Nellore: సినీ ఫక్కీలో గంజాయి స్మగ్లర్ అరెస్ట్
ABN , Publish Date - Aug 18 , 2025 | 04:04 AM
కారుతో పోలీసులను ఢీకొట్టి పరారవుతున్న గంజాయి స్మగ్లర్‌ను నెల్లూరు జిల్లా పోలీసులు సినీ ఫక్కీలో వెంబడించి, కాల్పులు జరిపి పట్టుకున్నారు.
పోలీసులను కారుతో ఢీకొట్టి పరార్.. పోలీసుల చేజింగ్
కాల్పులు జరిపి పట్టుకున్న సీఐ.. నిందితుడు పాత నేరస్థుడు..
2015 నుంచీ గంజాయి సరఫరా
నెల్లూరు(క్రైం) ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): కారుతో పోలీసులను ఢీకొట్టి పరారవుతున్న గంజాయి స్మగ్లర్‌ను నెల్లూరు జిల్లా పోలీసులు సినీ ఫక్కీలో వెంబడించి, కాల్పులు జరిపి పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 22 కేజీల గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నారు. వివరాలివీ.. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ నుంచి కారులో 22 కేజీల గంజాయిని నెల్లూరులోని గంజాయి విక్రేత కోసం తరలిస్తున్నట్లు ఎస్పీ జి.కృష్ణకాంత్‌కు, ఈగల్ టీమ్‌కు సమాచారం అందింది. ఎస్పీ ఆదేశాలతో బాలాజీనగర్ సీఐ కె.సాంబశివరావు తన సిబ్బంది, ఈగల్ టీమ్ కానిస్టేబుల్ ఫిరోజ్‌తో కలిసి ఆదివారం తెల్లవారుజామున జాతీయరహదారిపై కాపు కాశారు. పెన్నా బ్రిడ్జికి ముందు నుంచి కారును పోలీసులు వెంబడించారు. కారు ఎస్వీజీఎస్ కళాశాల వద్ద యూటర్న్ తీసుకొంది. అక్కడున్న ఇద్దరు వ్యక్తులకు గంజాయి ఇచ్చేందుకు నిందితుడు కారు వేగాన్ని తగ్గించాడు. పోలీసులు చుట్టుముట్టడంతో గంజాయి తీసుకునేందుకు వచ్చిన ఇద్దరు పరారయ్యారు. నిందితుడు తప్పించుకునే క్రమంలో పోలీసులను ఢీకొట్టి కారును వేగంగా రివర్స్ తీసి ముందుకు దూసుకెళ్లాడు. వెనుక ఉన్న ఈగల్‌టీమ్ కానిస్టేబుల్ ఫిరోజ్‌ను ఢీకొనడంతో ఆయన ఎగిరి జాతీయరహదారిపై పడ్డాడు.
సీఐ సాంబశివరావు స్మగ్లర్ కారును వెంబడిస్తూ రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. అయినా నిందితుడు కారు వేగం పెంచి ఎన్టీఆర్‌నగర్‌లోకి దూసుకెళ్లి, కారును వదిలి పరుగులు తీశాడు. దీంతో పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. అతడితోపాటు కారును స్వాధీనం చేసుకుని, స్టేషన్‌కు తరలించారు. గాయాలపాలైన కానిస్టేబుల్ ఫిరోజ్‌ను జీజీహెచ్‌కు తరలించారు. నిందితుడు పాత నేరస్థుడని విచారణలో తేలింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన బీరక ప్రకాష్ అలియాస్ సూర్యప్రకాష్ కారుడ్రైవర్. ఈజీ మనీ కోసం కొన్నేళ్లుగా ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని విక్రేతలకు సరఫరా చేస్తున్నాడు. నిందితుడిపై 2015లో నెల్లూరు సంతపేట పోలీసు స్టేషన్, తూర్పుగోదావరి జిల్లా రంగంపేట పోలీసు స్టేషన్, 2022లో ఏలూరు జిల్లా జీలుగుమల్లి, 2023లో ఏలూరు ఎస్‌ఈబీ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో జైలుకు వెళ్లి బయటకు వస్తున్నా అతడి ప్రవర్తనలో మార్పురాలేదు. ఆదివారం తరలిస్తున్న గంజాయి నెల్లూరులోని గంజాయి విక్రేత జాకీరాబీకని పోలీసుల విచారణలో తేలింది.
కానిస్టేబుల్‌కు ఈగల్ ఐజీ పరామర్శ
ఈగల్ విభాగం ఐజీ ఆకే రవికృష్ణ నెల్లూరు చేరుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ ఫిరోజ్‌ను పరామర్శించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీశారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ఈగల్ సెల్ 1972కు, స్థానిక పోలీసుస్టేషన్‌కు సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.