CID Investigation: సీసీఐ అక్రమాలపై సీఐడీ విచారణ
ABN , Publish Date - Dec 02 , 2025 | 05:24 AM
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)లో గత ఏడాది జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది.
140 కోట్ల రూపాయల అక్రమాలపై దృష్టి
3.75 లక్షల బేళ్లకు 40 వేల బేళ్లు బయ్యర్ల సొంతం
10 శాతం ‘పత్తి మాయం’పై అధికారుల దృష్టి
గుంటూరు కార్యాలయంలో వివరాలు సేకరణ
గుంటూరు సిటీ, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)లో గత ఏడాది జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. సుమారు రూ.140 కోట్లు విలువ చేసే పత్తి బేళ్లు మాయమయ్యాయని ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం విచారణకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సీఐడీ డీఎస్పీ సునీల్ నేతృత్వంలోని అధికారుల బృందం సోమవారం గుంటూరు సీసీఐ కార్యాలయానికి వచ్చి సమాచారం సేకరించారు. సీసీఐ మేనేజర్ రాజేంద్ర షాతో భేటీ అయిన సీఐడీ అధికారులు గత ఏడాది జరిగిన కొనుగోళ్లు, అమ్మకాలపై ఆరా తీసినట్లు సమాచారం. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా సీసీఐ సుమారు 19 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. దాని నుంచి 3.75 లక్షల పత్తి బేళ్లను తీశారు. దీనిలో సుమారు 40 వేల బేళ్లను బయ్యర్లు అక్రమంగా అమ్ముకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఒక్కో బేలు విలువ రూ.27 వేల నుంచి రూ.28 వేల వరకు ఉంది. ఈ లెక్కన గతేడాది రాష్ట్రవ్యాప్తంగా రూ.140 కోట్లు విలువ చేసే బేళ్లను కొందరు బయ్యర్లు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. రైతుకు మద్దతు ధర ఇస్తున్నారన్న పేరుతో కొనుగోలు సమయంలోనే క్వింటాల్ పత్తికి సుమారు 4 నుంచి 5 కేజీల వరకు కోత విధిస్తున్నారు. ఇది కొన్నేళ్లుగా జరుగుతున్నప్పటికీ గతేడాది జరిగిన అవకతవకలపై ప్రభుత్వానికి భారీ సంఖ్యలో ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి వాస్తవాలను నిగ్గు తేల్చాలని సీఐడీని ఆదేశించింది.
స్టాండింగ్, క్వాలిటీ కటింగ్
రైతులు కష్టపడి పండించి సీసీఐ కేంద్రంలో అమ్మకానికి తీసుకువచ్చిన పత్తిని అనేక రకాల పేర్లతో బయ్యర్లు కొల్లగొడుతున్నారు. స్టాండింగ్ అంటే దూది పింజ పొడవు 32 నుంచి 34 మిల్లీమీటర్లు ఉండాలి. అయితే, అంత పొడవు ఇక్కడ ఉండవు. దాంతో వాటికి ధరలో కోత పెడతారు. స్టాండింగ్‌తో పాటు క్వాలిటీ కటింగ్ పేరుతో ఒక్కో క్వింటాల్‌కు 4 నుంచి 5 కేజీల పత్తిని అక్రమంగా తీసుకుంటున్నారు. ఆ పత్తిని యథావిధిగా జిన్నింగ్ చేసిన తర్వాత అదనపు దూది బేళ్లను పక్కకు తీసి అమ్మకాలు జరుపుతారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక క్వింటాల్ పత్తిలో 63 శాతం విత్తనాలు, 32 శాతం దూది, 2 నుంచి 5 శాతం ఉత్పత్తి నష్టం కింద లెక్కిస్తారు. అక్టోబరు తర్వాత వచ్చే పత్తిలో ఔట్ రన్ (సైజు తక్కువగా ఉండే) దూది శాతం పెరుగుతుంది. ఉదాహరణకు 500 క్వింటాళ్ల పత్తిని జిన్నింగ్ వేేస్త 100 బేళ్లు దూది, సుమారు 6 లారీల విత్తనాలు వస్తాయి. అదే లెక్కన బయ్యర్లు రైతుల వద్ద కటింగ్ చేసిన పత్తికి కూడా దూది, విత్తనాలు పక్కకు తీస్తారు.
రంగంలోకి సీబీఐ కూడా!
విశ్వసనీయ సమాచారం ప్రకారం 10 బేళ్ల దూది వస్తే ఒక బేలు అనధికారికంగా బయ్యర్ ఖాతాలో జమ అవుతోందని తెలిసింది. ఈ లెక్కన రాష్ట్రంలో గతేడాది 3.75 లక్షల పత్తి బేళ్లు సీసీఐ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన పత్తి నుంచి తీశారు. దానికి తగినట్లుగానే అదనపు బేళ్లు బయటకు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం పత్తి క్యాండీ(రెండు దూది బేళ్లు కలిపి ఒక క్యాండీ) విలువ రూ.50 వేల పలుకుతోంది. కొందరు బయ్యర్లు, మిల్లుల యజమానులకే వాటిని విక్రయించినట్లు సమాచారం. వీటన్నింటిపై సీఐడీ విచారణ జరిగి అక్రమాలు రుజువు అయితే ఈ వ్యవహారంపై సీబీఐ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది.