CM Chandrababu: మీరూ సిందూర్ వీరుల్లాంటివారే
ABN , Publish Date - Oct 07 , 2025 | 04:09 AM
స్వచ్ఛాం ధ్ర అవార్డులకు ఎంపికైన విజేతలంతా ఆపరేషన్ సింధూర్ వీరుల్లా కనిపిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశాన్ని శుభ్రపరుస్తున్న పారిశుధ్య కార్మికులంతా దేశభక్తులేనని...
దేశాన్ని శుభ్రపరుస్తున్న దేశభక్తులు మీరు
స్వచ్ఛ విజేతలకు పాదాభివందనాలు: సీఎం చంద్రబాబు
స్వచ్ఛాంధ్ర సాకారంతోనే స్వర్ణాంధ్ర సాధ్యం
ఇక ఏటా స్వచ్ఛ అవార్డులు
సంజీవని ద్వారా కుటుంబానికి కోటి బీమా
పరిశుభ్రత అందరి బాధ్యత.. అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం చంద్రబాబు వెల్లడి
అమరావతి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛాం ధ్ర అవార్డులకు ఎంపికైన విజేతలంతా ఆపరేషన్ సింధూర్ వీరుల్లా కనిపిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశాన్ని శుభ్రపరుస్తున్న పారిశుధ్య కార్మికులంతా దేశభక్తులేనని స్పషటం చేశారు. స్వచ్ఛాంధ్ర సాధ్యం కాకుండా స్వర్ణాంధ్ర సాధన వీలు కాదని వ్యాఖ్యానించారు. సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. జై స్వచ్ఛ సేవక్....అంటూ నినదిస్తూ..సభలోని వారందరితో జై కొట్టించారు. ‘‘ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనికవీరులు ఉగ్రవాదులను ఏరివేశారు. ఆరోగ్యాన్ని పణం పెట్టి పనిచేసే పారిశుధ్య కార్మికులు కూడా అలాంటి వీరులే. స్వచ్ఛ కార్మికులందరికీ ఈ వేదికనుంచి పాదాభివందనం చేస్తున్నాను. మహాత్ముడు స్వచ్ఛతను దైవత్వంతో పోల్చారు. మన ప్రాంతాలు, పరిసరాలు ఇంత స్వచ్ఛంగా ఉన్నాయంటే అందుకు పారిశుధ్య కార్మికులే కారణం. వారు లేకపోతే స్వచ్ఛ ఉద్యమమే లేదు. సూర్యుడు ప్రతిరోజు కాస్త అటు ఇటుగా అయినా ఉదయిస్తాడేమోగానీ, తెల్లవారుజాము 4 గంటలకల్లా వీరు పని మొదలుపెడతారు. వారి రుణం తీర్చుకోలేం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక ఏటా స్వచ్ఛ అవార్డులను ప్రదానం చేస్తామని తెలిపారు. మన స్వచ్ఛ సంకల్పానికి మెచ్చి కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు ఇస్తోందని, ఈ ఏడాది ఏపీకి 5 అవార్డులు దక్కాయన్నారు. విజయవాడ, తిరుపతి, గుంటూరు, గ్రేటర్‌విశాఖ, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్లు పరిశుభ్రతలో రాష్ట్రం పేరు నిలబెట్టాయని వివరించారు.
హోం కంపోస్టింగ్, సోర్స్ సెగ్రిగేషన్, సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ నిషేధం, ఈ-వేస్ట్ మేనేజ్‌మెంట్, బీట్ ద హీట్, గ్రీన్ ఆంధ్రప్రదేశ్ ...ఇలా ఒక్కో నెల ఒక్కో థీమ్‌తో ఫలితాలు సాధించామన్నారు. ప్రజల నుంచి పొడి చెత్త సేకరించి వారికి నిత్యావసరాలు తిరిగిచ్చేలా స్వచ్ఛరథం తెచ్చామని, త్వరలో మరో 100 మండలాలకు రథాలు రానున్నాయని తెలిపారు. గత ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన స్వచ్ఛ భారత్ నిధులను సద్వినియోగం చేసుకోలేకపోయిందని, 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వదిలేసి పోయిందని విమర్శించారు. తిరుమలను కూడా అపరిశుభ్రంగా మార్చారని, చెత్త పన్ను వేసి చెత్తను మాత్రం వదిలేశారని దుయ్యబట్టారు. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి ఏపీని చెత్తరహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని సీఎం తెలిపారు. స్వచ్ఛమైన, పచ్చనైన, ఆరోగ్యకవంతమైన రాష్ట్రం కోసం అందరం పనిచేద్దామని పిలుపునిచ్చారు. యూజ్ అంట్ త్రో పాలసీ కాదు.. యూజ్-రికవరీ-రీయూజ్ పాలసీ అమలు చేస్తున్నామని తెలిపారు. సంజీవని పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ. కోటి బీమా అందించేలా యాక్సెస్ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నామన్నారు. కాగా, ప్రతి నెల మూడో శనివారం సీఎం ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటున్నారని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ‘‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఉన్న 85 లక్షల టన్నుల చెత్తను ఏడాదిలోగా తొలగించాలని సీఎం ఆదేశించారు. ఆయన చెప్పిన దానికంటే 15 రోజుల ముందే చెత్తను తొలగించేశాం’’ అని తెలిపారు. అనంతరం 75 మందికి అవార్డులను ప్రదానం చేశారు.
శుభ్రతలో ఇలా భాగమయ్యాం: విజేతలు
‘‘నాకు 350 ఇళ్లు కేటాయించారు. తడిచెత్త, పొడిచెత్త వేరుచేసే విషయంపై ఉదయం 11 గంటల వరకు ఆ ఇళ్లలోని వారికి అవగాహన కల్పిస్తున్నాం. మధ్యాహ్నం నుంచి కాలువలను శుభ్రపరుస్తున్నాం’’ అని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన విజేత తౌడురాజు సభలో వివరించారు. వంట చేయడం వల్ల వచ్చే చెత్తను కంపోస్టుగా తయారుచేసి కూరగాయాలు పండిస్తున్నవైనాన్ని గుంటూరుజిల్లా పొన్నురు మండలానికి చెందిన విజేత అనే మహిళ తెలిపారు. ఈ సభలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు స్వగ్రామానికి ముఖ్యమంత్రి
తమ్ముడు రామ్మూర్తి సంవత్సరీకానికి హాజరు
తిరుపతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి):ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం స్వగ్రామమైన తిరుపతిజిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెకు రానున్నారు. గతేడాది ఆయన సోదరుడు నారా రామ్మూర్తినాయుడు అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన సంవత్సరీకం సందర్భంగా స్వగ్రామంలో జరిగే కార్యక్రమానికి బాబు హాజరుకానున్నారు. కాగా, మంత్రి లోకేశ్ సహా చంద్రబాబు కుటుంబసభ్యులు సోమవారం రాత్రికే నారావారిపల్లి చేరుకున్నారు.