Share News

CID: పరకామణి రికార్డులు సీజ్‌ చేసిన సీఐడీ

ABN , Publish Date - Oct 15 , 2025 | 05:14 AM

తిరుమల శ్రీవారి ఆలయంలో పరకామణి దొంగతనం కేసులో సీఐడీ బృందం వేగం పెంచింది. ఈ కేసుకు సంబంధించిన సీడీ ఫైల్స్‌, రికార్డులను తిరుమల వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో...

CID: పరకామణి రికార్డులు సీజ్‌ చేసిన సీఐడీ

  • హైకోర్టు ఆగ్రహంతో వేగం పెంచిన దర్యాప్తు సంస్థ

  • ఆధారాలు అందజేసిన బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌

తిరుమల, తిరుపతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో పరకామణి దొంగతనం కేసులో సీఐడీ బృందం వేగం పెంచింది. ఈ కేసుకు సంబంధించిన సీడీ ఫైల్స్‌, రికార్డులను తిరుమల వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సీజ్‌ చేసి స్వాధీన పరుచుకుంది. పరకామణిలో విస్తృత తనిఖీలు నిర్వహించింది. పరకామణిలో డాలర్ల చోరీకి సంబంధించిన కేసును లోక్‌ అదాలత్‌లో రాజీ చేసుకున్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి, కేసును సీఐడీకి అప్పగించిన విషయం తెలిసిందే. అయితే కేసు విచారణలో సీఐడీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు ఆగమేఘాలపై సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు.


ఉదయం 7 గంటల నుంచే...

సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యనార్‌, న్యాయ సలహాదారు లక్ష్మణరావు, ఎస్పీ సుబ్బరాయుడు కలసి మంగళవారం ఉదయం 7 గంటల నుంచే విచారణ మొదలుపెట్టారు. తొలత టీటీడీ విజిలెన్స్‌, పోలీసులతో పోలీసు అతిథి గృహంలో సమీక్షించారు. దొంగతనాన్ని పసిగట్టిన సెక్యూరిటీ గార్డు చంద్రను విచారించి, స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. అంతకుముందు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌ రెడ్డి పరకామణి కేసుకు సంబంధించిన పలు ఆధారాలను డీజీకి అందజేశారు. అనంతరం తిరుమలలోని వన్‌టౌన్‌ పోలీస్టేషన్‌కు చేరుకుని ఈ కేసుకు సంబంధించిన సీడీ ఫైల్స్‌, రికార్డులను, లోక్‌అదాలత్‌ ప్రొసీడింగ్స్‌ను స్వాధీన పరుచుకుని సీజ్‌ చేశారు. తర్వాత తిరుమలలోని నూతన పరకామణి భవనానికి చేరుకుని నిబంధనల ప్రకారం పంచె, బనియన్‌ ధరించి కానుకల విభజన, లెక్కింపులను పరిశీలించారు. సిబ్బంది తనిఖీ విధానాన్ని స్వయంగా వీక్షించారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని సీసీ కెమెరాల ప్రస్తుత ఫుటేజ్‌ను పరిశీలించారు. పరకామణి దొంగతనానికి సంబంఽధించి ఇంకా ఏదైనా ఫుటేజ్‌ ఉందా అనే అంశాలపై ఆరా తీశారు. తిరుమల నుంచి తిరుపతికి చేరుకున్న సీఐడీ బృందం సెకండ్‌ ఏడీఎం కోర్టుకు వెళ్లి న్యాయాధికారిని కలసి మాట్లాడారు. తిరుమల వన్‌ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో రవికుమార్‌పై నమోదైన కేసుకు సంబంధించిన ఫైళ్లు, రికార్డులు కావాలని కోరుతూ మెమో దాఖలు చేశారు. లోక్‌అదాలత్‌లో కేసు రాజీకి సంబంధించిన రికార్డులూ కావాలని అడిగారు. అక్కడ్నుంచి టీటీడీ పరిపాలనా భవనానికి చేరుకుని ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌తో సమావేశమయ్యారు. పరకామణి చోరీ ఘటనకు సంబంధించిన ఫైళ్లు, రికార్డులు కావాలని తిరుపతి సీఐడీ అధికారులు లిఖితపూర్వకంగా కోరారు. అలాగే టీటీడీ పరిపాలనా భవనంలో పరకామణి చోరీ జరిగినప్పటి రోజుల సీసీ కెమెరాల ఫుటేజీలు కావాలని అడిగారు. రోజంతా తనిఖీలు చేసి సుమారు 60 నుంచి 70 ఫైళ్లు, రికార్డులు స్వాధీనం చేసుకుని వెంట తీసుకెళ్లారు.


రేపు హైకోర్టుకు సమర్పిస్తాం

శ్రీవారి పరకామణి కేసుకు సంబంధించి తాము సీజ్‌ చేసిన టీటీడీ బోర్డు తీర్మానాలు, లోక్‌అదాలత్‌లో రాజీ కుదుర్చుకున్న ప్రొసీడింగ్స్‌, కోర్డులోని డాక్యుమెంట్లు, పోలీస్‌ స్టేషన్‌లోని ఫైల్స్‌, రికార్డులను బుధవారం హైకోర్టుకు సమర్పిస్తామని సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యనార్‌ తెలిపారు. ‘మేం ఈ కేసులో ఇన్వెస్టిగేషన్‌ మొదలు పెట్టలేదు. రికార్డులను మాత్రం సీజ్‌ చేశాం. వాటిని హైకోర్టుకు సమర్పిస్తాం’ అని తెలిపారు.

సీసీ ఫుటేజ్‌ను ఎందుకు తొలగించారు?: భానుప్రకాశ్‌రెడ్డి

తిరుమల, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): ‘శ్రీవారి పరకామణిలో భారీగా దొంగతనం జరిగితే ఆ ఫుటేజ్‌ ఎందుకు లేదు? ఎవరు తొలగించారు? ఎవరు తొలగించమన్నారు? వంటి ప్రశ్నలు భక్తుల నుంచి వస్తున్నాయి’ అని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌ రెడ్డి అన్నారు. తిరుమలలోని పోలీస్‌ గెస్ట్‌హౌ్‌సలో సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యనార్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన వ్యక్తులు, శక్తులు, వాటాదారులు, సూత్రదారుల వివరాలన్నీ భక్తుల ముందుకు వస్తాయనే నమ్మకం ఉందన్నారు. ఎవరు వాటాలు వేసుకున్నారు? దొంగతనం చేసిన రవికుమార్‌ను ఎవరు కాపాడారు? అతని ఆస్తులు ఎవరు పంచుకున్నారు?... అన్నీ వెలుగులోకి వస్తాయన్నారు. పరకామణి దొంగలు ఎవరు తప్పించుకునే అవకాశమే లేదన్నారు.

Updated Date - Oct 15 , 2025 | 05:15 AM