Share News

CID Investigation: పత్తి కొనుగోళ్లపై దెబ్బ

ABN , Publish Date - Dec 12 , 2025 | 06:53 AM

గత ఏడాది వేలాది సంఖ్యలో పత్తి బేళ్లను అక్రమంగా అమ్ముకున్నారన్న ఆరోపణలపై సీఐడీ చేపట్టిన విచారణ.. సీసీఐ (కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)లో పరిస్థితులను మరింత గందరగోళంగా మార్చింది.

CID Investigation: పత్తి కొనుగోళ్లపై దెబ్బ

  • గతేడాది బేళ్ల అక్రమ అమ్మకాలపై సీఐడీ విచారణ

  • సీసీఐలో గందరగోళం

  • సీసీ ఫుటేజ్‌ కోసం మిల్లర్లకు జీఎం నోటీసులు

  • మరికొంత సమయం కావాలన్న జిన్నర్లు

  • గుంటూరులో ప్రత్యేక సమావేశానికి ఏర్పాట్లు!

  • సీజన్‌ ఆరంభంలో గందరగోళంతో ఆందోళన

  • కొనుగోలు ప్రక్రియ మరింత మందగించే చాన్స్‌

(గుంటూరు-ఆంధ్రజ్యోతి)

గత ఏడాది వేలాది సంఖ్యలో పత్తి బేళ్లను అక్రమంగా అమ్ముకున్నారన్న ఆరోపణలపై సీఐడీ చేపట్టిన విచారణ.. సీసీఐ (కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)లో పరిస్థితులను మరింత గందరగోళంగా మార్చింది. ఈ సీజన్‌లో రాష్ట్రంలోని సీసీఐ కేంద్రాల్లో నిబంధనల పేరుతో పత్తి కొనుగోలు ప్రక్రియ సరిగా జరగడం లేదని ఇప్పటికే నివేదికలు వచ్చాయి. సీఐడీ విచారణ నేపథ్యంలో గత ఏడాదికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ తీసుకురావాలని పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన మిలర్లకు సీసీఐ జనరల్‌ మేనేజర్‌ నోటీసులు జారీచేయడం కలకలం రేపుతుంది. పత్తి కొనుగోళ్ల ప్రక్రియ ఊపందుకుంటున్న తరుణంలో ఈ నోటీసులు చర్చనీయాంశంగా మారాయి. సీజన్‌ ఆరంభ దశలో సీసీటీవీ ఫుటేజ్‌ పేరుతో గందరగోళం సృష్టించడం వల్ల పత్తి కొనుగోలు ప్రక్రియ మరింత మందగించే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో రూ.140 కోట్ల విలువ చేసే దూది మాయమైందన్న ఆరోపణలపై సీఐడీ విచారణ చేపట్టింది. గతేడాది సీసీఐ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 19 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసింది. దాని నుంచి 3.75 లక్షల దూది బేళ్లను తీశారు. రైతులు తెచ్చిన పత్తిలో తేమ వంటి పేరుతో బయ్యర్లు సరుకు బరువుకు కోత పెడుతుంటారు. ఈ విధంగా సుమారు 40 వేల బేళ్లను బయ్యర్లు అక్రమంగా అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో పత్తి బేలు విలువ రూ.27 వేలు నుంచి రూ.28 వేలు వరకు ఉంది. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా రూ.140 కోట్ల విలువ చేసే దూది బేళ్లను కొందరు బయ్యర్లు అమ్ముకున్నారని ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తుంది.


దీనిపై సీఐడీ అధికారులు ఈ నెల 1న గుంటూరులోని సీసీఐ మేనేజర్‌ కార్యాలయానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఆ తర్వాత సీసీఐ జనరల్‌ మేనేజర్‌ను గుంటూరు సీఐడీ కార్యాలయానికి పిలిపించి మరికొన్ని వివరాలు సేకరించారు. సీసీఐ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌ కావాలని అడిగారు. ఈ నేపథ్యంలో ఈనెల 8 నాటికి సీసీటీవీ ఫుటేజ్‌ అందజేయాలని సీసీఐ మేనేజర్‌ రాష్ట్రంలోని 30 పత్తి కొనుగోలు కేంద్రాల జిన్నర్లకు నోటీసులు ఇచ్చారు. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ డేటా కలిగిన ఫుటేజ్‌ ఇవ్వడం ఎలా సాధ్యం అని మేనేజర్‌ను కలిసి జిన్నర్లు ప్రశ్నించారు. కొంత సమయం ఇవ్వడంతో పాటు ఫుటేజ్‌ తీయడానికి టెక్నీషియన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ప్రతిపాదనపై సీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇదే విషయంపై చర్చించేందుకు రాష్ట్రంలోని జిన్నర్లు శుక్ర, శనివారాల్లో గుంటూరులో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. సీజన్‌ ఆరంభ దశలో ఈ గందరగోళం వల్ల పత్తి కొనుగోలు ప్రక్రియ మరింత మందగించే అవకాశం ఉంటుందని కొందరు వాదిస్తున్నారు. సీఐడీ విచారణ వదంతులు వచ్చిన తర్వాత కొందరు బయ్యర్లు కూడా నిబంధనల ప్రకారమే పత్తి కొనుగోలు చేస్తామని చెబుతున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు ఆగ్రహం రాష్ట్రంలోని సీసీఐ కేంద్రాల్లో నిబంధనల పేరుతో పత్తి కొనుగోలు ప్రక్రియ సరిగా జరగడం లేదని నివేదికలు రావడంతో సీఎం చంద్రబాబు సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది.


కొనుగోళ్ల ప్రక్రియపై బుధవారం ప్రత్యేకంగా సమీక్ష జరిపిన సీఎం.. సీసీఐ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్రానికి, సీసీఐ సీఎండీకి లేఖ రాయాలని సూచించినట్లు తెలుస్తోంది. అన్ని కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు ఇప్పటివరకు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో జిన్నింగ్‌ మిల్లులను ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3 అని విభజించేవారు. ఎల్‌-1 కేంద్రంలో ఖాళీ లేకపోతే ఎల్‌-2, ఎల్‌-3 కేంద్రాల్లో పత్తి కొనుగోలుకు అనుమతించే వారు. కొనుగోలు ప్రక్రియపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత అలాంటి విభజన విధానం తొలగించాలని సీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తుంది. అన్ని కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి ఆ పద్థతి అందుబాటులోకి రానుంది.

Updated Date - Dec 12 , 2025 | 06:55 AM