Elamanchili Train Accident: సిగరెట్ నిప్పుతోనే బోగీల్లో మంటలు
ABN , Publish Date - Dec 31 , 2025 | 05:05 AM
అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో టాటానగర్-ఎర్నాకుళం రైలు బోగీలు అగ్నికి ఆహుతి కావడానికి సిగరెట్ స్మోకర్లే కారణమని రైల్వే వర్గాలు అనుమానిస్తున్నాయి.
ఎలమంచిలి రైలు ప్రమాదంలో అధికారుల అనుమానం
విశాఖపట్నం, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో టాటానగర్-ఎర్నాకుళం రైలు బోగీలు అగ్నికి ఆహుతి కావడానికి సిగరెట్ స్మోకర్లే కారణమని రైల్వే వర్గాలు అనుమానిస్తున్నాయి. బ్రేక్ బైండింగ్ వల్ల అంతపెద్దగా మంటలు వచ్చే అవకాశం లేదని చెబుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి ఈ రైలులో బీ-1, ఎం-1 ఏసీ కోచ్‌లలో మంటలు వ్యాపించి పూర్తిగా కాలిపోయిన సంగతి తెలిసిందే. ప్రయాణికుల్లో కొందరిని సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ పలకరించి, ప్రమాదం గురించి ఆరా తీసినపుడు పాట్నాకు చెందిన లాల్ భయ్యా టాయిలెట్స్ సమీపానున్న బెడ్ రోల్స్ నుంచి మంటలు వచ్చినట్లు చెప్పారు. తాను టాయిలెట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు మంటలు గమనించానని అనకాపల్లికి చెందిన మరో ప్రయాణికుడు నాగేంద్ర తెలిపారు. వీరి మాటల ప్రకారం బీ-1 కోచ్‌లో టాయిలెట్ దగ్గరున్న బెడ్ రోల్స్‌లో నుంచి మంటలు వచ్చాయని అర్థమవుతోంది. మరికొందరి నుంచి రైల్వే వర్గాలు కూడా సమాచారం సేకరించాయి. అన్నింటిని క్రోడీకరించాక మంటలకు సిగరెట్లు కారణం అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు. కొన్నిసార్లు డోర్ల దగ్గర సిగరెట్లు కాలుస్తున్నప్పుడు గాలికి నిప్పురవ్వలు ఎగిరి బెడ్ రోల్స్‌పై పడే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ప్రయాణికులకు ఇచ్చే దిండుల్లో ఉండే ఫోమ్ నిప్పునకు వెంటనే అంటుకుంటుందని, ఆ విధంగా బీ-1 కోచ్‌లో మంటలు వ్యాపించి ఉంటాయని అనుమానిస్తున్నారు.