, జరిగేదే! ఎవరైనా అనుసరించే అత్యవసర ప్రణాళికే! కానీ...అమరావతిలో ఇది కుదరదు! రాజధానికోసం భూములిచ్చిన రైతులకు ఇలాంటి అవకాశమే లేదు! ఇచ్చిన భూమికి బదులుగా ప్రభుత్వం నుంచి తీసుకున్న రిటర్నబుల్ ప్లాటును ముక్కలుగా విడదీసేందుకు వీల్లేకుండా నిబంధనల చట్రంలో బంధించారు. అమ్మితే... మొత్తం ప్లాటు విక్రయించాలి. లేదంటే... లేదు. చివరికి... వారసులకూ పంపకాలు చేసేందుకు వీల్లేకుండా ఇరికించేశారు.
ఇదీ జరిగింది... రాజధాని అమరావతి కోసం రైతులు చేసిన త్యాగం అసమాన్యమైనది. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా... తమ భూములు అప్పగించారు. ‘‘ఇక్కడ రాజధాని వస్తుంది. మీరు ఇచ్చిన భూములకు ప్రతిగా అభివృద్ధి చేసిన రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తాం. వాటిని విక్రయించుకుంటే చాలా డబ్బులొస్తాయ్’’... అని అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం చెప్పిన మాటలను నమ్మి భూములు అప్పగించారు. సగటున ఎకరం ఇచ్చిన రైతుకు రిటర్నబుల్ ప్లాటుగా 1000 గజాల భూమిని నివాసం కోసం కేటాయించారు. మరో 200-300 గజాల వరకు ‘కమర్షియల్’ ప్లాటు ఇచ్చారు. రెసిడెన్షియల్ కింద 250 గజాలు, 500 గజాలు, 700 గజాలు, 1000 గజాలు...ఇంకా ఆపైన విసీర్ణమున్న ప్లాట్లను ఎంచుకునే అవకాశం కల్పించారు. తాము ఇచ్చిన భూమికి బదులుగా ఇస్తున్న విస్తీర్ణానికి తగినట్లుగా ఆయా ప్లాట్లను రైతులు ఎంచుకోవచ్చు. ఉదాహరణకు... ఒక రైతుకు వెయ్యిగజాల రిటర్నబుల్ ప్లాటు వస్తే... 250 గజాల ప్లాట్లు రెండు, 500 గజాల్లో ఒకటీ ఎంచుకోవచ్చు. లేదా... నాలుగు 250 గజాల ప్లాట్లు తీసుకోవచ్చు. రాజధాని వస్తోందన్న ఆనందంలో ఉన్న చాలామంది రైతులకు ఈ ఆప్షన్లు అర్ధం కాలేదు. ‘సింగిల్ బిట్... పెద్దగా ఉంటే సూపర్ కదా’ అని భావించి... వెయ్యి గజాలు, రెండువేల గజాల ప్లాట్లకు ఆప్షన్ పెట్టుకున్నారు.రాజధాని పనులయ్యాక సొంతానికి కొంత ఉంచుకొని, మిగతాది విభజించి (స్పి ్లట్) అమ్ముకోవచ్చని భావించారు. ప్లాట్లు తీసుకుంటూ అధికారులు ఇచ్చిన భారీ పుస్తకాల్లాంటి డాక్యుమెంట్లలో సంతకాలు పెట్టేశారు. ఆ రోజున్న పరిస్థితి అలాంటిది!
అదేం కుదరదు...
