Share News

CID Additional Report: పరకామణి చోరీ కేసులో సీఐడీ అదనపు నివేదిక

ABN , Publish Date - Dec 10 , 2025 | 06:24 AM

తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసులో లోక్‌ అదాలత్‌ వద్ద రాజీ వ్యవహారంపై సీఐడీ అదనపు నివేదికను హైకోర్టులో దాఖ లు చేసింది.

CID Additional Report: పరకామణి చోరీ కేసులో సీఐడీ అదనపు నివేదిక

  • రెండు ప్రతులను సీజే ధర్మాసనం ముందు ఉంచాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం

  • నివేదికను పరిశీలించి ఉత్తర్వులు ఇస్తామని స్పష్టీకరణ

అమరావతి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసులో లోక్‌ అదాలత్‌ వద్ద రాజీ వ్యవహారంపై సీఐడీ అదనపు నివేదికను హైకోర్టులో దాఖ లు చేసింది. ఈ అదనపు నివేదిక మరో రెండు సెట్లను సీల్డ్‌ కవర్‌లో రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌కు సమర్పించాలని సీఐడీ డీజీని హైకోర్టు ఆదేశించింది. చోరీ కేసు రాజీకి సంబంధించి లోక్‌ అదాలత్‌ అవార్డ్‌ చట్టబద్ధతను తేల్చేందుకు విచారణ జరుపుతున్న ప్రధాన న్యాయమూర్తి ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం ముందు, అలాగే కోర్టు ఆఫీసర్‌కు అందజేయాలని రిజిస్ట్రీకి సూచించింది. అదనపు నివేదికను కూడా అధ్యయనం చేసి తగిన ఉత్తర్వులు జారీ చేసేందుకు వీలుగా విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. టీటీడీ పరకామణిలో చోరీపై నమోదైన కేసును లోక్‌ అదాలత్‌ వద్ద ఏవీఎస్‌వో వై.సతీష్ కుమార్‌, నిందితుడు రవికుమార్‌తో రాజీ చేసుకున్న వ్యవహారం సమగ్రంగా దర్యాప్తు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. చోరీకి పాల్పడ్డ రవికుమార్‌, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపైన లోతైన దర్యాప్తు చేయాలని ఏసీబీకి స్పష్టం చేసింది.


ఈ ఆదేశాలకు అనుగుణంగా దర్యాప్తు చేసి సీఐడీ, ఏసీబీ డీజీలు వేర్వేరుగా నివేదికలను సీల్డ్‌ కవర్‌లో కోర్టు ముందు ఉంచారు. మంగళవారం వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. న్యాయమూర్తి స్పందిస్తూ.. సీఐడీ అదనపు నివేదిక దాఖలు చేసిన నేపథ్యంలో దానిని కూడా పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. పిటిషన్‌ను నేటికి వాయిదా వేశారు. అంతకుముందు విచారణ ప్రారంభమైన వెంటనే న్యాయవాది ఉన్నం అఖిల్‌ చౌదరి స్పంది స్తూ.. తాను సీఐడీ తరఫున హాజరయ్యానని వివరించారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ఇదే పిటిషన్‌లో ఏపీ సాధుపరిషత్‌ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానందను ప్రతివాదిగా చేర్చుకోవాలని కోరుతూ ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన మీరు.. సీఐడీ తరఫున వాదనలు వినిపించడం సరికాదన్నారు. దీంతో కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు న్యాయవాది అఖిల్‌ చౌదరి తెలిపారు.

Updated Date - Dec 10 , 2025 | 06:25 AM