Share News

Excise Police Investigation: జోగి-జనార్దన్‌ మధ్య లిక్కర్ లింకే

ABN , Publish Date - Oct 15 , 2025 | 04:44 AM

కిలీ మద్యం కేసు సూత్రధారి అద్దేపల్లి జనార్దన్‌రావు, వైసీపీ నేత, మాజీమంత్రి జోగి రమేశ్‌ మధ్య సన్నిహిత సంబంధాలు వెలుగులోకి వచ్చాయి.

 Excise Police Investigation: జోగి-జనార్దన్‌ మధ్య లిక్కర్ లింకే

  • మద్యమే కలిపింది ఇద్దరినీ

  • అద్దేపల్లిది కిరాణా వ్యాపారం

  • జోగిది కల్లు, సారా బిజినెస్‌

  • రమేశ్‌ మద్యం వ్యాపారానికి అద్దేపల్లి కుటుంబం సాయం

  • లాభాలు చూశాక వ్యాపారంలోకి

  • జోగి రాజకీయాల్లోకి వచ్చాక మద్యం వ్యాపారాలన్నీ అద్దేపల్లికే

  • తాజాగా వాట్సాప్‌ చాట్‌ బయటికి..

  • జోగి ‘అన్న’.. ఆ దోస్తీ మిన్న!

  • ఇద్దరి మధ్య వాట్సాప్‌ చాట్‌

జోగి రమేశ్‌తో జనార్దన్‌రావుకు చాలా సాన్నిహిత్యమే ఉందన్న విషయం వారి వాట్సాప్‌ చాటింగ్‌ ద్వారా వెలుగు చూసింది. జోగిని ‘అన్నా’ అని సంబోధించడమే దీనికి ఉదాహరణ. జోగి రమేశ్‌ ఆధ్వర్యంలోనే తాము నకిలీ మద్యం తయారు చేసినట్టు జనార్దన్‌రావు ఇప్పటికే వీడియోలు విడుదల చేశారు. తాజాగా వీరిద్దరికీ మధ్య జరిగిన వాట్సాప్‌ చాటింగ్‌ బయటికి వచ్చింది. ‘కాల్‌ మీ.’ అని జోగి రమేశ్‌.. జనార్దన్‌రావుకు మెసేజ్‌ చేయగా, దానికి ఆయన ‘ఓకే..’ అని సమాధానం ఇచ్చారు. తర్వాత ‘కమ్‌ టు మై హోం.’ అని జోగి నుంచి సందేశం వచ్చింది. అంతేకాదు.. ‘వెన్‌ ఆర్‌ యూ గోయింగ్‌ ఆఫ్రికా. కాల్‌ మీ, ఫేస్‌టైమ్‌’ అని మెసేజ్‌ చేశారు. దీని ప్రకారం జనార్దన్‌రావు ఆయన ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ దిశగానే ఎక్సైజ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చాటింగ్‌ జరిగిన తేదీని బట్టి జోగి రమేశ్‌ ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను సైతం పోలీసులు సేకరిస్తున్నారు.

విజయవాడ, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం కేసు సూత్రధారి అద్దేపల్లి జనార్దన్‌రావు, వైసీపీ నేత, మాజీమంత్రి జోగి రమేశ్‌ మధ్య సన్నిహిత సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. జనార్దన్‌రావుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని జోగి బుకాయించినా.. వాస్తవాలు ఇప్పుడు బట్టబయలయ్యాయి. ఎన్టీఆర్‌ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఒకే వీధిలో ఎదురెదురుగా నివాసం ఉన్న వీరి కుటుంబాల మధ్య మద్యం వ్యాపారం విడదీయలేని బంధాన్ని పెనవేసింది. కల్లుగీత నుంచి మంత్రి వరకు ఎదిగిన జోగి రమేశ్‌ కుటుంబానికి జనార్దన్‌రావు కుటుంబం ఆర్థికంగా సహకారం అందించింది.


ఈ వ్యాపారంలో జోగి కుటుంబం బాగా సంపాదించటంతో హోల్‌సేల్‌ కిరాణా వ్యాపారం నిర్వహించే జనార్దన్‌రావు కుటుంబం కూడా మద్యం వ్యాపారం వైపు అడుగులు వేసింది. కొంతకాలం పరస్పర సహకారాలతో మద్యం వ్యాపారం నిర్వహించారు. వ్యాపార పోటీలో రెండు కుటుంబాల మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. జోగి కుటుంబం రాజకీయంగా ఎదిగే క్రమంలో ఇరు కుటుంబాలు మళ్లీ సన్నిహితమయ్యాయి. రాజకీయంగా, మద్యం వ్యాపారపరంగా పరస్పరం సహకరించుకున్నారు. జోగి రమేశ్‌ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చే సమయానికి వారి మద్యం వ్యాపారం కూడా అదే ్దపల్లి జనార్దనరావు కుటుంబానికి విక్రయించారు. ఈ వ్యాపారంలో రెండు చేతులా ఆర్జించిన అద్దేపల్లి ఆ తర్వాత జగ్గయ్యపేటలోని ఓ ఫ్యాక్టరీ ఏర్పాటుతో ఆర్థికంగా దెబ్బతిని అప్పుల పాలయ్యారు. మద్యం వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. తర్వాత క్రమంలో నకిలీ మద్యం వ్యాపారం దిశగా అడుగులు వేసిన అద్దేపల్లి పునర్వైభవం సాధించారు. తాజాగా అనేక వైన్‌ షాపుల్లో స్లీపింగ్‌ పార్టనర్‌గా ఉంటూ నకిలీ మద్యం ప్లాంట్లు ఏర్పాటు చేసి ఆ వ్యాపారాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాలోనూ డిస్టిలరీ ప్లాంట్‌ ఏర్పాటుచేసే స్థాయికి ఎదిగారు. కల్తీ మద్యం తయారీలో పట్టుబడిన జనార్దన్‌రావు.. జోగి రమేశ్‌ ఆధ్వర్యంలో ఈ పని చేశానని చెప్పటంతో వీరి బంధాలకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.


స్లీపింగ్‌ పార్టనర్‌

ప్రస్తుత ప్రభుత్వంలో వైన్‌ షాపులకు నిర్వహించిన వేలంపాటలలో షాపులు దక్కించుకున్న పలువురితో అద్దేపల్లి ఒప్పందం కుదుర్చుకుని స్లీపింగ్‌ పార్టనర్‌గా చేరారని తెలిసింది. మరికొన్నివైన్‌ షాపులను ప్రత్యక్షంగా దక్కించుకున్నారు. విద్యాధరపురం చెరువు సెంటర్‌లోని ఓ వైన్‌షాపు, మైలవరంలోని రెండు వైన్‌ షాపులలో స్లీపింగ్‌ పార్టనర్‌గా ఉంటూ, ఇబ్రహీంపట్నంలో ఏఎన్నార్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను సొంతంగా నిర్వహిస్తున్నారు.


విలాసాలు-వివాదాలు!

అద్దేపల్లి చుట్టూ వివాదాలు, నేరాలు నిత్యం తిరుగుతుంటాయని పలువురు చెబుతున్నారు. అంతేకాదు, జనార్దన్‌రావు మంచి విలాస పురుషుడని అంటున్నారు. ఆయన సోదరుడు జగన్మోహన్‌రావు కూడా అదే బాటలో పయనించారు. ఇంజనీరింగ్‌ చదివే రోజుల నుంచే జనార్దన్‌రావు ఆలోచనలు నేరపూరితంగా ఉండేవని ఆయన స్నేహితులు చెబుతున్నారు. అద్దేపల్లి జనార్దన్‌రావు తన తాత అద్దేపల్లి నాగేశ్వరరావు(ఏఎన్‌ఆర్‌) పేరుతో బార్‌ను ఏర్పాటు చేశారు. తొలుత జాతీయ రహదారి పక్కన ఈ బార్‌ను నెలకొల్పారు. దీనికి అప్పట్లో టీడీపీకి చెందిన ఓ నేత సహకరించినట్టు స్థానికులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో బార్‌ను తొలగించినా ఈ స్థలంలోనే జనార్దన్‌రావు నకలీ మద్యం తయారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలతో అంటకాగేవారు. బార్‌ ముసుగులో ఆయన చేస్తున్న వ్యాపారాలపై నేతలకు సమాచారం ఉన్నా.. వారు నోరెత్తకుండా అద్దేపల్లి అన్ని ‘ఏర్పాట్లు’ చేసేవారని తెలిసింది.


ఆ నలుగురిని ఒకరోజు కస్టడీకి ఇవ్వండి!

ఏసీబీ కోర్టులో సిట్‌ పిటిషన్‌

విజయవాడ, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో కీలక నిందితులుగా ఉన్న నలుగురిని ఒకరోజు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్‌ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విజయవాడ జిల్లా జైలులో ఉన్న ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, దూనేటి చాణక్య, గుంటూరు జిల్లా జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి పీఏ నవీన్‌ కృష్ణలను బుధవారం ఒకరోజు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ మంగళవారం సాయంత్రం ఈ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనికి నంబర్లు కేటాయించిన కోర్టు బుధవారం విచారణ జరపనుంది.


పది రోజులు కస్టడీకి ఇవ్వండి

కోర్టులో ఎక్సైజ్‌ పోలీసుల పిటిషన్‌

నకిలీ మద్యం కేసులో ప్రధాన సూత్రధారి అద్దేపల్లి జనార్దన్‌రావు నుంచి మరిన్ని వివరాలు రాబట్టాలని ఎక్సైజ్‌ పోలీసులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆయనను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయవాడ ఆరో అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో మంగళవారం పిటిషన్‌ దాఖలు చేశారు. నకిలీ మద్యం వ్యవహారంతో సంబంధం ఉన్న అందరినీ బయటకు లాగడానికి ఆయనను విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కేసులో అన్నమయ్య జిల్లా ఎక్సైజ్‌ అధికారులు అరెస్టు చేసిన నలుగురు నిందితులు ఇక్కడి కేసులోనూ నిందితులుగా ఉన్నారని, వారిపై పీటీ వారెంట్‌ను అనుమతించాలని మరో పిటిషన్‌ దాఖలు చేశారు.


కల్లు-సారాయితో ఎదిగిన జోగి

జోగి రమేశ్‌ కుటుంబం పెద్దగా స్థోమత కలిగిన కుటుంబం కాదు. మొదట్లో కల్లు, సంపూర్ణ మద్య నిషేధం అనంతర పరిణామాల్లో సారా అమ్మేవారు. ఈ వ్యాపారం వారికి కలిసొచ్చింది. ఆ తర్వాత తిరిగి మద్యం ప్రవేశపెట్టాక ఆ వ్యాపారం ప్రారంభించారు. జోగి కుటుంబం మద్యం వ్యాపారం చేయటానికి అద్దేపల్లి జనార్దన్‌రావు కుటుంబమే పెట్టుబడి పెట్టింది. జోగి రమేశ్‌ తమ్ముడు రాము వైన్స్‌ వ్యాపారం నిర్వహించేవారు. ఇబ్రహీంపట్నంలో బార్‌ కూడా నడిపారు. కాలక్రమంలో మద్యం వ్యాపారంలో జోగి కుటుంబం లాభాలు గడించటం చూసి.. అద్దేపల్లి కుటుంబం కూడా మద్యం వ్యాపారం వైపు వచ్చింది. ఇక, జోగి రమేశ్‌ తండ్రి మోహన్‌రావు ఇబ్రహీంపట్నం ఎంపీపీగా చేసిన కాలంలో ఆర్థికంగా అద్దేపల్లి కుటుంబం ఆయనకు సహకరించేది. ప్రతిగా అద్దేపల్లి కుటుంబం మద్యం వ్యాపారానికి ఆయన పరోక్షంగా సహకరించేవారు. జోగి రమేశ్‌ రాజకీయ అరంగేట్రం చేశాక.. క్రమంగా వారి కుటుంబం మద్యం వ్యాపారం నుంచి దూరమైంది.

Updated Date - Oct 15 , 2025 | 04:47 AM