ఇటీవల తుళ్లూరుకు చెందిన నారాయణ స్వామి అనే రైతు సీఆర్‌డీఏ ఆఫీసుకు వెళ్లారు. తనకిచ్చిన 1000 గజాల ప్లాటును, మరో 700 గజాల ప్లాటును విభజించాలని కోరారు. ‘‘అలా కుదరదండీ!ప్లాటును విభజించలేం. మీరు పెట్టిన ఆప్షన్ ప్రకారం ప్లాటు ఇచ్చాం. దానిని అలాగే ఉంచాలి’’ అని అధికారి స్పష్టం చేశారు.‘‘అదేంటీ... మా ప్లాటు... మా ఇష్టం కాదా!’’ అని ఆ రైతు అడగ్గా...అధికారి ఆయన చేతిలో ఓ పత్రం పెట్టి చదువుకోమన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ భూ సమీకరణ పథకము-రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు విధానం’ అనే ట్యాగ్‌తో ఉన్న ఆ పత్రంలో 9వ పేజీలోని 3వ అంశాన్ని ప్రకారం... ‘‘ఒకసారి కేటాయించిన ప్లాటును తర్వాత విభజించుకోవచ్చా? ఆ సందర్భంగా ఎటువంటి నిబంధనలు వర్తిసాయి? అన్న ప్రశ్నకు సమాధానంగా... రాజధాని నగర అందాన్ని, మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని 9.18 నమూనాలో కోరుకున్న తర్వాత ఆ ప్లాట్ల విభజన కు అంగీకరించబడదు’’ అని అందులో స్పష్టంగా ఉంది. దీంతో ఆ రైతు దిగ్ర్భాంతికి గురయ్యారు. అప్పటికే ఆ ఆఫీసు వద్ద ఇలాంటి సమస్యనెదుర్కొంటున్న రైతులు మరో పాతికమందిపైనే ఉన్నారు. అంతా కలిసి ఆ అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాజధానికి భూములు ఇచ్చిన రైతులుగా మేం ఎలాంటి కండీషన్లు పెట్టలేదు. మాకిచ్చిన భూములను ఎలా వాడుకోవాలో మీరు కండీషన్లు పెట్టడం ఏమిటి? ఇదెక్కడి న్యాయం?’’ అని నిలదీశారు. దీంతో అధికారి ఆఫీసులోపలికి వెళ్లి 2019కు ముందు ఆయా షరతులకు ఒప్పుకొనే ప్లాట్లు తీసుకున్నారంటూ...పత్రాలపై పెట్టిన సంతకాలు చూపించారు. ఇలాంటి షరతులు తమకు అప్పట్లో అర్థంకాలేదని, రాజధాని వస్తుందన్న సంతోషంలో అధికారులు కోరిన చోటల్లా సంతకాలు చేశామని, ఈ రూల్ తీసెయ్యాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఆచరణాత్మకమేనా...
రాయపూడికి చెందిన ఒక రైతుకు తాను ఇచ్చిన భూమికి బదులుగా 5వేల గజాల విస్తీర్ణంలో రిటర్నబుల్ ప్లాట్లు తీసుకునే అవకాశం వచ్చింది. అయితే...ఆయన కూడా అప్పట్లో ‘అమాయకంగా’ ఆలోచించి... సింగిల్ బిట్ పెద్దగా ఉంటే బాగుంటుందని 2500 గజాలున్న రెండు ప్లాట్లు ఎంచుకున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే... పీకల్లోతు అవసరాలున్నా ఆ ప్లాట్లను అమ్ముకోలేక పోతున్నారు. 2500 గజాల ప్లాటును ముక్కలు చేయడానికి వీల్లేదు.ఒక్కరికే అమ్మాలి. అంటే... దాని విలువ ఇప్పుడున్న ధర కనీసం రూ.10 కోట్లు! అంత పెద్ద స్థాయి ‘బయ్యర్’ఎక్కడ దొరకాలి? 500 గజాలు, ఆ పైన విస్తీర్ణమున్న రిటర్నబుల్ ప్లాట్లు ఎంచుకున్న అనేక మంది రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఇది! పేరుకే ఆ ప్లాట్లకు విలువ! కానీ...కొనేవారు దొరకడంలేదు. విభజించి విక్రయిద్దామంటే...‘నిబంధనలు’ ఒప్పుకోవడంలేదు.
వారసులకూ పంచలేరు
రిటర్నబుల్ ప్లాట్లలో కొంత విభజించి... విక్రయించి ఆర్థిక అవసరాలు తీర్చుకోవాలని చాలామంది రైతులు భావిస్తున్నారు. మరికొందరు... తమ వారసులకు పంపకాలు చేయాలనుకుంటున్నారు. కానీ... ‘ఆంధ్రప్రదేశ్ భూ సమీకరణ పథకము-రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు విధానం’ అందుకు వీల్లేకుండా చేస్తోంది.అవసరాలకు ఆదుకోని ఆస్తి ఎందుకన్నట్లుగా పరిస్థితి తయారైంది.అమరావతి పరిధిలో ఇప్పుడున్న ధరల ప్రకారం...వెయ్యి, రెండువేల గజాలు కొని ఇల్లు కట్టుకోవాలంటే అంబానీ, అదానీలాంటి బడా బాబులకే సాధ్యం. ఇది అయ్యేపనేనా?
