City Roads : నగర ప్రయాణం.. నరక ప్రాయం!
ABN , Publish Date - Aug 11 , 2025 | 12:58 AM
నగరంలో ప్రయాణం అంటేనే వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. ఏ రోడ్డుకెళ్లినా గుంతలే దర్శనమిస్తున్నాయి. మోకాలిలోతు గుంతల్లో ప్రయాణించాల్సి రావడంతో నడుములు విరుగుతున్నాయని నగరవాసులు వాపోతున్నారు. పలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. రోడ్లపై గుంతలు చాలవన్నట్లు స్పీడ్ బ్రేకర్లు విసుగు పుట్టిస్తున్నాయి. అవసరం లేని చోట్ల వేస్తున్నారు. ప్రజల కూడా ...
గుంతల రోడ్లతో వాహనదారుల బెంబేలు
ప్రధాన రహదారుల్లోనూ అదే దుస్థితి
చినుకుపడితే భయానకమే..
అనంతపురం క్లాక్‌టవర్, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): నగరంలో ప్రయాణం అంటేనే వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. ఏ రోడ్డుకెళ్లినా గుంతలే దర్శనమిస్తున్నాయి. మోకాలిలోతు గుంతల్లో ప్రయాణించాల్సి రావడంతో నడుములు విరుగుతున్నాయని నగరవాసులు వాపోతున్నారు. పలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. రోడ్లపై గుంతలు చాలవన్నట్లు స్పీడ్ బ్రేకర్లు విసుగు పుట్టిస్తున్నాయి. అవసరం లేని చోట్ల వేస్తున్నారు. ప్రజల కూడా
ఎక్కడపడితే అక్కడ వేసేసుకుంటున్నారు. ఒక్కో రోడ్డులో పదుల సంఖ్యలో స్పీడ్ బ్రేకర్లు ఉండడంతో వాహనదారులు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు.
ఏ దారికెళ్లినా గుంతలే..
అనంత నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలో పైపులైన్ల కోసం గతంలో గుంతలు తీశారు. వాటిని పూడ్చడం మరచిపోయారు. దీంతో ద్విచక్రవాహనాలు, కార్లలో వెళ్లాలంటే ఆ గుంతల్లో దిగాల్సిందే. నగరంలో ఏ వీధిలోకి వెళ్ళినా గుంతలు తప్పవు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క గుంత కూడా పూడ్చిన పాపాన పోలేదు. కొత్త రోడ్డు కూడా వేయలేదు. ఐదేళ్లూ మరమ్మతులు చేయకపోవడంతో గుంతలు విపరీతమయ్యాయి.
చినుకుపడితే అంతే..
నగరంలో చినుకుపడితే గుంతల్లో నీరు నిలబడిపోతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అశోక్‌నగర్‌లోని అంబేడ్కర్ భవన ఎదురుగా ఉన్న గుంతల్లో చినుకుపడి గుంతలు మరింత లోతుగా ఏర్పడ్డాయి. దీంతో మోకాల్లోతు వర్షం నీరు నిల్వ ఉంటుండడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
స్పీడ్ బ్రేకర్లతో బేజారు
నగరంలో అవసరం లేని చోట్ల కూడా స్పీడ్ బ్రేకర్లు వేయడంతో ప్రజలు బేజారవుతున్నారు. నవోదయకాలనీ స్మశానం నుంచి విద్యుత్తునగర్‌లోకి ప్రధాన రహదారి రెండు కిలోమీటర్ల మేర ఉంది. ఇందులో సుమారు 20 స్పీడ్‌బ్రేకర్లు ఉన్నాయి. దీంతో అటుగా రాకపోకలు సాగించే వాహనదారులు విసిగిపోతున్నారు. ఇక్కడ అన్ని స్పీడ్ బ్రేకర్లు అవసరం లేకపోయినా... ఎవరికి వారు స్పీడ్‌బ్రేకర్లు వేసుకున్నారు.
గుంతలు పూడ్చే చర్యలు చేపట్టాం
నగరంలోని రోడ్లలో ఉన్న గుంతలు పూడ్చి, రహదారుల మరమ్మతులు చేపడుతున్నాం. ఇటీవల స్టాండింగ్ కమిటీలో కూడా పలు రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలకు అనుమతిఇచ్చారు. టెండర్లు వేసి పనులు చేపడతాం. ఇక వర్షం పడినపుడు నీరు నిలబడితే భూమి పలచపడి గుంతలు ఏర్పడతాయి. గుంతలు లేకుండా రోడ్లు నిర్మిస్తే వర్షపు నీరు కాలువల్లోకి వెళ్లిపోతుంది. అవసరం ఉన్న చోట మాత్రమే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం.
-బాలస్వామి, నగరపాలక సంస్థ కమిషనర్