Telugu Education: పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో తరగతులు ప్రారంభం
ABN , Publish Date - Dec 02 , 2025 | 04:48 AM
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు కోర్సుల తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి.
తొలి బ్యాచ్ విద్యార్థులకు అభినందనలు: వీసీ మునిరత్నం
రాజమహేంద్రవరం, డిసెంబరు1(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు కోర్సుల తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. వైస్ చాన్స్‌లర్ ఆచార్య డి.మునిరత్నం నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి తరగతులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్ర పరిధిలో ఇటీవల ఏర్పాటు చేసిన తెలుగు విశ్వవిద్యాలయంలో 2025-26కి సంబంధించి తరగతులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా తొలి బ్యాచ్ విద్యార్థులను అభినందించారు. ఈ యూనివర్సిటీ పరిధిలోని శ్రీశైలం పీఠంలోని చరిత్ర-సంస్కృతి- పురావస్తు శాస్త్ర పీఠాధిపతి డాక్టర్ ములుగు శ్రీనివాసరావు, కూచిపూడిలోని సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాక్షేత్రం వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చింతా రవిబాలకృష్ణతో, ఆయా ప్రాంతాల విద్యార్థులతోనూ వీసీ మునిరత్నం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ విశ్వవిద్యాలయంలో పాఠ్యాంశాలను నిష్టాతులైన అధ్యాపకులు బోధిస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరై తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కూచిపూడి నాట్యగురువు, కుంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ వేదాంతం రాధేశ్యామ్, అధ్యాపకుడు డాక్టర్ వెంకటరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.