అప్పుడు లేని చర్చ
రాజధానికి రైతులు భూములు ఇచ్చేటప్పుడు అందం,సింగపూర్‌స్థాయి అనే చర్చ రాలేదు.ఆ పేరిట భూ సేకరణ చేయలేదు. రైతుల శ్రేయస్సు,సంక్షేమం కోరే రాజధాని నిర్మాణం అని నాటి ప్రభుత్వ పెద్దలు,అధికారులు ప్రచారం చేశారు. అయినా కూడా తొలుత రైతులంతా ఒప్పుకోలేదు.దీంతో నాటి ముఖ్యమంత్రి చంద్ర బాబు రంగంలోకి దిగి రైతులతో సంప్రదింపులు జరిపారు. రైతులు కోరుకున్న చోటే రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని,వారి సంతృప్తే తమకు కీలకం అని ప్రభుత్వ పెద్దలు ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. అదే సమయంలో అధికారులు...‘రాజధాని అందం’ పేరుతో ప్లాట్ల విభజనకు అడ్డుకట్ట వేశారు.
బాబు పరిష్కరించాలి
అమరావతి రాజధాని నగరం రైతుల త్యాగాల పునాదులపై నిర్మితమవుతోంది.అదే రైతులను కష్టపెట్టి, వారి సమస్యలను పెంచి కేవలం అందమైన ప్లాన్ అంటూ పరుగులు తీస్తే సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని...ప్లాట్ల విభజనకు అవకాశం ఇచ్చేలా చట్టాలు, నిబంధనలను మార్చాలని రైతులు కోరుతున్నారు.
సింగపూర్ సరే...
రాజధాని మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా రూపొందించి ఇచ్చింది. ‘రాజధాని ప్రాంతం అందంగా, ప్రణాళికాబద్ధంగా ఉండాలి’ అనేదే సింగపూర్ ప్రభుత్వ కాన్సెప్ట్! ఈ నేపథ్యంలోనే అధికారులు రిటర్నబుల్ ప్లాట్ల విభజనకు వీల్లేకుండా నిబంధనలు విధించారు.ఇప్పుడు అదే పెద్ద సమస్యలాగా మారింది. సింగపూర్ ప్రమాణాలు, పరిస్థితులు వేరు. మన పరిస్థితులు వేరు.ప్రభుత్వ భవనాలు,ఆఫీసులను అందంగా నిర్మించుకోవచ్చు.కానీ... రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ల విభజనపై ఆంక్షలు విధించడమేమిటి? అందులో హేతుబద్ధత ఎక్కడుంది? మరీ అగ్గిపెట్టెల్లాంటి నివాసాలు ఉండకూడదంటే అర్థముంది.అందుకోసం...ఒక ప్లాటు కనీసం 250 గజాలకు తగ్గొద్దనీ చెప్పొచ్చు. కానీ... వెయ్యి, రెండువేలు, రెండున్నరవేల గజాలు...ఇలా మొదట్లో ఆప్షన్ పెట్టి తీసుకున్న ప్లాటు విభజన కుదరదనడమే అసలు సమస్య!

అన్యాయం చేయొద్దు!
రాజధాని కోసం భూములను త్యాగం చేసిన మమ్మల్ని కష్టపెట్టి అందమైన నగరం ఎలా నిర్మిస్తారు? రైతులను నమ్ముకుంటే నష్టపోయిన వారెవ్వరూ లేరు. ఇక్కడ రైతులే నష్టపోతూ రాజధానికి ప్రాణం పోశారు. ఇలాంటి చోట రైతుల డిమాండ్‌ను పట్టించుకోకుండా అడ్డుగోడల్లా రూల్స్ పెడితే ఎలా? ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి. పెద్ద ప్లాట్ల పునర్విభజన, అమ్మకాలకు వీలు కల్పించాలి. అధికారుల నివేదికలనే పరిగణనలోకి తీసుకుంటే రైతులు అన్యాయమైపోతారు!
- వెంకటేశ్వర్లు, తుళ్లూరు