Share News

CID Submits: హైకోర్టుకు పరకామణి నివేదిక

ABN , Publish Date - Dec 03 , 2025 | 05:01 AM

తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీ కేసును లోక్‌ అదాలత్‌లో రాజీ చేసుకున్న వ్యవహారంపై దర్యాప్తు చేసి, నివేదికను సీఐడీ మంగళవారం సీల్డ్‌ కవర్‌లో హైకోర్టు ముందు ఉంచింది.

CID Submits: హైకోర్టుకు పరకామణి నివేదిక

  • సీల్డ్‌ కవర్‌లో అందించిన సీఐడీ

  • రవికుమార్‌ ఆస్తులపై నివేదిక ఇచ్చిన ఏసీబీ

  • వాటిని కోర్టు ఆఫీసర్‌కు అందజేయండి

  • రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌కు హైకోర్టు ఆదేశం

  • సీఐడీ నివేదిక మాకిచ్చేలా ఆదేశించండి

  • రవికుమార్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది అభ్యర్థన

  • తోసిపుచ్చిన జడ్జి.. విచారణ ఎల్లుండికి వాయిదా

అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీ కేసును లోక్‌ అదాలత్‌లో రాజీ చేసుకున్న వ్యవహారంపై దర్యాప్తు చేసి, నివేదికను సీఐడీ మంగళవారం సీల్డ్‌ కవర్‌లో హైకోర్టు ముందు ఉంచింది. ఆ నివేదికను హైకోర్టు రిజిస్ట్రార్‌(జ్యుడీషియల్‌)వద్ద దాఖలు చేసినట్టు తెలిపింది. అలాగే నిందితుడు రవికుమార్‌ ఆస్తుల పై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించామని ఏసీబీ తరఫు స్టాండింగ్‌ కౌన్సిల్‌ కోర్టుకు నివేదించారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌, ఆ నివేదికలను తమ పరిశీలన నిమిత్తం కోర్టు ఆఫీసర్‌కు అందజేయాలని రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌ను ఆదేశించారు. సీఐడీ నివేదికను తమకు అందజేసేలా ఆదేశాలు ఇవ్వాలన్న రవికుమార్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చారు. తదుపరి విచారణను ఈనెల ఐదో తేదీకి వాయిదా వేశారు. టీటీడీ పరకామణిలో జరిగిన చోరీకి సంబంధించిన నమోదైన కేసును టీటీడీ బోర్డు తీర్మానం, ఈవో అనుమతి లేకుండానే 2023 సెప్టెంబరు 9న లోక్‌ అదాలత్‌ వద్ద ఏవీఎ్‌సవో వై.సతీశ్‌కుమార్‌.....రవికుమార్‌తో రాజీ చేసుకున్న వ్యవహారం సమగ్రంగా దర్యాప్తు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. అలాగే పరకామణిలో చోరీకి పాల్పడిన రవికుమార్‌, ఆయన కుటుంబ సభ్యుల స్థిర-చర ఆస్తులు, బ్యాంకు ఖాతాలను పరిశీలించడంతోపాటు, వారు ఆ ఆస్తులు వారి ఆదాయానికి తగ్గట్లే ఆర్జించారా? అనే కోణంలో లోతైన దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించింది. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా, అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పాణిని సోమయాజి వాదనలు వినిపించారు.


కేసు దర్యాప్తు నివేదికను సీల్డ్‌ కవర్‌లో రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌ వద్ద దాఖలు చేశామన్నారు. ఏసీబీ స్టాండింగ్‌ కౌన్సిల్‌ సీతిరాజు శ్యామ్‌ సుందర్‌ స్పందిస్తూ...రవికుమార్‌ ఆస్తుల పై దర్యాప్తు జరిపి నివేదికను కోర్టు ముందు ఉంచామని తెలిపారు. రవికుమార్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సి.నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ... సీఐడీ 156 పేజీలతో నివేదిక దాఖలు చేసినట్లు, 40 మంది సాక్షులను విచారించినట్లు టీటీడీ చైర్మన్‌కు చెందిన ఓ టీవీ చానల్‌ స్ర్కోలింగ్‌ వేసిందని, ఆ నివేదికను తమకు కూడా అందజేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఆ నివేదిక నిందితుడి కోసం కాదన్నారు. ఏపీ సాధు పరిషత్‌ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి తరఫున సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.... వ్యాజ్యంలో తమను ప్రతివాదిగా చేర్చి, వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేశామని, దానిని అనుమతించాలని కోరారు. కేసు విచారణలో కోర్టుకు సహాయకారీగా ఉంటామన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, అవసరమైతే తప్పనిసరిగా మీ సహకారం తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Dec 03 , 2025 | 05:02 AM