Share News

Interactive Learning: తరగతి గదిలో క్లిక్కర్‌

ABN , Publish Date - Dec 04 , 2025 | 05:56 AM

పాఠశాల విద్యలో మరో వినూత్న విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో క్లిక్కర్‌ ఆధారిత పునశ్చరణ అమలుకు నిర్ణయించింది.

Interactive Learning: తరగతి గదిలో క్లిక్కర్‌

  • బోధన అనంతరం పునశ్చరణలో అమలు

  • రేపు 53 పాఠశాలల్లో ప్రారంభించనున్న సీఎం

  • ఈ ఏడాదికి చివరికి 2,800 బడుల్లో అమలు

అమరావతి, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యలో మరో వినూత్న విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో క్లిక్కర్‌ ఆధారిత పునశ్చరణ అమలుకు నిర్ణయించింది. తరగతి గదిలో పాఠం బోధించిన తర్వాత క్లిక్కర్‌ ఆధారంగా విద్యార్థులను ప్రశ్నలు అడుగుతారు. తొలుత ప్రతి విద్యార్థికి ఒక క్లిక్కర్‌ ఇస్తారు. అందులో ఏ, బీ, సీ, డీ, ఎస్‌, నో, హ్యాండ్‌ రైజ్‌ తదితర బటన్లు ఉంటాయి. తరగతి గదిలో ఉండే ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్‌( ఐఎఫ్‌పీ)పై అంతకుముందు చెప్పిన పాఠానికి సంబంధించిన ప్రశ్న డిస్‌ప్లే అయినప్పుడు దానికి క్లిక్కర్‌ ద్వారా విద్యార్థులు సమాధానం ఇవ్వాలి. ఏ విద్యార్థి ఏ సమాధానం ఇచ్చాడో ప్యానెల్‌పై కనిపిస్తుంది. ఈ నెల 5న జరిగే మెగా పేరెంట్‌- టీచర్స్‌ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు క్లిక్కర్‌ విధానాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. మొదట 53 పాఠశాలల్లో దీన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి 2,800 పాఠశాలల్లో అమల్లోకి తేవాలని పాఠశాల విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం దశల వారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు క్లిక్కర్‌లు పంపిణీ చేస్తారు. ప్రస్తుతం ప్రతి పాఠశాలకు 40 క్లిక్కర్లతో కూడిన సెట్‌ అందించనున్నారు. తొలుత 9వ తరగతి విద్యార్థుల పాఠాల పునశ్చరణకు వీటిని వినియోగించాలని నిర్ణయించారు.


‘సంక్షేమ విద్యార్థి’ కుటుంబాలకు స్వాంతన: డోలా

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అంబేడ్కర్‌ గురుకులాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు సాంత్వన పథకం భరోసా ఇస్తోందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన ముగ్గురు విద్యార్థుల కుటుంబాలకు సాంత్వన చెక్కులను బుధవారం అమరావతిలోని తాడేపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ కార్యాలయంలో ఆయన అందజేశారు. పల్నాడు జిల్లా ఆర్కేపురం అంబేడ్కర్‌ గురుకులం, ప్రకాశం జిల్లా రాచర్ల గురుకులానికి చెందిన 10వ తరగతి విద్యార్థినులు టి.నీహారిక, కొఠారి కర్ణ, బాపట్ల గురుకులం 7వ తరగతి విద్యార్థిని బి.శ్వేత ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఒక్కో విద్యార్థి కుటుంబానికి మంత్రి రూ.3 లక్షల చెక్కును అందజేశారు. ‘ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి భరోసాగా సాంత్వన పథకం కింద కూటమి ప్రభుత్వం రూ.3లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. అనారోగ్యంతో మరణించిన విద్యార్థుల కుటుంబాలకూ బాసటగా నిలిచేందుకు సీఎం చంద్రబాబు సూచనలతో రూ.5 కోట్లు నిధులు కేటాయించి ఈ పథకం తీసుకొచ్చారు. సంక్షేమ విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెట్టాం. అనారోగ్యానికి గురైన విద్యార్థులను గుర్తించి వెంటనే వైద్యం అందిస్తున్నాం. ఇప్పటివరకు 30 మందికి పైగా విద్యార్థుల ప్రాణాలు కాపాడాం’ అని మంత్రి తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ బి.లావణ్యవేణి, ఎస్సీ గురుకుల సొసైటీ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 04 , 2025 | 05:58 AM