AP CM Chandrababu: ఆర్థిక కారిడార్ అమరావతి
ABN , Publish Date - Dec 03 , 2025 | 06:22 AM
రాజధాని అమరావతి ఎకనామిక్ కారిడార్‌గా అవతరించబోతోంది. ఇటీవల సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
త్వరలోనే విజన్ ప్లాన్స్ రూపకల్పన
కార్యక్రమాల పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్
ఇప్పటికే జాతీయ బ్యాంకులు, బీమా కంపెనీలు
(గుంటూరు- ఆంధ్రజ్యోతి)
రాజధాని అమరావతి ఎకనామిక్ కారిడార్‌గా అవతరించబోతోంది. ఇటీవల సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అమరావతి ఎకనామిక్ జోన్‌లో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కృష్ణా, ఎన్‌టీఆర్, ఏలూరు, త్వరలో ఏర్పడబోయే మార్కాపురం జిల్లాలుంటాయి. ఈ నేపథ్యంలో అమరావతి ఎకనామిక్ కారిడార్‌కు త్వరలోనే రూపకల్పన జరగనుంది. విజన్ ప్రణాళికలు రూపకల్పన జరిగి కార్యరూపం దాల్చితే అమరావతి ఎకనామిక్ కారిడార్ రాష్ట్రానికే తలమానికంగా మారుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా అమరావతి ఎకనామిక్ కారిడార్ కార్యకలాపాల పర్యవేక్షణకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించనుంది. ఈ కారిడార్ రాష్ట్రానికి కేంద్ర బిందువుగా ఉండనున్న దృష్ట్యా ప్రధానంగా ఫైనాన్స్, డీప్ టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ డెవల్‌పమెంట్ (ఆర్ అండ్ డీ) సంస్థలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. రాజధానిలో ఇప్పటికే క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. మరోవైపు అమరావతిలో ఆర్థిక నగరాన్ని నిర్మించేందుకు ఇటీవలే అంకురార్పణ జరిగింది.
దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజున 15 జాతీయ బ్యాంకులు, బీమా కంపెనీలు రీజినల్ కార్యాలయాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశాయి. మరికొన్ని బ్యాంకులు, కంపెనీలు కూడా త్వరలోనే వాటి కార్యాలయాల నిర్మాణాలను ప్రారంభించనున్నాయి. ఈ నేపథ్యంలో ఫైనాన్స్ సంస్థలు ఎక్కువగా అమరావతిలో దృష్టి సారించేలా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళగిరికి సమీపంలో ఎన్‌హెచ్-16 పక్కన ఇప్పటికే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ని ప్రారంభించారు. అక్కడ రీసెర్చ్ అండ్ డెవల్‌పమెంట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. గతవారంలో ఎంఎ్‌సఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఇక్కడకు వచ్చి ఔత్సాహికులతో సమావేశం నిర్వహించారు. అమరావతి ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా డీప్ టెక్నాలజీ స్టార్ట్‌పలను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ స్టార్ట్‌పలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, క్లీన్‌ఎనర్జీ వంటి రంగాల్లో తలెత్తే సంక్షిష్ట, ప్రాథమిక సమస్యల పరిష్కారానికి ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తున్నారు.