CM Chandrababu: ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉందాం
ABN , Publish Date - Oct 28 , 2025 | 04:31 AM
మొంథా తుఫాన్‌పై ఆందోళన వద్దని, అప్రమత్తంగా ఉందామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం రాత్రి 10గంటలకు రాష్ట్ర సచివాలయంలోని...
తుఫాన్‌పై ఎన్ని రివ్యూలు చేశారనేది కాదు..
క్షేత్రస్థాయిలో ప్రభావం ఎంతనేదే ముఖ్యం
రియల్ టైంలో ప్రజలకు సమాచారం అందాలి
ప్రతి గంటకూ తుఫాన్‌పై బులెటిన్లు: సీఎం
అమరావతి, అక్టోబరు27(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌పై ఆందోళన వద్దని, అప్రమత్తంగా ఉందామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం రాత్రి 10గంటలకు రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్‌లో తుఫాన్ ప్రభావంపై వాతావరణ శాఖ అధికారులతో ఆయన సమీక్ష చేశారు. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంపై మంగళవారం నుంచి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలపగా.. దీనిపై రియల్‌టైమ్‌లో ప్రజలకు సమాచారం అందించాలని సీఎం ఆదేశించారు. ‘‘ప్రభుత్వ సన్నాహాలు, సేవలపై ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని, ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటూ పని చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తుఫాన్ సన్నద్ధతపై ఐవీఆర్‌ఎస్ విధానంలో సేకరించిన సమాచారంపైనా సీఎం సమీక్ష చేశారు. అంతకుముందు... ఇదే అంశంపై ఆయన అధికారులను అప్రమత్తం చేశారు. మంగళవారం ఉదయం నుంచి ప్రతి గంటకూ తుఫాన్ బులిటెన్లు విడుదల చేయాలని ఆదేశించారు. తుఫాన్ రక్షణ చర్యల విధుల్లో అలసత్వం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగేందుకు అవకాశం ఉంటుందని, ఆ సమయంలో ప్రజలెవ్వరూ బయటకు రాకుండా అలర్ట్ చేయాలని చంద్రబాబు కోరారు. ఎప్పటికప్పుడు సంక్షిప్త సందేశాలు పంపి, అవగాహన పెంచాలని, తిత్లీ, హరికేన్, హుద్‌హుద్ తుఫాన్ల అనుభవాన్ని వినియోగించాలని సీఎం సూచించారు. ‘రియల్ టైమ్‌లో నీటి ప్రవాహాలను పర్యవేక్షించాలి. వరద నీరు వెళ్లేందుకు వీలుగా డ్రెయిన్లలో బ్లాక్స్ లేకుండా పటిష్ఠం చేయాలి. చెరువులు, కాలువ గట్లు తెగిపోకుండా చూసుకోవాలి. సమాచార వ్యవస్థకు అంతరాయం కలగకుండా, శాటిలైట్ ఫోన్లు వినియోగించాలి. ప్రత్యేకంగా మొబైల్ టవర్లు ఏర్పాటు చేయాలి. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే 2,707 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. 110 మండలాల్లోని సచివాలయాల్లో 3,211 జనరేటర్లను బ్యాకప్ కోసం వినియోగించాలి. తుఫాన్ వల్ల ఎవ్వరూ ప్రమాదాల బారిన పడకూడదు.
ఒక్క మరణం కూడా సంభవించకూడదు. సముద్ర తీరంలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి’’ అని అధికారులకు చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళవారం కృష్ణా జిల్లాలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని తెలిపారు. ఎక్కువ వర్షపాతం కురిసే ప్రాంతాలను గుర్తించి, జిల్లా అధికారులు ముందస్తు రక్షణ చర్యలు తీసుకునేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ దళాలతో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. సమీక్షలో మంత్రి లోకేష్, సీఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తుఫాన్ బాధిత కుటుంబానికి 25 కేజీల బియ్యం
సీఎం ఆదేశాలు
‘మొంథా తుఫాన్ కార్యాచరణ భవిష్యత్‌లో వచ్చే తుఫాన్లను ఎదుర్కొనేందుకు ఒక మోడల్ కావాలి’ అని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. మొంథా తుఫాన్‌పై కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘విజయవాడ, మంగళగిరి, విశాఖ వంటి ప్రాంతాల్లో కొండచరియలు జారి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పునరావాస కేంద్రాల్లో బాధితులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి. మెడికల్ క్యాంపులు నిర్వహించాలి. పునరావాస కేంద్రాలకు ప్రత్యేకంగా ఇన్‌చార్జి అధికారుల ను నియమించాలి. పునరావాస కేంద్రాల నుంచి తిరిగి వెళ్లేటప్పుడు ఒక్కో కుటుంబానికి 25కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి. వలంటరీగా వచ్చే వారిని సహాయ కార్యక్రమాలకు వినియోగించుకోవాలి’ అని సీఎం ఆదేశించారు.
చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్
మంత్రి లోకేశ్‌కు పీఎంవోతో సమన్వయ బాధ్యతలు
మొంథా ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రధాని నరేంద్రమోదీ తనకు ఫోన్ చేసి, అడిగి తెలుసుకున్నారని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రధానికి వివరించగా, కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మోదీ భరోసా ఇచ్చారని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా పీఎంవోతో సమన్వయం బాధ్యతను మంత్రి లోకేశ్‌కు సీఎం అప్పగించారు.
సన్నద్ధతపై 83శాతం సంతృప్తి : అధికారులు
అధికారులు ఎన్ని రివ్యూలు చేశారనేది కాదని, క్షేత్రస్థాయిలో ఎంత మేర ప్రభావం చూపిందనేది ముఖ్యమని, దీనికి ప్రజాభిప్రాయాన్ని ప్రాతిపాదకగా తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. తుఫాన్‌పై ప్రభుత్వ సన్నద్ధత ఎలా ఉందనే అంశంపై సేకరించిన ప్రజాభిప్రాయంలో 83ు సంతృప్తి వ్యక్తమైందని అధికారులు వివరించారు. తుఫాన్‌కు సంబంధించి జాగ్రత్తలపై మీమీ ప్రాంతాల్లో సమావేశాలు జరిగాయా అన్న ప్రశ్నకు 70శాతం మంది అవును.. అని సమాధానమిచ్చారని తెలిపారు. ముందు జాగ్రత్తలపై 74శాతం మంది సంతృప్తిగా ఉన్నారని అధికారులు వివరించారు. ప్రజలను అప్రమత్తం చేసే క్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టం ఏర్పాటు చేసినట్లు ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో తొలిసారిగా ఈ సిస్టంను ఏర్పాటు చేశామని, రాష్ట్ర స్థాయిలో ఉన్న సమాచారం ఆధారంగా ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి నేరుగా ఆయా ప్రాంతాలకు మైక్‌ల ద్వారా అప్రమత్తం చేసే అవకాశం ఉందని తెలిపారు.