Singapore visit: రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jul 25 , 2025 | 03:18 AM
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్‌లో పర్యటించనున్నారు. శనివారం నుంచి ఆరు రోజులపాటు సీఎం బృందం అక్కడే ఉండనుంది.
పెట్టుబడుల సాధనే లక్ష్యంగా 6 రోజులు పర్యటన
అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్‌లో పర్యటించనున్నారు. శనివారం నుంచి ఆరు రోజులపాటు సీఎం బృందం అక్కడే ఉండనుంది. తన పర్యటనలో భాగంగా దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ అవుతారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడుల ఆకర్షణకు మొదటగా దావోస్‌కు వెళ్లారు. రెండో విదేశీ పర్యటనగా సింగపూర్‌కు సీఎం వెళుతున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్‌తోపాటు రాష్ట్రానికి పెట్టుబడులను సాధించాలన్న లక్ష్యంతో ఈ పర్యటన సాగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను రాష్ట్రానికి ఆహ్వానించనున్నారు. మొదటి రోజు సింగపూర్‌సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం పాల్గొంటారు. పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి రావాలని వారిని ఆహ్వానించనున్నారు. నవంబరులో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించనున్నారు. పోర్టు ఆధారిత ప్రాజెక్టులు, సెమీ కండక్టర్లు, ఏఐ, డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన అవకాశాలపై చర్చించనున్నారు. సింగపూర్‌లో నిర్వహించే బిజినెస్ రోడ్‌షోకు హాజరవుతారు. ఆ దేశంలో వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను సీఎం సందర్శించనున్నారు. చంద్రబాబుతోపాటు సింగపూర్ వెళుతున్న బృందంలో మంత్రులు లోకేశ్, నారాయణ, టీజీ భరత్, ఐఏఎస్ అధికారులు కాటమనేని భాస్కర్, ఎన్. యువరాజ్, కె.కన్నబాబు, సాయికాంత్ వర్మ ఉన్నారు.